నిధుల మళ్లింపు ఆరోపణలు అవాస్తవం

– కేంద్ర మంత్రి బండి ఆరోపణలకు పంచాయతీరాజ్ శాఖ ఖండన

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 20 : రాష్ట్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులను విద్యుత్ బిల్లులు, సిబ్బంది వేతనాల చెల్లింపులకు మళ్లించిందంటూ ఇటీవల ఒక ఆంగ్ల దినపత్రికలో ప్రచురితమైన వార్తలో వాస్తవం లేదని పంచాయతీరాజ్, గ్రామీణ ఉపాధి శాఖ స్పష్టం చేసింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన ఈ ఆరోపణలు వాస్తవ విరుద్ధమైనవని తెలిపింది. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం-2018లోని సెక్షన్ 52 ప్రకారం గ్రామ పంచాయతీల పరిధిలోని వీధి దీపాల నిర్వహణ గ్రామ పంచాయతీల ప్రధాన బాధ్యత. అందువల్ల వీధి దీపాలకు సంబంధించిన విద్యుత్ వినియోగ బిల్లుల చెల్లింపు కూడా గ్రామ పంచాయతీల చట్టబద్ధమైన బాధ్యతలో భాగమే. 15వ ఆర్థిక సంఘం నిధుల్లో టైడ్ గ్రాంట్లు తాగునీటి సరఫరా వంటి నిర్దేశిత పనులకు మాత్రమే వినియోగిస్తారు. అన్‌టైడ్ గ్రాంట్లు రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్‌లో పేర్కొన్న 29 అంశాల పరిధిలో ఏ అభివృద్ధి పనికైనా వినియోగించవచ్చు. ఇందులో కమ్యూనిటీ ఆస్తుల నిర్వహణ, విద్యుత్ పంపిణీ, తాగునీటి వ్యవస్థల నిర్వహణ వంటి అంశాలు కూడా ఉన్నాయి. 15వ ఆర్థిక సంఘం నిధులను కేంద్ర ప్రభుత్వం నేరుగా గ్రామ పంచాయతీలు, మండల ప్రజా పరిషత్‌లు, జిల్లా ప్రజా పరిషత్‌ల ఖాతాలకు విడుదల చేస్తుంది. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించే అవకాశం లేదని ఆ శాఖ స్పష్టం చేసింది. గ్రామ పంచాయతీలు చట్టబద్ధంగా తమ బాధ్యతల నిర్వహణలో భాగంగా చేసిన ఖర్చులను నిధుల మళ్లింపుగా పేర్కొనడం సరైంది కాదని తెలిపింది. అందువల్ల తెలంగాణ ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులను మళ్లించిందంటూ చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, ప్రజలు వాస్తవాలను మాత్రమే విశ్వసించాలని పంచాయతీరాజ్, గ్రామీణ ఉపాధి శాఖ విజ్ఞప్తి చేసింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *