చెరువుల సంరక్షణ, ప్రభుత్వ భూముల పరిరక్షణ పేరిట తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన హైడ్రా సంస్థకు హైకోర్టులో ఎదురైన తాజా పరిణామం ఒక తీవ్రమైన పాలనాపరమైన సంక్షోభాన్ని సూచిస్తున్నది . ప్రతిష్టాత్మకంగా భావించి ఏర్పాటు చేసిన హైడ్రా అధిపతిపైనే హైకోర్టు వేటు వేయాలని ఆదేశించడం, కొత్తగా ఐజీ స్థాయి అధికారిని నియమించమనడం ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బగా విశ్లేషించవొచ్చు. లోతుకుంట భూ వివాదంలో కోర్టు ఆదేశాలను పదేపదే బేఖాతరు చేశారన్న కారణంగా ఈ ఆదేశాలు జారీచేయడం చట్టబద్ధ పాలన ప్రాధాన్యతను మరోసారి గుర్తుచేసింది. హైడ్రా ప్రాథమిక విధి చెరువులు, నాలాలు, ప్రభుత్వ ఆస్తుల రక్షణే అయినప్పటికీ, లోతుకుంట వంటి ప్రైవేటు భూ వివాదాలలో దూకుడుగా జోక్యం చేసుకోవడంపై జస్టిస్ అనిల్ కుమార్ జూకంటి బెంచ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రంగనాథ్‌పై ప్రస్తుతం 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు పెండింగ్‌లో ఉండటాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఒక ఉన్నతాధికారిపై ఇన్ని కేసులు ఉండటం సరికాదని వ్యాఖ్యానించింది. కోర్టు ఆదేశించిన గడువులోగా హైడ్రా కమిషనర్ సరైన క్షమాపణ అఫిడవిట్‌ను దాఖలు చేయకపోవడం ఈ కఠిన నిర్ణయం వెనుక ప్రధాన కారణం.
లోతుకుంట భూ వివాదంలో జస్టిస్ అనిల్ కుమార్ జూకంటి నేతృత్వంలోని సింగిల్ బెంచ్ ఈ సంచలన తీర్పును వెలువరించడం ప్రభుత్వ సంస్థలు లేదా విపత్తు నిర్వహణ సంస్థలు ఎంత శక్తివంతమైనవైనా, చట్టానికి న్యాయవ్యవస్థ ఆదేశాలకు లోబడి పనిచేయాల్సిందేనన్న అంశాన్ని స్పష్టం చేస్తున్నది . ప్రైవేటు భూ వివాదాల్లో హైడ్రా జోక్యం చేసుకోవడం, తన పరిధిని మించి వ్యవహరించడం వంటి చర్యలపై న్యాయస్థానం వేసిన అక్షింతలతో, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వివాదాస్పద అంశాలపై నిర్ణయాలు తీసుకునేటప్పుడు వెనకడుగు వేసే అవకాశం ఉంది.
హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజకీయంగా కోలుకోలేని అతిపెద్ద ఎదురుదెబ్బగా మారింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వొచ్చిన తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా, ఒక ‘బ్రాండ్’ లాగా ప్రమోట్ చేసిన ఏకైక విభాగం హైడ్రా. ఇప్పుడు ఆ సంస్థ అధిపతినే కోర్టు తప్పుపట్టడం ప్రభుత్వ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసింది. నిజానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్రమ కట్టడాల కూల్చివేతలు, చెరువుల పరిరక్షణ కోసం హైడ్రాను ఒక అస్త్రంగా మార్చుకున్నారు. ప్రభుత్వానికి క్రెడిబిలిటీ తెచ్చిన సంస్థపైనే హైకోర్టు “ప్రభుత్వ వ్యవస్థలపై నమ్మకం పోయింది” అని వ్యాఖ్యానించడం ప్రభుత్వ ఇమేజ్‌ను మసకబార్చింది. నోటీసులు ఇవ్వకుండా, కోర్టు స్టే ఆర్డర్లు ఉన్నప్పటికీ కూల్చివేతలకు వెళ్లడం వంటి హైడ్రా చర్యలను ప్రతిపక్షాలు మొదటి నుంచీ విమర్శిస్తున్నాయి. కమిషనర్ ప్రవర్తనను ‘హాబిచ్యువల్ అఫెండర్’ (అలవాటు పడిన నేరస్థుడు) తరహాలో ఉందంటూ కోర్టు తీవ్రమైన పదజాలం వాడటం, ఏకంగా అరెస్ట్ ఆర్డర్ (తర్వాత ఉపసంహరించుకున్నారు) జారీ చేసే వరకు వెళ్లడం ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఎత్తిచూపినట్లయింది.
కాంగ్రెస్ ప్రభుత్వం చట్ట వ్యతిరేకంగా, కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని ప్రతిపక్షాలైన బీఆర్‌ఎస్ , బీజేపీలు చేస్తున్న ఆరోపణలకు ఈ కోర్టు తీర్పు ఒక బలమైన సాక్ష్యంగా దొరికినట్లయింది. సెక్రటేరియట్‌లో కూర్చునే పెద్దలకు (సీఎం, మంత్రులు) రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియాలి అంటూ కోర్టు చేసిన వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి పరిపాలనా పర్యవేక్షణ లోపాన్ని సూటిగా ప్రశ్నించాయి. ఒకే అధికారిక సంస్థ అధిపతిపై 63 కోర్టు ధిక్కరణ కేసులు నమోదవడం, కోర్టు ఆదేశాలు ఉల్లంఘిస్తే ఉద్యోగాలే ఊడుతాయనే పరిస్థితి రావడం ఐఏఎస్/ఐపీఎస్ అధికారులలో భయాందోళనలు సృష్టించడం ఖాయం. ఇకపై సీఎం లేదా ప్రభుత్వం చెప్పే వివాదాస్పద ఆదేశాలను అమలు చేయడానికి అధికారులు వెనకడుగు వేసే అవకాశం ఉంది. ఇది రేవంత్ రెడ్డి దూకుడు నిర్ణయాలకు పెద్ద అడ్డంకిగా మారుతుందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ అధికారిక వ్యవస్థను చూపిస్తూ తమకంటూ ఒక ప్రత్యేకమైన ‘అగ్రెసివ్’ ఇమేజ్ క్రియేట్ చేసుకుందో, అదే వ్యవస్థ అధిపతిని కోర్టు ధిక్కరణ కింద తొలగించాల్సి రావడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తిగత ప్రతిష్టకు, ఆయన ప్రభుత్వ చట్టబద్ధతకు తగిలిన అతిపెద్ద దెబ్బ.
సింగిల్ జడ్జి (జస్టిస్ అనిల్ కుమార్ జూకంటి) ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ అడ్వకేట్ జనరల్ ద్వారా ఇద్దరు జడ్జిలతో కూడిన డివిజన్ బెంచ్ (ద్విసభ్య బెంచ్) లేదా చీఫ్ జస్టిస్ బెంచ్ ముందు అప్పీల్ దాఖలు చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది . కమిషనర్‌ను పదవి నుంచి తొలగించాలనే సింగిల్ జడ్జి ఆదేశాలపై తక్షణమే స్టే తీసుకురావడం ద్వారా ఎవి రంగనాథ్‌ను ప్రస్తుతానికి అదే పదవిలో కొనసాగించేలా లీగల్ సేఫ్‌గార్డ్స్ కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది . గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం అఫిడవిట్ ఇవ్వకుండా, దానికి బదులుగా వేరే పిటిషన్ వేస్తామని హైడ్రా కౌన్సిల్ కోర్టుకు తెలపడంపైనే జడ్జి ఆగ్రహం వ్యక్తంచేశారు. అందువల్ల, లోపాలను సవరించుకుంటూ ఉన్నత బెంచ్ ముందు పూర్తిస్థాయి వివరణ లేదా అఫిడవిట్ సమర్పించే అవకాశం ఉంది. ఒకవేళ హైకోర్టు డివిజన్ బెంచ్‌లో కూడా చుక్కెదురైతే ప్రభుత్వం దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంటుంది.
ప్రభుత్వం పైకోర్టులకు వెళ్లినా గట్టి సవాళ్లు ఎదుర్కొనక తప్పదు. ఎందుకంటే ఇది సాధారణ పరిపాలనా ఉత్తర్వు కాదు, కోర్టు ధిక్కరణ కేసులో ఇచ్చిన శిక్షాత్మక ఆదేశం. న్యాయస్థానం ఇచ్చిన గడువులోగా కమిషనర్ క్షమాపణ అఫిడవిట్ సమర్పించకపోవడం వల్లే కోర్టు ఈ చర్య తీసుకుంది. ఒకే అధికారిపై హైకోర్టులో ఏకంగా 63 కోర్టు ధిక్కరణ కేసులు పెండింగ్‌లో ఉండటం, కోర్టు ఆదేశాలను పదేపదే ఉల్లంఘించారనే వ్యాఖ్యలు రికార్డులో ఉండటం వల్ల, పైకోర్టులు కూడా ఈ వ్యవహారంలో త్వరగా స్టే ఇవ్వడానికి వెనకాడవొచ్చు. పైకోర్టుల నుండి స్టే ఆర్డర్ వొచ్చే వరకు లేదా కొత్త ఉత్తర్వులు జారీ అయ్యే వరకు, ప్రస్తుత సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం కమిషనర్‌ను తప్పించే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించాల్సి ఉంటుంది. లేకపోతే అది మరింత తీవ్రమైన కోర్టు ధిక్కరణకు దారితీస్తుంది. ఈ హఠాత్ పరిణామంతో ముఖ్యమంత్రి కార్యాలయం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సచివాలయం అత్యవసరంగా స్పందించాల్సి వొచ్చింది. కోర్టు ఆదేశాలను గౌరవిస్తూనే, ప్రభుత్వ ప్రాధాన్యతలను సమర్థవంతంగా అమలు చేయగల సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లను పరిశీలిస్తున్నారు. కొత్త కమిషనర్ పేరుపై ప్రభుత్వం ఇంకా అధికారికంగా ఎలాంటి జీఓ లేదా ప్రకటన విడుదల చేయలేదు. ఒకవేళ డివిజన్ బెంచ్ నుండి ప్రభుత్వానికి స్టే లభించకపోతే, రాబోయే కొన్ని గంటల్లోనే కొత్త అధికారి పేరు ఖరారయ్యే అవకాశం ఉంది.





