ఏడాదిలోపే ఇందిరమ్మ టవర్స్ పూర్తి

– టవర్స్‌ను వేగంగా నిర్మించే కాంట్రాక్టర్లకు ప్రోత్సాహకాలు
– రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 6 : క్యూర్ పరిధిలో తొలి విడత ప్రయోగాత్మకంగా నిర్మిస్తున్న లక్ష ఇళ్ల ఇందిరమ్మ టవర్స్ నిర్మాణాలను పారదర్శకంగా, వేగంగా పూర్తి చేసి ఏడాదిలోగా అందించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఏడాది గడువును కాంట్రాక్టర్లకు నిర్ధేశించామని, అయితే ఒక నెల ముందుగా పూర్తి చేస్తే రూ.45 లక్షలు, రెండు నెలల ముందుగా పూర్తి చేస్తే రూ.90 లక్షలు ప్రోత్సాహక బహుమతిగా ఇస్తామని చెప్పామని వివరించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజులరామారంలో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్‌కు సహచర మంత్రి, రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద, పలువురు లబ్దిదారులతో కలిసి మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనల మేరకు 23 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇందిరమ్మ టవర్స్‌ను నిరంతర ప్రక్రియగా నిర్మిస్తామని తెలిపారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఇళ్ల కోసం ఏడు వేలకు పైగా దరఖాస్తులు అందగా పరిశీలన అనంతరం 5,218 మంది అర్హులుగా తేలారని, వారిలో లబ్దిదారుల ఎంపికను బహిరంగంగా లక్కీ డ్రా ద్వారా చేపట్టి 480 మందిని తుది జాబితాలో ఎంపిక చేసినట్లు వెల్లడించారు. ఎంపిక ప్రక్రియను ఆన్‌లైన్ విధానంలో పారదర్శకంగా నిర్వహించామని, ఎవరికి ఏ విధంగా ఇల్లు మంజూరైందనే వివరాలను కూడా లబ్ధిదారులకు తెలియజేయడంతోపాటు సంబంధిత ధ్రువపత్రాలను అందజేస్తామని చెప్పారు. ప్రస్తుతం కేటాయించిన ఇళ్లతో కార్యక్రమం ముగియదని, మరో మూడు విడతల్లోనూ ఇళ్ల నిర్మాణాన్ని చేపడతామని మంత్రి చెప్పారు. ప్రస్తుతం సుమారు 7.5 ఎకరాల స్థలం అందుబాటులో ఉందని, దీనితోపాటు నియోజకవర్గంలో ఉన్న ఇతర ప్రభుత్వ, హౌసింగ్ శాఖ భూములను గుర్తించి అక్కడ కూడా పేదలకు ఇళ్లు నిర్మించే చర్యలు చేపడతామని తెలిపారు. ఇళ్ల నిర్మాణంలో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని మంత్రి అన్నారు. లబ్దిదారులు కూడా తమ ఇళ్ల నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. పేదల చిన్న చిన్న కోరికలను నెరవేర్చడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వం ఆ దిశగా చిత్తశుద్ధితో పనిచేస్తోందని తెలిపారు. పేదవాడి సొంతింటి కలను కేవలం హామీగా కాక కార్యరూపంలోకి తీసుకొస్తున్నామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్ధ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, హౌసింగ్ శాఖ సెక్రటరీ వి.పి.గౌతమ్, కలెక్టర్ మనూ చౌదరి తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *