– 565 మండల పరిషత్ కార్యాలయాల్లో ప్రారంభం
– మొత్తం 5,410 వినతుల స్వీకరణ – 10,753మంది అధికారుల హాజరు
– జిన్నారం మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలోనూ నిర్వహణ
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 17 : రాష్ట్రవ్యాప్తంగా మండలస్థాయి ప్రజావాణి కార్యక్రమం సోమవారం విజయవంతమైంది. ప్రజల సమస్యలను వారి మండలస్థాయిలోనే నేరుగా స్వీకరించి వాటికి పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో రాష్ట్రంలోని అన్ని మండలాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించారు. రాష్ట్రంలోని మొత్తం 565 మండల ప్రజా పరిషత్ కార్యాలయాల్లో ప్రజావాణి నిర్వహించగా సంగారెడ్డి జిల్లాలోని జిన్నారం మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో కూడా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 566 మండలస్థాయి ప్రజావాణి కార్యక్రమాలు నిర్వహించినట్లయిందని ప్రజావాణి రాష్ట్ర ఇన్‌చార్జి డాక్టర్ జి.చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి కె.విద్యాసాగర్ తెలిపారు.
5,410 వినతుల స్వీకరణ
రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి మొత్తం 5,410 వినతులు అందాయి. ప్రజలు తమ సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి నేరుగా తీసుకొచ్చారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి వినతిని అధికారులు స్వీకరించి సమస్య స్వభావాన్ని పరిశీలించి సంబంధిత శాఖల ద్వారా పరిష్కరించేందుకు చర్యలు తీసుకునే విధంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల ప్రజావాణి కోసం అధికారులు శాఖ వారీగా డెస్క్‌లు, మంచినీటి సౌకర్యాలు కల్పించారు.
10,753మంది అధికారులు హాజరు
మండలస్థాయి ప్రజావాణి కార్యక్రమాలకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10,753 మంది అధికారులు హాజరయ్యారు. ప్రజలు సమర్పించిన వినతులను నేరుగా స్వీకరించడంతోపాటు, ఆయా సమస్యలకు సంబంధించిన వివరాలను తెలుసుకుని పరిష్కారానికి అవసరమైన చర్యలపై దృష్టి సారించారు.
జిల్లాల వారీగా ..
రాష్ట్రవ్యాప్తంగా ఒక జిల్లాకు సగటున 164 వినతులు అందాయి. అత్యధికంగా వినతులు అందిన జిల్లాగా కరీంనగర్ నిలిచింది. కరీంనగర్ జిల్లాలో మొత్తం 704 వినతులు స్వీకరించారు. అలాగే, ఒక మండలానికి సగటున అత్యధిక వినతులు అందిన జిల్లాగా కూడా కరీంనగర్ ముందంజలో ఉంది. కరీంనగర్ జిల్లాలో ఒక్కో మండలానికి సగటున 47 వినతులు అందాయి.
ప్రజలు, అధికారుల నుంచి విశేష స్పందన
మండలస్థాయి ‘ప్రజావాణి’కి ప్రజల నుంచి, అధికారుల నుంచి విశేష స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చి వినతులు సమర్పించగా అధికారులు కూడా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేశారు. మండలస్థాయిలోనే ప్రజల నుంచి నేరుగా వినతులను స్వీకరించడం ద్వారా సమస్యల పరిష్కార ప్రక్రియను ప్రజలకు మరింత చేరువ చేయడం సాధ్యమవుతుందని అధికారులు తెలిపారు. జిల్లా లేదా రాష్ట్రస్థాయి కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానిక స్థాయిలోనే సంబంధిత అధికారులకు తమ సమస్యలను వివరించే అవకాశం మండలస్థాయి ప్రజావాణి ద్వారా లభించింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు



