కేంద్ర గణాంక శాఖ విడుదల చేసిన మొట్టమొదటి జిల్లా స్థాయి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నివేదిక ప్రకారం, తెలంగాణలో 15 నుంచి 29 ఏళ్ల వయసున్న యువతలో దాదాపు 26.2% నుండి 26.5% మంది ఎటువంటి చదువు, ఉద్యోగం లేదా నైపుణ్య శిక్షణ లేకుండా ‘‘నీట్’’ (NEET — Not in Employment, Education or Training విద్య, ఉపాధి లేదా శిక్షణలో లేరు) కేటగిరీలో ఉన్నారు. అంటే రాష్ట్రంలో ప్రతి నలుగురు యువతీ యువకుల్లో ఒకరు పూర్తిగా ఉపాధి, విద్యా అవకాశాలకు దూరంగా ఉన్నారని స్పష్టమవుతున్నది . నివేదిక రాష్ట్రంలో మానవ వనరుల వినియోగంలో ఉన్న భారీ అంతరాలను , జిల్లాల వారీగా ఉన్న అసమానతలను స్పష్టం చేస్తున్నది . భారతదేశం ‘డెమోగ్రాఫిక్ డివిడెండ్’ (యువశక్తి ఆధిక్యత) సంపదతో తులతూగుతుందని సంబరపడుతున్న వేళ ఈ క్షేత్రస్థాయి వాస్తవాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
తెలంగాణ యువత ఉపాధి లేదా విద్యా రంగాల్లో భాగస్వాములు కాకపోవడం అనేది కేవలం ఒక సంఖ్య కాదు, అది రాష్ట్ర మానవ వనరుల సామర్థ్యం వృధా అవుతుందనడానికి స్పష్టమైన నిదర్శనం.రాష్ట్రంలో ఉన్నత విద్య, సాంకేతిక విద్యను అభ్యసించే వారి సంఖ్య పెరిగినప్పటికీ, మార్కెట్ డిమాండ్‌కు, యువత నైపుణ్యాలకు మధ్య పెద్ద లోపం ఉందనేది నిపుణులు తేల్చిచెబుతున్న మాట! డిగ్రీలు, డిప్లొమా సర్టిఫికెట్లు వొస్తున్నా, కార్పొరేట్ లేదా ఆధునిక పరిశ్రమలకు కావలసిన నైపుణ్యాలు యువతలో లోపించాయి. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా ఐటీ, అనుబంధ సేవా రంగాల చుట్టూనే కేంద్రీకృతమై ఉండటంతో, సాధారణ డిగ్రీలు చదివిన గ్రామీణ యువతకు తగిన ఉద్యోగాలు లభించడం లేదు. అయితే పైన పేర్కొన్న యువత అంతా నిరుద్యోగులేనని నిర్ధారించలేమని ఆర్థికవేత్తల అభిప్రాయం! ఎందుకంటే తెలంగాణలో నోటిఫికేషన్ల కోసం, పోటీ పరీక్షల కోసం కోచింగ్ సెంటర్లలో లేదా ఇళ్ల వద్దే ఉంటూ ఏళ్ల తరబడి ప్రిపేర్ అవుతున్న యువత చాలా మంది ఉన్నారు. వీరు అధికారికంగా ఏ కాలేజీలోనూ చదవడం లేదు, ఉద్యోగమూ చేయడం లేదు. చదువుకున్న చదువుకు తగిన గౌరవప్రదమైన వేతనం, శాశ్వత ఉపాధి లభించకపోవడంతో చాలా మంది తాత్కాలిక లేదా తక్కువ వేతనాల ఉద్యోగాల్లో చేరడానికి ఇష్టపడటం లేదు.
ఈ సర్వేలో అత్యంత ఆందోళనకరమైన అంశం లింగ అసమానత. 15–29 ఏళ్ల మధ్య వయసున్న యువతులలో ఈ ‘నీట్’ శాతం పురుషుల కంటే చాలా ఎక్కువగా ఉంది. పురుషులలో నీట్ రేటు చాలా జిల్లాల్లో 10% నుండి 18% లోపే ఉంది. యువకులు ఏదోవిధంగా తాత్కాలిక ఉపాధి మార్గాలను ఎంచుకోవడం లేదా తక్కువ వేతనాలకైనా ఏదో ఒక పనిలో చేరిపోతుండటమే దీనికి ప్రధాన కారణం. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం వంటి జిల్లాల్లో ప్రతి 10 మంది యువతులలో దాదాపు 6 గురు చదువుకు, ఉద్యోగానికి లేదా ఎలాంటి శిక్షణకూ దూరంగా ఇంట్లోనే ఉండిపోతున్నారు. తెలంగాణలోని దాదాపు మూడు వంతుల జిల్లాల్లో యువతుల నీట్ రేటు 25% కంటే ఎక్కువే నమోదైంది.పెళ్లిళ్లు కావడం, గృహోపకరణ పనులు లేదా కుటుంబ సంరక్షణ వంటి బాధ్యతల వల్ల గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత మహిళలు శ్రామిక శక్తిలోకి రాలేకపోతున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి వంటి ఐటీ కారిడార్ జిల్లాల్లో ఉపాధి, శిక్షణా అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి.
ఉమ్మడి మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ వంటి వెనుకబడిన జిల్లాల్లో ఉపాధి అవకాశాలు లేక, సాంప్రదాయ వ్యవసాయంపైనే ఆధారపడలేక యువత గందరగోళంలో పడుతున్నది . ఇక భద్రాద్రి కొత్తగూడెంలో నీట్ రేటు అత్యధికంగా అంటే 42.7% నమోదుకాగా, తర్వాతి స్థానాలను ఖమ్మం 38.2%, నిజామాబాద్ 31.6%, వికారాబాద్‌లో 30.3% ఆక్రమించాయి. కామారెడ్డి జిల్లాలో కనిష్టంగా 18.4% మాత్రమే నీట్ రేటు నమోదైంది. అంటే ఇక్కడి యువత చదువుల్లో లేదా ఏదో ఒక ఉపాధి/పనుల్లో ఎక్కువగా నిమగ్నమై ఉన్నారని అర్థం. దీని తర్వాత నల్గొండ (22%), జగిత్యాల (22%), సంగారెడ్డి (22.5%) జిల్లాలు తక్కువ నీట్ రేట్లతో మెరుగైన స్థానాల్లో నిలిచాయి. ఈ గణాంకాలు రాష్ట్రంలో ఒకే రకమైన విద్యా ముఖచిత్రం లేదని, బొగ్గు గనులు, అటవీ ప్రాంతాలు ఎక్కువగా ఉన్న భద్రాద్రి కొత్తగూడెం వంటి జిల్లాల్లో యువతకు ప్రత్యామ్నాయ ఉపాధి, నైపుణ్య శిక్షణా అవకాశాలు కల్పించాల్సిన అవసరం చాలా ఉందని స్పష్టం చేస్తున్నాయి.
కేవలం సంప్రదాయ డిగ్రీలకే పరిమితం కాకుండా, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కోడింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కార్పెంట్రీ, మెటల్ వర్క్ వంటి వృత్తి విద్యా రంగాలలో ఆధునిక సాంకేతికతను జోడించి ఉపాధి కల్పించాలి.పరిశ్రమలను కేవలం హైదరాబాద్ చుట్టూనే కాకుండా ద్వితీయ శ్రేణి నగరాలకు తరలించడం ద్వారా గ్రామీణ యువతకు స్థానికంగానే అవకాశాలు దొరుకుతాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలు, స్థానిక కుటీర పరిశ్రమలు, మహిళా స్టార్టప్‌లకు చేయూతనివ్వడం ద్వారా యువతులను ఉత్పాదక రంగంలోకి తీసుకురావొచ్చు.తెలంగాణ సాధించిన ప్రగతికి యువత శక్తే మూలాధారం. జిల్లా స్థాయి పీఎల్ ఎఫ్ 2025 నివేదిక ఇచ్చిన ఈ హెచ్చరికను ప్రభుత్వం , సామాజిక విశ్లేషకులు ఒక అవకాశంగా మలుచుకోవాలి. మానవ వనరులపై సరైన పెట్టుబడి పెట్టకపోతే, ఈ ‘డెమోగ్రాఫిక్ డివిడెండ్’ కాస్తా భవిష్యత్తులో ‘డెమోగ్రాఫిక్ డిజాస్టర్’గా మారే ప్రమాదం ఉంది.





