ఆయుధాల కోసం వెతికితే డ‌బ్బు సంచులు దొరికాయ్‌!

– రూ.3 కోట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు

భోపాల్, ఆగస్టు 17 : ఓ ఆటో డ్రైవర్ ఇంట్లో రూ.3 కోట్లు లభ్యమైన సంఘటన మధ్యప్రదేశ్‌లోని సాగర్‌లో చోటుచేసుకుంది. ఆ ఇంట్లో మారణాయుధాలు ఉన్నాయని సమాచారం రావడంతో పోలీసులు సోదా చేసేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా పెద్దఎత్తున నగదు సంచులు కనిపించడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాగర్‌లోని గోపాల్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటో డ్రైవర్ రాజేశ్ అహిర్వార్ తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతని కుమారుడు సౌరభ్ అహిర్వార్ ఇటీవల సోషల్ మీడియాలో ఓ ఫొటోను షేర్ చేశాడు. తుపాకీతో దిగిన ఆ ఫొటో స్థానికులను భయాందోళనలకు గురిచేసింది. అతని వద్ద మారణాయుధాలు ఉన్నాయనే ప్రచారం జరిగింది. దీంతో విషయం పోలీసులకు చేరింది. నిందితుడి ఇంటికి చేరుకుని తనిఖీలు చేపట్టగ ఎంత వెతికినా ఆయుధాలు లభించలేదు. అయితే పెద్దఎత్తున నగదు సంచులు బయటపడ్డాయి. ఆటో డ్రైవర్ ఇంట్లో ఇంత పెద్దమొత్తంలో నగదు కనిపించడంతో పోలీసులు షాక్‌కు గురయ్యారు. వెంటనే నగదు లెక్కించే యంత్రాలను తెప్పించి సుమారు ఐదు గంటలపాటు శ్రమించి ఆ మొత్తం విలువ రూ.3 కోట్లుగా తేల్చి స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదు ఎక్కడినుంచి వచ్చిందని ఆ కుటుంబాన్ని పోలీసులు ప్రశ్నించగా ఆ డబ్బుతో తమకు సంబంధం లేదని, భోపాల్‌లో ప్రభుత్వ ఇంజనీర్‌గా పనిచేస్తున్న తమ బంధువు కుటుంబ సభ్యులదని వెల్లడించారు. దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *