వోట్ల చోరీ నుంచి చట్టాల చోరీ వరకు..

– నచ్చిన ఈసీల కోసం నల్ల చట్టాలు
– ఎన్నికల సంఘంపై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు
– సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్
– అప్రూవర్ గా మారితే అది దేశభక్తి అవుతుందని వ్యాఖ్య
– ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు

న్యూదిల్లీ, సెప్టెంబర్ 24 : దేశ ఎన్నికల వ్యవస్థ, వోటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ, ఎన్నికల సంఘంలో నిర్ణయాలు తీసుకునే విధానంపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గురువారం తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల వ్యవస్థకు సంబంధించిన అంశాలపై దర్యాప్తు జరిగితే గ్యానేశ్ కుమార్ అప్రూవర్ గా మారి తనకు తెలిసిన విషయాలను వెల్లడించాలని సూచించారు. గత పది నెలల వ్యవధిలో ఎన్నికల సంఘం తీసుకున్న పలు నిర్ణయాలపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి  కనీసం 14 సార్లు లిఖితపూర్వక అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌’ దర్యాప్తు కథనం వెలువడిన నేపథ్యంలో రాహుల్ గాంధీ ఈ ప్రత్యేక విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆ అభ్యంతరాలు కొత్త వోటర్ల నమోదు, ఫారం-6, వోటర్ల పేర్ల తొలగింపు – పునరుద్ధరణ, ఎన్నికల జాబితా అప్పీళ్లు, డిజిటల్ వోటర్ డేటాబేస్ నిర్వహణ తదితర అంశాలకు సంబం ధించినవని నివేదిక పేర్కొంది. ప్రెస్మీట్ ప్రారం భంలోనే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్, వ్యాపార వేత్త గౌతమ్ అదానీ, జాతీయ భద్రతా సలహా దారు అజిత్ దోవల్, ప్రధాన ఎన్నికల కమిషనర్ గ్యానేశ్ కుమార్ తదితరుల చిత్రాలను ప్రదర్శిం చారు. ఎన్నికలను ప్రభావితం చేసే విస్తృత
వ్యవస్థలో వీరికి పాత్ర ఉందని ఆయన ఆరోపిం చారు. ఇవి రాహుల్ గాంధీ చేసిన రాజకీయ ఆరోపణలే తప్ప స్వతంత్ర విచారణ లేదా న్యాయస్థానం నిర్ధారించిన అంశాలు కావు.

ఎన్నికల్లో 100 శాతం అక్రమాలు జరుగుతున్నాయి

“నేను గాలిలో ఆరోపణలు చేయడం లేదు. గతంలో ఆధారాలు చూపించాను. ఇప్పుడు బయటకు వస్తున్న సమాచారం చూస్తే ఎన్నికల వ్యవస్థలో అక్రమాలు జరుగుతున్నాయనే విష యంలో నాకు 99 శాతం కాదు, 100 శాతం నమ్మకం ఉంది” అని రాహుల్ గాంధీ పేర్కొ న్నారు. లోకసభ ఎన్నికలతోపాటు వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపించారు. -ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ గతంలో లేవనెత్తిన ప్రశ్నలకు ఎన్నికల సంఘం సరైన సమాధానాలు ఇవ్వలే -దని విమర్శించారు.

యాంటీ ఇన్ కంబెన్సీ ఎక్కడికి పోయింది?

భారత ఎన్నికల రాజకీయాల్లో అధికార వ్యతిరేకత — యాంటీ ఇన్కంబెన్సీ – సహజమైన అంశమని రాహుల్ పేర్కొన్నారు. “నేను రాజకీయ కుటుంబంలో పుట్టాను. ఐదు దశాబ్దాలకు పైగా రాజకీయాలను చూస్తున్నాను. ఎంత ప్రజాదరణ ఉన్న నాయకుడికైనా కొంతకాలానికి అధికార వ్యతిరేకత వస్తుంది. అది ఏ రాజకీయ పార్టీని వదలదు” అని ఆయన అన్నారు. 1971 బంగ్లాదేశ్ యుద్ధం తర్వాత అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ అత్యంత ప్రజాదరణ పొందినప్పటికీ తర్వాత కాంగ్రెస్ కు రాజకీయ ఎదురుదెబ్బలు తగిలాయని గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఇటువంటి ధోరణి ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు.

వోటు చోరీ నుంచి చట్టాల చోరీ

ప్రెస్ మీట్‌లో రాహుల్ గాంధీ ప్రధానంగా “వోటు-చట్టం-సంస్థలు-రాజ్యాంగం” మధ్య ఉన్న సంబంధాన్ని వివరించే ప్రయత్నం చేశారు. వోటు ప్రజాస్వామ్యానికి పునాది అని, ప్రజల వోటు సక్రమంగా నమోదు కాకపోతే ఎన్నికైన ప్రజాప్రతినిధుల చట్టబద్ధతపైనే ప్రశ్నలు వస్తాయని ఆయన అన్నారు. వోటు చోరీ నుంచి ‘కానూన్ చోరీ వస్తుంది. వోటు దొంగిలించబడితే చట్ట నిర్మాణ వ్యవస్థ దెబ్బతింటుంది. వోటు, చట్టాలు, సంస్థలు, రాజ్యాంగం మధ్య ఉండాల్సిన గొలుసు తెగిపోయే పరిస్థితి ఏర్పడింది. భారతదేశం ఇంతకుముందు చూడని కొత్త పరిస్థితిలోకి వెళ్లేంది అని మీడియా ప్రశ్నకు సమాధానంగా రాహుల్ పేర్కొన్నారు.

జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ పై రాహుల్ గాంధీ నేరుగా ఆరోపణలు చేశారు. జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి. ఆయన చేసిన పని దేశ ప్రయోజనాలకు వ్యతిరేకమైనది అని అన్నారు. ఇద్దరు ఎన్నికల కమిషనర్లు కూడా కొన్ని నిర్ణయాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు వార్తలు రావడాన్ని రాహుల్ ప్రస్తావించారు. జ్ఞానేశ్ కుమార్ కు తాను ఒక అవకాశం ఇస్తున్నానని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఆయన అప్రూవర్ గా మారాలి.. నిజంగా ఏం జరిగిందో చెప్పాలి.. అలా చేయడం దేశభక్తి అవుతుంది అని అన్నారు. మీడియా ప్రశ్నకు సమాధానంగా ‘నేను ఇంతకుముందే చెప్పాను- ఆయన అప్రూవర్ గా మారాలి అని రాహుల్ పేర్కొన్నారు.

ఇద్దరు కమిషనర్లను ప్రశంసించిన రాహుల్

ఎన్నికల కమిషనర్లు సుఖీబీర్ సింగ్ సంధు, వివేక్ జోషి అభ్యంతరాలు నమోదు చేసినట్లు వచ్చిన వార్తలను రాహుల్ స్వాగతించారు. ‘ఇద్దరు ఎన్నికల కమిషనర్లు నిజాన్ని బయటకు తీసుకురావడంలో సరైన పని చేశారు.. వారిని నేను అభినందిస్తున్నాన’ని చెప్పారు. దేశంలోని సంస్థల్లో పనిచేసే మరింత మంది అధికారులుతమకు తెలిసిన విషయాలను ధైర్యంగా బయటపెట్టాలని పిలుపునిచ్చారు. ‘వ్యవస్థలో సమస్య ఉందని దేశంలో చాలామంది అనుకుంటున్నారు.. కానీ భయంతో మాట్లాడటం లేదు.. ఇప్పుడు ఆ భయం తగ్గుతోంది.. ఇద్దరు ఎన్నికల కమిషనర్లు మాట్లాడారు.. వారిలాంటి దేశ భక్తులు ఇంకా ఉన్నారు’ అని చెప్పారు.

అంతర్గత అభిప్రాయ భేదాలు సహజమే : ఈసీఐ

ఇద్దరు ఎన్నికల కమిషనర్ల అభ్యంతరాలపై వచ్చిన కథ నాలకు ఎన్నికల సంఘం కూడా స్పందించింది. ఒక సంస్థలో తుది నిర్ణయానికి ముందు సభ్యులు వివిధ అభి ప్రాయాలు, సూచనలు, ప్రశ్నలు లేవనెత్తడం సహజమైన పరిపాలనా ప్రక్రియ అని ఎన్నికల సంఘం పేర్కొంది. “operational queries or in-puts”ను తుది నిర్ణయాలపై అసమ్మతిగా చిత్రీకరించడం సరైంది కాదని తెలిపింది. పది నెలల్లో వచ్చిన కొన్ని అంతర్గత నోట్లను మాత్రమే ప్రస్తావిస్తూ, అదే సమయంలో కమిషనర్లు ఆమోదించిన అనేక నిర్ణయాలు, ఆదేశాలు, కార్యక్రమాలను పక్కనపెట్టడం పూర్తి చిత్రాన్ని చూపదని ఎన్నికల సంఘం పేర్కొంది. ఎస్ఐఆర్‌ సహా కీలకమైన తుది నిర్ణయాలు ముగ్గురు కమిషనర్ల ఆమోదంతోనే జరిగాయని ఎన్నికల సంఘం వర్గాలు స్పష్టం చేశాయి.

—————————————————————————————————————————————————————

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *