మహానగరానికి తాగునీటితో పాటు సేద్యంలోకి కొత్త ఆయకట్టు
అదే తరహాలో నిజాంసాగర్ కు గోదావరి జలాలు
సింగూరు ప్రాజెక్ట్‌లో పూడిక తీతకు సన్నద్ధం
పూడిక తీతతో మహనగరానికి సమృద్ధిగా తాగునీరు..
కాలువల లైనింగ్ కు టెండర్ల ప్రక్రియ మొదలు పెట్టండి
మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి
ఉమ్మడి మెదక్ జిల్లా నీటిపారుదల ప్రాజెక్ట్‌లు, ఎత్తిపోతల పథకాలపై సమీక్ష
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 27: సింగూరు, మంజీరా రిజర్వాయర్లకు గోదావరి జలాలను తరలిస్తామని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. తద్వారా మహానగరం హైదరాబాద్ ప్రజల దాహార్తికి శాశ్వత పరిష్కారంతో పాటు సింగూరు, మంజీరా రిజర్వాయర్ల కింద సేద్యంలోకి కొత్త ఆయకట్టును తీసుకువొస్తామని ఆయన తెలిపారు. అదేవిధంగా నిజాంసాగర్ ను కూడా గోదావరి జలాలతో నింపుతామని ఆయన చెప్పారు. బుధవారం ఎర్రమంజిల్ కాలనీలోని జలసౌధలో ఉమ్మడి మెదక్ జిల్లా నీటిపారుదల ప్రాజెక్ట్ లు,ఎత్తిపోతల పథకాలపై ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు.ఇందులో వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ, మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి, నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఆర్&ఆర్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, ఇఎన్‌సిలు అనిల్ కుమార్, నాగేందర్ రావు, సిఇ ధర్మ తదితరులు పాల్గొన్నారు. సింగూరు ప్రాజెక్ట్ లో పూడికతీతకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర జల వనరుల సంఘం రూపొందించిన విధానం ప్రకారమే పూడిక తీత పనులు చేపడుతున్నట్లు ఆయన చెప్పారు.
యుద్దప్రాతిపదికన పూడిక తీత పనులు చేపట్టాలని మంత్రి సూచించారు పూడిక తీత ద్వారా నీటి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. అందుకు గాను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. అంతేగాకుండా సింగూర్ కాలువల లైనింగ్ కు టెండర్లు పిలువలన్నారు ప్రధానంగా టెండర్లు పూర్తి చేసుకుని ఒప్పందాలు కుదుర్చుకున్న పనులు మొదలు పెట్టని బసనేశ్వర్, సంఘమేశ్వర ఎత్తిపోతల పథకాలను సత్వరమే మొదలు పెట్టాలన్నారు. అంతే కాకుండా పెద్దారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రతిపాదనలు సిద్ధం చేసి పాలనాపరమైన అనుమతులు తీసుకోవాలన్నారు.
అన్ని పూర్తయితే డిసెంబర్ మాసం లోపు శంకుస్థాపన జరుపుకోవచ్చని ఆయన సూచించారు. పెద్దారెడ్డిపల్లి ఎత్తిపోతల పధకానికి సుమారు 660 కోట్లు అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు అదే విధంగా అర్ధంతరంగా ఆగిపోయిన ప్యాకేజ్ 19 ఏ పనులు తక్షణమే పునరుద్ధరించాలన్నారు ప్యాకేజీ 19 ఏ పునరుద్ధరణకు 600 కోట్లుగా అంచనా వేస్తున్నట్లు తెలిపారు ప్యాకేజ్ 17,18,19 ల పనులలో వేగవంతం చేయాలన్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని నల్లవాగు మీడియం ప్రాజెక్ట్ కెనాల్ మరమ్మతులతో పాటు మొత్తం జిల్లాలోని 38 చిన్న నీటిపారుదల చెరువుల మరమ్మతులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆమోదం తెలిపారు. అంతే కాకుండా నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలో కారముంగి ఎత్తిపోతల పథకానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.





