– వందేమాతరం గీతాలాపనతో లోక్‌సభ వాయిదా
న్యూదిల్లీ, ఆగస్టు 13: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిశాయి. ఉభయ సభలు గురువారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. లోక్‌సభ ప్రారంభమైన తర్వాత సభ్యులంతా కలిసి వందేమాతరం గేయాన్ని ఆలపించారు. సమావేశానికి ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్‌తోపాటు సభ్యులంతా హాజరయ్యారు. జాతీయ గేయంలోని ఆరు చరణాలను పూర్తిగా ఆలపించిన అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేశారు. దీంతో వర్షాకాల సమావేశాలు ముగిసినట్లయింది. వందేమాతరం గేయానికి చట్టపరంగా రక్షణ కల్పించే శాసనానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేసిన కొన్ని రోజులకే లోక్‌సభలో ఈ పరిణామం చోటుచేసుకుంది. జాతీయ గేయాన్ని ఆలపించడాన్ని ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం లేదా నిరోధించడం శిక్షార్హమైన నేరమని ఈ చట్టం స్పష్టం చేస్తోంది. తద్వారా దీనికి జాతీయ గీతం ’జనగణమన’తో సమానమైన చట్టపరమైన హోదా లభించిన్లటైంది. రాష్ట్రపతి రాక, త్రివర్ణ పతాకావిష్కరణ, గవర్నర్ల ప్రసంగం వంటి సందర్భాల్లో వందేమాతరంలోని ఆరు చరణాలను ఆలపించాలని జనవరి 28న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. వర్షాకాల సమావేశాలు జులై 20న ప్రారంభమై ఆగస్టు 13తో ముగిశాయి. నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతోపాటు విద్యావ్యవస్థలో సంస్కరణలను డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఆందోళన చేపట్టింది. వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన రోజు చలో పార్లమెంట్ యాత్రకు సీజేపీ పిలుపునిచ్చింది. ఈ ఘటనతో చోటుచేసుకున్న తీవ్ర పరిణామాలతో మంత్రి పదవికి ధర్మేంద్ర రాజీనామా చేశారు. అదేవిధంగా పార్లమెంట్ సమావేశాల్లో యాంటీ పేపర్ లీక్ బిల్లుతోపాటు పలు బిల్లులు ఆమోదం పొందాయి. అయితే దిల్లీలో యువతపై జరిగిన లాఠీఛార్జికి ఎవరు ఆదేశాలు ఇచ్చారో సభలో ప్రకటన చేయాలంటూ ప్రతిపక్షం కాంగ్రెస్ కేంద్రాన్ని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో సభలో దాదాపు వాయిదాల పర్వం కొనసాగింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు



