– వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల
– ఖరీఫ్‌లో విజయవంతమైన డిజిటల్ విధానం
– ఫార్మర్స్ రిజిస్ట్రీలో తెలంగాణ ముందంజ
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 6 : రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ఎరువుల పంపిణీ ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తయిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ఫెర్టిలైజర్ యాప్‌ల ద్వారా పంపిణీని పర్యవేక్షించడం, ఎరువులను ముందుగానే అందుబాటులో ఉంచడం (అడ్వాన్స్ పొజిషనింగ్) వల్ల రైతులకు ఎరువుల కొరత రాలేదని ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన యాప్‌ల ద్వారా ఎరువుల పంపిణీలో పారదర్శకత పెరిగిందని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన యాప్ ద్వారా 33.39 లక్షల మంది రైతులకు 128.18 లక్షల యూరియా బస్తాలను పంపిణీ చేయగా, కేంద్ర ప్రభుత్వ ఎఫ్ఎఫ్ఎస్ యాప్ ద్వారా 37.48 లక్షల మందికి 104.99 లక్షల అన్ని రకాల ఎరువుల బస్తాలను అందించినట్లు వివరించారు. ఈ డిజిటల్ విధానంతో బ్లాక్ మార్కెటింగ్, అక్రమ నిల్వలకు అడ్డుకట్ట పడిందని, ఫలితంగా గత ఖరీఫ్‌తో పోలిస్తే ఈసారి 35 వేల టన్నుల యూరియా వాడకం తగ్గిందని పేర్కొన్నారు.
భారీగా ఎరువుల నిల్వలు
గత ఏడాదితో పోలిస్తే రాష్ట్రంలో యూరియా నిల్వలు గణనీయంగా పెరిగాయని మంత్రి తుమ్మల వెల్లడించారు. గత ఏడాది ఇదే సమయంలో కేవలం 0.50 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే ఉండగా, ప్రస్తుతం 2.33 లక్షల మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉందన్నారు. అలాగే డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులు కూడా రైతులకు సరిపడా ఉన్నాయని తెలిపారు. విదేశాల నుంచి వచ్చే ఎరువుల షిప్‌మెంట్లు ఆలస్యం కాకుండా షిప్‌యార్డుల వద్ద ప్రత్యేక అధికారులను నియమించి కేంద్రంతో నిరంతరం సమన్వయం చేసుకున్నామని వివరించారు.
డిజిటల్ క్రాప్ బుకింగ్.. భవిష్యత్ పథకాలకు ఆధారం
రైతుల సమగ్ర సమాచారంతో కూడిన ‘ఫార్మర్స్ రిజిస్ట్రీ’ రూపకల్పనలో తెలంగాణ దేశంలోనే ముందంజలో ఉందని మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. 2026-27 వానాకాలానికి గాను రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన డిజిటల్ క్రాప్ సర్వే ఇప్పటికే 75.9 శాతం (1.46 కోట్ల వ్యవసాయ క్షేత్రాలు) పూర్తయిందన్నారు. భవిష్యత్తులో పంటల కొనుగోళ్లు, సబ్సిడీ విత్తనాల పంపిణీ, వ్యవసాయ యాంత్రీకరణ తదితర ప్రభుత్వ పథకాలన్నింటికీ ఈ డిజిటల్ క్రాప్ బుకింగ్ వివరాలే ప్రాతిపదికగా ఉంటాయని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




