– పంట మార్పిడిపై సహకరించాలి
– కేంద్ర మంత్రి చౌహాన్‌కు సీఎం వినతి
– కేంద్ర మంత్రి చౌహాన్‌కు సీఎం వినతి
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 18 : పీఎంఏవై జీ పథకంలో భాగంగా మొదటి విడతగా రాష్ట్రానికి రెండు లక్షల ఇండ్లను కేటాయించినందుకు కేంద్ర వ్యవసాయ, గృహ నిర్మాణ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు కృతజ్ఞతలు తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మిగిలిన 9.56 లక్షల ఇండ్లను కేటాయించాలని కోరారు. హైదరాబాద్ పర్యటనలో ఉన్న ఆయనను మాదాపూర్‌లో శుక్రవారం సీఎం కలిశారు. 1,56,915 అర్హులైన గ్రామీణ కుటుంబాలకు ఇండ్లు మంజూరు చేయాలని గత జూలైలో కేంద్ర మంత్రికి దిల్లీలో ముఖ్యమంత్రి వినతి పత్రం అందించారు. ప్రస్తుతం రెండు లక్షల ఇళ్లే కేటాయించినందున మిగిలిన ఇండ్లను కూడా కేటాయించాలని కోరారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంపై కేంద్ర మంత్రికి వివరిస్తూ వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయంలో విద్యుత్ వినియోగం పెరిగిందని తెలిపారు. తాగునీరు, విద్యుత్ కొరత తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసిందని వివరించారు. వ్యవసాయ రంగంలో ఎల్ నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్రం నుంచి అవసరమైన సహకారం అందించాలని కోరారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలకు రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యాన్ని అందిస్తున్నామని, సన్న వడ్లకు రూ.500 బోనస్ అందించి ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ఎల్‌నినో నేపథ్యంలో రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను ప్రోత్సహిస్తున్నామని సీఎం వివరించారు. 250 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఫ్రూట్స్, వెజిటబుల్ మార్కెట్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పంట మార్పిడిపై రైతులను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని గుర్తించి సహకరించాలని కేంద్ర మంత్రిని కోరారు. సీఎం వెంట మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.
————————————————————————————————–
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





