– మాజీ మంత్రి హరీశ్ రావు
ఎల్బీనగర్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26: సాధారణ పాఠశాలలు ఉత్తమ పౌరులను తయారు చేస్తే రైతులను నిజంగా రాజులను చేయాలనే మహత్తర లక్ష్యంతో రైతు బడి ఏర్పడిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు తెలిపారు. ఎల్బీ నగర్ చిత్రా లేఅవుట్‌లో శనివారం నిర్వహించిన ‘రైతు బడి గ్రూప్’ గ్రాండ్ లాంచ్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. డిజిటల్ యుగంలో ఆధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చినప్పటికీ వ్యవసాయ రంగంలో రావాల్సినంత పురోగతి ఇంకా రాలేదన్నారు. ఆ లోటును భర్తీ చేస్తూ రైతులకు అవసరమైన టెక్నాలజీ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, లాభదాయక పంటలు, మార్కెటింగ్ సమాచారాన్ని అందించే ఒక అనుసంధాన వేదికగా రైతు బడి నిలుస్తుందని ఆకాంక్షించారు. ఇక్కడ రైతులే ఉపాధ్యాయులని, వారి క్షేత్రస్థాయి అనుభవాలే పాఠాలని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో కుంకుడు కాయల సాగు ద్వారా ఆదాయం పొంది మార్గదర్శకంగా నిలిచిన పద్మనాభం ఉదాహరణను ఆయన గుర్తుచేశారు. పంటల వారీగా, జిల్లాల వారీగా 30 యూట్యూబ్ ఛానళ్లు, ఒక మ్యాగజైన్ ప్రారంభించి 30 లక్షల మంది వీక్షకులకు చేరువైన నిర్వాహకుడు రాజేంద్ర ప్రయత్నాన్ని హరీశ్ రావు ప్రత్యేకంగా అభినందించారు. సిద్ధిపేట ప్రాంతంలో తాను స్వయంగా చొరవ తీసుకుని వేలాది ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు ప్రోత్సహించానని, నాలుగైదేళ్ల వ్యవధిలోనే రైతులు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల కంటే మెరుగైన ఆదాయాన్ని ఆర్జిస్తున్నారని తెలిపారు. రైతుల్లో కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన చాలా ఉందన్న హరీశ్ రావు రైతు బడి ద్వారా వారికి సరైన మార్గదర్శకత్వం లభిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. సంపూర్ణ మద్దతు తెలపడమే కాక ఈ సంస్థ మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




