– రెండు రోజుల్లో వడ్ల కొనుగోళ్లు వేగవంతం చేయాలి
– ప్రభుత్వానికి హరీష్‌రావు డెడ్‌లైన్
– మీది మిషన్ మోడ్ కాదు.. కమీషన్ మోడ్
– దిల్లీ ట్రిప్పులు ఆపి లారీల ట్రిప్పులు పెంచాలి
సిద్దిపేట, ప్రజాతంత్ర, మే 25 : లక్షలాది రైతులు అరిగోస పడుతున్నా పట్టింపు లేదంటూ అసెంబ్లీలో బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్‌రావు ప్రభుత్వ తీరుపై తీవ్రంగా ధ్వజమెత్తారు. యూరియా, కరెంటు, రైతుబంధు ఇవ్వడంలో ఫెయిల్ అయిన ప్రభుత్వం.. ఆరుగాలం కష్టపడి పండించిన వడ్లను కొనడంలో కూడా పూర్తిగా విఫలమైందన్నారు. సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్‌పల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సోమవారం సందర్శించి కల్లాల్లో పడిగాపులు పడుతున్న రైతుల కష్టాలను తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కాదు.. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి.. ఇలా ఏ ముఖ్యమంత్రి ఉన్నా రైతులకు ఇంత బాధ, కష్టం ఎన్నడూ రాలేదన్నారు. రాష్ట్రంలో కోటి 40 లక్షల టన్నుల దిగుబడి వస్తుంటే నిన్నటిదాకా 90 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటామని చెప్పిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ 70 లక్షల టన్నులే కొంటామంటున్నారు.. అంటే మిగతా 70 లక్షల టన్నులు రైతులు దళారులకు అమ్ముకుని నష్టపోవాలా అని ప్రశ్నించారు. కేంద్రం కొనకపోతే ఆనాడు కేసీఆర్.. మంత్రులు, ఎమ్మెల్యేలతో దిల్లీలో ధర్నా చేసి కేంద్రం మెడలు వంచారన్నారు. మీకు చేతనైతే దిల్లీ పోయి కొట్లాడండి కానీ రైతులను నట్టేట ముంచకండి అని సూచించారు. రెండుమూడు రోజుల్లో వడ్ల కొనుగోళ్లలో వేగం పెంచి లారీలు, గన్నీ బ్యాగులు పంపి తరుగు లేకుండా కొనకపోతే వేలాదిమంది రైతులతో కలెక్టరేట్‌ను దిగ్బంధిస్తానని హరీష్‌రావు హెచ్చరించారు. నా నియోజకవర్గంలోని నంగనూరు, ఖానాపూర్, ఖాతా, వెంకటాపూర్, నర్మెట, పాలమాకుల, సిద్దిపేట అర్బన్, ఎన్సాన్‌పల్లి, మిట్టపల్లి, రావురూక్ల, రాఘవాపూర్, మల్లారం, సికిందలాపూర్ తదితర గ్రామాల నుంచి రైతులు ఉదయం నుంచి ఫోన్లు చేస్తున్నారు.. మిల్లుల్లో బస్తాకు 43 కిలోలు పెడితేనే దించుకుంటామని బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు తెలిపారన్నారు. దీనివల్ల ఎకరాకు 150 కిలోల చొప్పున రైతులు నష్టపోతున్నారని, ఈ విషయాన్ని డీఎస్‌వో దృష్టికి తీసుకెళ్తే మిల్లర్లతోనే మాట్లాడుకోండి అని బాధ్యతారహితంగా సమాధానం ఇచ్చారన్నారు. మంత్రులెవరూ కొనుగోలు కేంద్రాలకు రావడం లేదని, మిట్టపల్లి, నంగనూరు, చిన్నకోడూరులో రైతులు రాస్తారోకోలు చేస్తున్నా ప్రభుత్వానికి కనికరం లేదని విమర్శించారు. ఇప్పటికి మూడోవంతు మాత్రమే కొన్నారు.. ఇంకా రెండొంతుల వడ్లు ఆరుబయటే ఉన్నాయని చెప్పారు. వర్షాలకు మురుస్తూ వడ్ల కుప్పల మీదనే మెదక్ జిల్లా కొల్చారంలో ఒక రైతు చనిపోయాడని, రాష్ట్రవ్యాప్తంగా 10-12 మంది రైతులు కల్లాల్లో ప్రాణాలు విడిచారని తెలిపారు. ముఖ్యమంత్రిది మిషన్ మోడ్ కాదు.. కమీషన్ మోడ్ అని ఆయన ఎద్దేవా చేశారు. నిన్నటి కేబినెట్ మీటింగ్‌లో రైతుల కష్టాల గురించి మాట్లాడకపోవడం బాధాకరమన్నారు. మార్చి 22న సిద్దిపేట గడ్డ మీద ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి వచ్చి 45 రోజుల్లో రూ.9 వేల కోట్లు రైతుబంధు వేస్తా అని సీఎం చెప్పాడు.. ఇవాళ్టికి 63 రోజులైంది.. ఇంతవరకు రెండెకరాల వారికి తప్ప మిగతా రైతులకు పూర్తిస్థాయిలో రైతుబంధు రాలేదు అని తెలిపారు. కనబడ్డ దేవుళ్లందరి మీద ఒట్లు పెట్టి రుణ మాఫీ చేయకుండా సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పారన్నారు. ఎన్సాన్‌పల్లి కేంద్రంలో నెలన్నర రోజుల్లో ఆరు లారీలు మాత్రమే వచ్చాయంటూ వానలకు వడ్లు తడిసి, మట్టిలో కలిసి చెదలు పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. లారీలు, సంచులు పంపాలని రైతులు మొత్తుకుంటున్నారన్నారు. దిల్లీ ట్రిప్పులు బంద్ చేసి కొనుగోలు కేంద్రాలకు లారీల ట్రిప్పులు పెంచు అని హితవు పలికారు. ఎన్సాన్‌పల్లిలో కనకయ్య అనే రైతు సంచులు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతూ.. మమ్మల్ని వ్యక్తిగతంగా తిడుతున్నారంటూ మీరు ఎన్ని తిట్టినా పడతాం కానీ రైతులకు కాంటాలు పెట్టండి, లారీలు పంపండి అని హరీష్‌రావు డిమాండ్ చేశారు. నాగలక్ష్మి అనే రైతు మక్కలు అమ్మి రెండు నెలలైనా ఒక్క రూపాయి రాలేదన్నారు. మక్కలు, పొద్దుతిరుగుడు, జొన్నలు అమ్మిన రైతులకు వెంటనే ఖాతాల్లో డబ్బులు జమ చేయాలన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



