– కారకులపై చర్యలు తప్పవని అటవీ అధికారి హెచ్చరిక
భద్రాద్రి కొత్తగూడెం, ప్రజాతంత్ర, ఆగస్ట్ 13 : వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలు తగిలి విధి నిర్వహణలో చెరువుసింగారం వెస్ట్ బీట్ ఆఫీసర్ బానోత్ నవీన్ ప్రాణాలు కోల్పోయారని ఈ ఘటనను అటవీ శాఖ అత్యంత సీరియస్ గా తీసుకుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటవీ శాఖ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్ అన్నారు. చెరువు సింగారం బీట్ పరిధిలోని నకిరిపేట అటవీప్రాంతాన్ని ఆయన అటవీ అధికారులతో కలిసి గురువారం పరిశీలించారు. అటవీ సిబ్బంది ప్రాణాలను సైతం ప్రమాదంలోకి నెట్టే ఇలాంటి అక్రమ చర్యలను ఎలాంటి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. విద్యుత్ ఉచ్చు ఏర్పాటు చేసిన ప్రాంతం, విద్యుత్ సరఫరా జరిగిన విధానం, విద్యుత్ లైన్లు, అక్రమంగా విద్యుత్ తీసుకున్న మార్గం, పరిసర ప్రాంతాల పరిస్థితులను పరిశీలించారు. ఈ ఘటన కేవలం వన్యప్రాణుల వేటకు సంబంధించిన నేరంగా మాత్రమే కాక ప్రాణాంతకమైన అక్రమ విద్యుత్ వినియోగం, అటవీ ప్రాంతాల్లో విద్యుత్ భద్రత, ఫీల్డ్ స్థాయి పర్యవేక్షణ, అంతర శాఖల సమన్వయానికి సంబంధించిన అంశంగా పరిగణించారు. అక్రమ విద్యుత్ కనెక్షన్ ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఏ విద్యుత్ లైన్ నుంచి సరఫరా జరిగింది, ఎలాంటి విధానంలో విద్యుత్‌ను అటవీ ప్రాంతంలోకి తీసుకువెళ్లారు, అక్రమ కనెక్షన్ ఎంతకాలంగా ఉపయోగిస్తున్నారు. దీనికి సంబంధించి ఫీల్డ్ సిబ్బందికి ఎప్పుడైనా సమాచారం అందిందా, అటవీ ప్రాంతాల్లో విద్యుత్ లైన్లపై అవసరమైన తనిఖీలు జరిగాయా అనే కోణంలో సమగ్ర దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని డీఎఫ్‌ఓ స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో విద్యుత్ ఉచ్చును ఏర్పాటు చేసిన వ్యక్తులు ఎవరు, వారికి విద్యుత్ సరఫరా ఎలా అందింది, ఈ చర్య వెనుక మరెవరైనా ఉన్నారా అనే కోణంలో వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. నేరానికి పాల్పడిన వ్యక్తులపై వర్తించే అటవీ, వన్యప్రాణి సంరక్షణ, విద్యుత్, ఇతర సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు ఉంటాయన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, విధుల్లోకి అటవీ సిబ్బంది వెళితే ప్రత్యేక చర్యలతోపాటు అప్రమత్తత పాటించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఏదేమైనా విధుల్లో ఎఫ్‌బీఓ మృతి చెందడం చాలా బాధాకరమని అన్నారు. ఆయన వెంట ఎఫ్‌ఎవో కృష్ణప్రసాద్, డీఆర్వోలు అనార్కలీ, క్రాంతి, ఎస్‌ఆర్వో సురేష్, ఎస్‌ఐ రామ్మూర్తి, విద్యుత్ శాఖ అధికారులు, ముసలిమడుగు సెక్షన్ బీట్ ఆఫీసర్లు ఉన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు