– పరిశ్రమలు శుభ్రమైన ఉత్పత్తి విధానాలు అవలంబించాలి
– తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి రవి
కాళోజి జంక్షన్ /హనుమకొండ, ప్రజాతంత్ర. ఆగస్టు 13 : పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం, విద్యాసంస్థలు, పరిశ్రమలు, పరిశోధకులు సమష్టి సమన్వయం అవసరమని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి జి.రవి అన్నారు. గురువారం కాకతీయ విశ్వవిద్యాలయ స్వర్ణోత్సవాల్లో భాగంగా విశ్వవిద్యాలయ రసాయన శాస్త్ర విభాగం, తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, స్టేట్ ఎక్స్‌పర్ట్ అప్రైజల్ కమిటీ, తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ అప్పిలేట్ అథారిటీ సంయుక్త ఆధ్వర్యంలో సెనెట్ హాల్‌లో నిర్వహించిన రెండో రోజు సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ అప్పిలేట్ అథారిటీ సభ్యుడు ఆచార్య గాదె దయాకర్ అధ్యక్షత వహించగా జి.రవి మాట్లాడుతూ పారిశ్రామిక, ఆర్థిక అభివృద్ధి పర్యావరణ పరిరక్షణతో సమన్వయం కావాలన్నారు. వాయు, జల, భూ కాలుష్యాల పర్యవేక్షణతో పాటు పర్యావరణ నిబంధనలను సమర్థవంతంగా అమలు చేయాలని అన్నారు. పరిశ్రమలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ సంస్థలు కలిసి పరిశుభ్రమైన ఉత్పత్తి విధానాలు, సమర్థవంతమైన పర్యావరణ అనుసరణ వ్యవస్థలను అభివృద్ధి చేయాలని సూచించారు. సదస్సులో చర్చలు, పరిశోధనలు కేవలం శాస్త్రీయ పరిధిలోనే కాకుండా విధాన రూపకల్పన, ఆచరణాత్మక పరిష్కారాలకు దోహదపడాలని ఆకాంక్షించారు. తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణకు మరింత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్ పరిసరాల్లో 500కు పైగా బల్క్ డ్రగ్ కంపెనీలు, 12 వేలకు పైగా పరిశ్రమలు ఉన్నందున పర్యావరణ ప్రమాణాల అమలు మరింత కీలకమని పేర్కొన్నారు. కాకతీయ యూనివర్సిటీని ప్లాస్టిక్ రహిత క్యాంపస్‌గా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టాలని, పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని ఆయన పిలుపునిచ్చారు.
కాలుష్య నియంత్రణపై పర్యవేక్షణ కావాలి
డా. బి.సేన్‌గుప్తా కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి మాజీ సభ్య కార్యదర్శి డా. బి. సేన్‌గుప్తా మాట్లాడుతూ దేశంలో కాలుష్య నియంత్రణకు పటిష్టమైన పర్యవేక్షణ వ్యవస్థలు, నిబంధనల కఠిన అమలు అవసరమన్నారు. దేశంలో ఉత్పత్తి అయ్యే మురుగునీటిలో కేవలం 38–40 శాతం మాత్రమే శుద్ధి అవుతోందని, 296 నదీ ప్రాంతాలు కాలుష్యానికి గురవుతున్నాయని, పరిశ్రమలు, విద్యుత్ కేంద్రాలు, వాహనాల కాలుష్యంతో 132 నగరాలు తీవ్ర కాలుష్యాన్ని ఎదుర్కొంటున్నాయని తెలిపారు. ఉత్తర భారతదేశంలో శీతాకాల వాతావరణ పరిస్థితులు కాలుష్యకారకాలను వాతావరణంలో నిలిపివేసి స్మాగ్ తీవ్రతను పెంచుతున్నాయని పేర్కొన్నారు.
సమగ్ర పర్యావరణ అంచనాతోనే సుస్థిర అభివృద్ధి
జాయింట్ సెక్రటరీ ఆచార్య పి. వెంకటేశ్వర్ రావు మాట్లాడుతూ సుస్థిర అభివృద్ధికి వాయు, శబ్ద, జల, జీవ, భూ పర్యావరణాలపై సమగ్ర అధ్యయనం అవసరమన్నారు. పరిశ్రమలు, అభివృద్ధి ప్రాజెక్టుల ప్రభావాలను అంచనా వేసేటప్పుడు సామాజిక, ఆర్థిక, ఆరోగ్య, ప్రమాద ప్రభావాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ఈ అంచనాల ఆధారంగా సమర్థవంతమైన పర్యావరణ నిర్వహణ ప్రణాళిక రూపొందించి కాలుష్య నియంత్రణ చర్యలను కచ్చితంగా అమలు చేయాలని తెలిపారు. రెండు రోజుల సదస్సులో పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణపై విస్తృత సాంకేతిక ఉపన్యాసాలు, ప్యానల్ చర్చలు నిర్వహించగా, విద్యార్థులు, పరిశోధకులు ఉత్సాహంగా పాల్గొని నిపుణులతో ప్రశ్నోత్తరాల్లో పాల్గొన్నారు. సదస్సు ద్వారా పరిశోధన–విధానం–ఆచరణ మధ్య సమన్వయానికి ప్రాధాన్యత లభించింది. కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ దినేష్, పాఠ్య ప్రణాళిక అధ్యక్షురాలు ఆచార్య టి.సవితా జ్యోత్స్నతోపాటు పలువురు బోధనా, బోధనేతర సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు



