దిల్లీకి వొచ్చిన కష్టం హైదరాబాద్‌కు రావొద్దు..
దేశం గర్వించేలా భాగ్యనగాన్ని అభివృద్ధి చేస్తున్నాం..
మూసీ పరీవాహక ప్రాంతంలో గుడిసె వేసుకొని జీవించి చూపించు
బిజెపి నేతలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సవాల్
మూసీ పరీవాహక ప్రాంతం ప్రజల జీవితాలు బాగుపడొద్దా?
నగర అభివృద్ధికి బిఆర్‌ఎస్ పైసా ఖర్చు చేయలేదు..
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే హైదరాబాద్ ప్రగతి
హైదరాబాద్ రైజింగ్ ఉత్సవాల్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడి
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 3 : మూసీ పరీవాహక ప్రాంతంలో ఒక రోజు నిద్రపోవడం కాదు. అక్కడే గుడిసె వేసుకొని మీరు.. మీ కుటుంబం చిరస్థాయిగా జీవించి చూపించాలని బిజెపి నేతలను ఉద్దేశించి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ప్రజలను మభ్య పెట్టడానికి మూసీ పరీవాహక ప్రాంతంలో ఒక రోజు నిద్రపోయి తర్వాత నుంచి విలాసమైన ప్యాలెస్ లో ఉండటం సరికాదని అన్నారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్ మార్గ్ లోని హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌లో ‘‘హైదరాబాద్ రైజింగ్’’ ఉత్సవాల కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరం గుండా ప్రవహిస్తున్న మూసీ నదికి పునర్జీవం తీసుకువొచ్చి మురికి కూపంలో ఉన్న ప్రజల జీవన ప్రమాణాలు పెంచడంతో పాటు హైదరాబాద్ నగరాన్ని ప్రపంచం ఆకర్షించేలా పర్యాటకంగా, అందంగా, ఆహ్లాదకరంగా అభివృద్ధి చేసి, మూసిని జీవ నదిగా మార్చాలని ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు. మూసీ పరీవాహక ప్రాంతంలో ఉన్న ప్రజల జీవితాలు బాగుపడటం ఇష్టంలేని ప్రతిపక్షాలు ప్రతీ పనిని అడ్డుకుంటున్నారని అన్నారు. ప్రపంచంలో ఏ నగరానికి వెళ్లినా నగరం మధ్యలో నుంచి ప్రవహిస్తున్న నదులను పర్యాటకంగా ఆహ్లాదకరంగా ఆనందంగా ఆరోగ్యంగా అభివృద్ధి చేసుకొని జీవ నదిగా అక్కడి ప్రభుత్వాలు మార్చుకుంటున్నాయి.
అదే విధంగా హైదరాబాద్ నగరం గుండా 55 కిలోమీటర్ల పైగా ప్రవహిస్తున్న మూసీ నదిని పూర్తిగా ప్రక్షాళన చేసి పునర్జీవం తీసుకురావడానికి ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. గోదావరి నీళ్లను తీసుకువొచ్చి మూసీలో కలిపి పునర్జీవం తీసుకువొచ్చి పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి విద్య ఉపాధి అవకాశాలు పెంచితే ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కదిలించలేమన్న భయంతో కుట్రపూరితంగా బిఆర్‌ఎస్ పార్టీ తన సోషల్ మీడియా ద్వారా ప్రజలను రెచ్చగొడుతూ ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు. మూసీ పరీవాహక ప్రాంతంలో ఉన్న ప్రజలు మురికి కూపంలోనే ఉండాలి.. వారి ఆరోగ్యాలు బాగుపడొద్దు.. వారికి ఇండ్లు రావొద్దని కుట్రపూరితంగా బిఆర్‌ఎస్ పార్టీ వ్యవహరిస్తోంది. మూసీ పరీవాహక ప్రాంతంలో నివసిస్తున్న పేదలకు మంచి జీవితం అందించాలని, అక్కడ నివాసముంటున్న ఇండ్లకు పట్టాలున్నా లేకున్నా గుడిసెలు వేసుకున్న వారిని కూడా గుర్తించి వారికి అందమైన టవర్లు నిర్మించి ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోందని చెప్పారు. మూసీ పరీవాహక ప్రాంతంలో నివసించే మహిళలకు వడ్డీ లేని రుణాలిప్పించి వారిని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు.
హైదరాబాద్ నగరం మీద ప్రేమ, పేదవాళ్లపై అభిమానం ఉంటే సహకరించాల్సింది పోయి కుట్రలు చేయడం మానుకోవాలని బిఆర్‌ఎస్ నాయకులకు సూచించారు. హైదరాబాద్ నగరానికి మూసీ నది అంది వచ్చిన వరం లాంటిదని దానిని బాగు చేసుకుందామని మూసీ పునర్జీవం కోసం ప్రజా ప్రభుత్వం వెనకడుగు వేసే ప్రసక్తే లేదని అన్నారు. హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందితే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని ఈ సంవత్సరం బడ్జెట్లో హైదరాబాద్ మహానగర అభివృద్ధి కోసం పది వేల కోట్లు కేటాయించామని గుర్తుచేశారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య లేకుండా వాహనదారులకు సజావుగా ప్రయాణించేందుకు అండర్ పాస్ బ్రిడ్జిలు, ఫ్లై ఓవర్లు నిర్మాణం చేసి రోడ్లు అభివృద్ధి చేశామన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 400 స్లమ్స్ లలో నివాసం ఉంటున్న మహిళలను వ్యాపార వేత్తలుగా మార్చడానికి మెప్మా ద్వారా వడ్డీ లేని రుణాలు అందించాలని ప్రజా ప్రభుత్వం ఆలోచన చేస్తోందని చెప్పారు. దిల్లీ లాంటి ముప్పు హైదరాబాద్ నగరానికి రావొద్దన్న ముందు చూపుతో ప్రజా ప్రభుత్వం కాలుష్యం లేని నగరంగా తీర్చిదిద్ది భవిష్యత్తు తరాలకు అందించడానికి అనేక ప్రణాళికలు తయారు చేసుకుని ముందుకు పోతున్నదన్నారు.
పదేళ్లలో నగరానికి పైసా ఖర్చు చేయని బీఆర్‌ఎస్..
హైదరాబద్ ను ప్రపంచంలోనే గొప్ప నగరంగా మార్చాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా మంత్రిమండలి చర్చించి నగరానికి కావలసిన అన్ని హాంగులను తీసుకురావడానికి ప్రణాళిక బద్ధంగా ముందుకు పోతున్నామని భట్టి విక్రమార్క వెల్లడించారు. పదేళ్లు పాలించిన బిఆర్‌ఎస్ హైదరాబాద్ అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. గత ప్రభుత్వాలు చేసిన అభివృద్ధికి రంగులు వేసుకొని పదేండ్లు కాలం వెల్లదీశారని అన్నారు. హైదరాబాద్‌లో ఉన్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం, నగరవాసులకు ఇప్పుడు అందుతున్న గోదావరి, కృష్ణ, మంజీరా నీటి పథకాలు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు తెచ్చిన ఫలితమేనని పేర్కొన్నారు.
హైదరాబాద్ నగరంలో ఉద్యోగ ఉపాధి కల్పన కొరకు బీహెచ్‌ఈఎల్ ఈసీఐఎల్ డిఆర్డిఓ ఐడిపిఎల్, బీడీఎల్, డిఆర్డిఏ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలను ఆనాటి కాంగ్రెస్ పాలకులే తీసుకువచ్చారని వివరించారు. పేదలకు హౌసింగ్ బోర్డ్ ద్వారా ఎల్‌ఐజి, హెచ్‌ఐజి, ఎంఐజి ఇండ్లను అందించింది కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వమేనని వెల్లడించారు. హైదరాబాద్‌లో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయడానికి నాటి ప్రధాని రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన కంప్యూటర్ విప్లవమేనని పేర్కొన్నారు. హైటెక్ సిటీ వేదికగా ఐటి రంగాన్ని ఏర్పాటు చేయడానికి కావలసిన వనరులు అందులో పనిచేయడానికి కావలసిన మానవ వనరులను అభివృద్ధి చేయడానికి ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేసి అందులో చదివిన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్‌ఇచ్చి ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్నిదని భట్టి విక్రమార్క అన్నారు.