ధాన్యం కొనుగోళ్లలో సర్కారు విఫలం

– బీజేపీ చీఫ్ రామచందర్‌రావు ధ్వజం

పరిగి, ప్రజాతంత్ర, మే 25 : రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న ఆలస్యం, కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు భారతీయ జనతా పార్టీ చేపట్టిన ‘రైతు గోస – బీజేపీ భరోసా’ యాత్ర సోమవారం వికారాబాద్ జిల్లా పరిగిలో కొనసాగింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు నాయకత్వంలోని బీజేపీ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం పరిగి వ్యవసాయ కొనుగోలు కేంద్రాన్ని స్వయంగా సందర్శించింది. అక్కడ ఉన్న రైతులతో మాట్లాడి వారి సమస్యలను, ఆవేదనను బృందం సభ్యులు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలోని పరిస్థితులను పరిశీలించిన అనంతరం రామచందర్ రావు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు పండించిన ధాన్యానికి సరైన ధర కల్పించడంలో, సమయానికి కొనుగోళ్లు పూర్తి చేయడంలో, ఐకేపీ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. తాము పండించిన పంటను అమ్ముకోవడానికి రోజులతరబడి కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో నిరీక్షించాల్సి వస్తోందని, అధికారులు, మిల్లు యజమానుల తీరుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు బీజేపీ¾ నాయకుల ప్రతినిధి బృందంతో చెప్పుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు. రైతులు అధైర్యపడాల్సిన అవసరం లేదని, మీ సమస్యల పరిష్కారానికి, ప్రతి గింజనూ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసేలా ఒత్తిడి తెచ్చేందుకు బీజేపీ ఎల్లప్పుడూ రైతుల పక్షాన నిలబడి పోరాడుతుందని రామచందర్ రావు రైతులకు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో బీజేఎల్పీ నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి , శాసనమండలిలో నాయకుడు ఏవీఎన్ రెడ్డి, ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రఘునందన్ రావు, ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు, ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, మల్క కొమురయ్య, బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వాపురం లక్ష్మీనర్సయ్య, నియోజకవర్గ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *