సురక్షిత రహదారుల నిర్మాణమే లక్ష్యం

– రోడ్డు ప్రమాద మరణాలను 50 శాతం తగ్గించేందుకు సమిష్టి కృషి
– బ్లాక్ స్పాట్లను గుర్తించడమే కాదు
– శాశ్వత ఇంజినీరింగ్ పరిష్కారాలు చూపాలి
– రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి
– చింతన్ శివిర్‌లో కీలక ప్రసంగం

ఎక్తానగర్ (గుజరాత్), అక్టోబర్ 6 : రహదారి భద్రతకు సంబంధించి కేవలం ప్రమాణాలు, మార్గదర్శకాలు రూపొందించడమే కాకుండా వాటిని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసి సురక్షితమైన రహదారులను అందించడమే ప్రభుత్వాల అసలైన లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. గుజరాత్‌లోని నర్మద జిల్లా ఎక్తానగర్ (స్టాచ్యూ ఆఫ్ యూనిటీ) ప్రాంగణంలో జరుగుతున్న ‘చింతన్ శివిర్-2026’ సదస్సులో రెండో రోజు ఆయన పాల్గొన్నారు. డిజైనింగ్ సేఫ్ హైవేస్-ఫ్రమ్ స్టాండర్డ్స్ టు ఇంప్లిమెంటేషన్ అనే అంశంపై జరిగిన ప్రత్యేక సెషన్‌కు అధ్యక్షత వహించి కీలకోపన్యాసం చేశారు. ప్రపంచంలోని అనేక దేశాలు రోడ్డు భద్రతను ఒక ప్రత్యేక వృత్తిపరమైన విభాగంగా పరిగణిస్తున్నాయని మంత్రి తెలిపారు. రహదారిపై ఒక్క మరణం లేదా తీవ్ర గాయం కూడా ఆమోదయోగ్యం కాదనే స్వీడన్ దేశపు ‘విజన్ జీరో’ విధానాన్ని, అలాగే ఆస్ట్రేలియా అనుసరిస్తున్న ‘సేఫ్ సిస్టమ’ విధానాలను భారతీయ పరిస్థితులకు అనుగుణంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. డిజైన్ దశ నుంచి నిర్వహణ వరకు నిరంతరంగా రోడ్డు భద్రతా ఆడిట్లు జరగాలని, ఇందుకోసం స్వతంత్ర ‘రోడ్డు భద్రతా అంబుడ్స్‌మన’ లేదా ‘సేఫ్టీ అథారిటీ’ వ్యవస్థ ఏర్పాటును పరిశీలించాలని సూచించారు.
ఎన్‌హెచ్-65 విస్తరణకు వెంటనే శ్రీకారం చుట్టాలి
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి (ఎన్‌హెచ్-65)పై నిత్యం జరుగుతున్న ప్రమాదాలపై ఈ సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. బ్లాక్ స్పాట్లను గుర్తించి ఫ్లై ఓవర్లు నిర్మిస్తున్నప్పటికీ ప్రస్తుతం ఉన్న 4-లేన్ల రహదారిపై ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయిందన్నారు. ఈ రహదారిని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వెంటనే 6G2 లేన్లుగా విస్తరించాల్సిన అవసరం ఉందని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచఏఐ) ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ విస్తరణపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సానుకూలంగా ఉన్నారని, త్వరలో కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపి పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారని మంత్రి వెల్లడించారు.

బ్లాక్ స్పాట్లకు శాశ్వత పరిష్కారాలు

ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించడంతోనే పని అయిపోయిందని అనుకోకుండా, అక్కడ శాశ్వత ఇంజినీరింగ్ పరిష్కారాలను చూపాలని మంత్రి స్పష్టం చేశారు. సరైన జంక్షన్లు, సర్వీస్ రోడ్లు, పాదచారుల సౌకర్యాలు కల్పించడానికి భూసేకరణ అత్యంత కీలకమన్నారు. సీసీటీవీ నిఘా, జీఐఎస్ మ్యాపింగ్, డ్రోన్లు వంటి సాంకేతికతలను విస్తృతంగా ఉపయోగించి ప్రమాదాలను ముందే పసిగట్టాలన్నారు.

కాపాడిన ప్రాణాలే గీటురాయి

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నిర్దేశించిన విధంగా 2030 నాటికి రోడ్డు ప్రమాద మరణాలను 50 శాతం తగ్గించేందుకు అన్ని రాష్ట్రాలు కలిసికట్టుగా పనిచేయాలని కోమటిరెడ్డి పిలుపునిచ్చారు. భద్రతతో కూడిన డిజైన్, నిర్మాణం, నిర్వహణ, సాంకేతికత వినియోగం, నిరంతర సమీక్ష అనే ఐదు అంశాలపై ప్రధానంగా దృష్టి సారించాలన్నారు. హైవే ప్రాజెక్టుల విజయాన్ని ఎన్ని కిలోమీటర్లు నిర్మించాం, ఎంత సమయం తగ్గించాం అనే లెక్కలతో కాకుండా మనం ఎన్ని ప్రాణాలను కాపాడగలిగాం అనే ఏకైక ప్రశ్నతోనే కొలవాలని మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు. కార్యక్రమంలో స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, నేషనల్ హైవేస్ చీఫ్ ఇంజినీర్ ధర్మారెడ్డి, ఇతర రాష్ట్రాల ఉన్నతాధికారులు, ఐఐటీ ప్రొఫెసర్లు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *