– బీజేపీ సమాధానం చెప్పాలి
– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 18 : డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును తుమ్మిడిహట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో నిర్మించడానికి తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని, అసలు ఈ ప్రాజెక్టును కడదామా వద్దా అనే దానిపై బీజేపీ సభ్యులు తమ స్పష్టమైన వైఖరిని చెప్పాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ఎల్నినో ప్రభావం -తెలంగాణ ప్రభుత్వం ముందస్తు చర్యల గురించి శాసనసభలో జరుగుతున్న చర్చలో భాగంగా బీజేపీ సభ్యులు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు గురించి లేవనెత్తడంతో ఆయన జోక్యం చేసుకుని మాట్లాడారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాంగ్రెస్ హయాంలోనే తెలంగాణ ప్రాంతానికి గ్రావిటీ ద్వారా నీళ్లందించాలనే ఆలోచనతో తుమ్మిడిహట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును చేపట్టిన విషయాన్ని భట్టి గుర్తు చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ఈ ప్రాజెక్టును పూర్తిగా పక్కనబెట్టి కాళేశ్వరం వద్ద ప్రాజెక్టు కట్టి లక్ష కోట్ల ప్రజాధనాన్ని వృథా చేసిందని విమర్శించారు. తెలంగాణకు ప్రాణప్రదమైన ఈ ప్రాజెక్టు విషయంలో అటు బీఆరఎస్, ఇటు కేంద్రంలోని బీజేపీ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించాయని మండిపడ్డారు.
అనుమతుల కోసం కేంద్రాన్ని, మహారాష్ట్రను ఒప్పించండి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే నీళ్ల కోసం. ఉమ్మడి రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు కోసం ఏడు మండలాలను ఆంధ్రాకు ఇవ్వడానికి వీల్లేదని సోనియా గాంధీ పట్టుబట్టారు. కానీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కేంద్రం ఆర్డినెన్స్ తెచ్చి రెండు లక్షల ఎకరాల ముంపు భూములతో కూడిన ఏడు మండలాలను ఏపీలో కలిపేస్తే ఆ పార్టీ నోరు మెదపలేదు. అక్కడ రెండు లక్షల ఎకరాలు ఇచ్చేసిన వారు తుమ్మిడిహట్టి వద్ద కేవలం రెండు వేల ఎకరాల ముంపు సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోయారని డిప్యూటీ సీఎం ప్రశ్నించారు. ఒక్క రూపాయి పరిహారం ఎక్కువ ఇచ్చైనా సరే ముంపు భూ బాధితులను ఆదుకోవడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారని, ఆ జిల్లాకు ప్రాణహిత నీళ్లు వరప్రసాదమని పేర్కొన్నారు. బీజేపీ నాయకులు తమ పలుకుబడి ఉపయోగించి కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర జలశక్తి శాఖను, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి అవసరమైన అనుమతులు తీసకురావాలని కోరారు. సభ్యుడు హరీష్ రావు ఇచ్చిన సలహాను తాము సానుకూలంగా స్వీకరించి ప్రాజెక్టు కడతామని చెప్పామని, బీజేపీ సభ్యులు కూడా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కేంద్రంతో మాట్లాడి అనుమతులు తెస్తామని అంటారని ఆశించామని భట్టి చెప్పారు. అయితే మైక్ ఇవ్వగానే ప్రధాన విషయాన్ని వదిలేసి వేరే అంశాల్లోకి వెళ్లిపోయారని ఆక్షేపించారు. ఇప్పుడు మన ముందున్న ప్రధాన ప్రశ్న తుమ్మిడిహట్టి దగ్గర ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు. దీన్ని కడదామా వద్దా.. బీజేపీ సహకరిస్తుందా లేదా స్పష్టంగా చెప్పాలి. మీరు సహకరించినా, సహకరించకపోయినా తమ ప్రభుత్వం మాత్రం భూమి ఆకాశాలు ఒక్కటైనా ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును నిర్మించే తీరుతుంది అని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





