మెరుపు తీగెలు
కొత్త పెళ్ళికూతురులా కళకళలాడుతూ వుంది కొత్త యిల్లు!
కన్నులు పట్టనట్టుగా యింటిని చూస్తున్నాడు అతడు. అతని ముఖంలో తృప్తి కొట్టొచ్చినట్టుగా కనపడుతోంది.
ఇల్లంతా కలియదిరిగాడు.
చలువరాతి గచ్చుమీద పడి పొర్లాడు. బోర్లా పడ్డాడు. వెల్లకిలా పడ్డాడు. తల్లి గుండెలమీద పసి పిల్లాడిలా ఆదమరిచి నిద్రపోయాడు. అంతలోనే వులిక్కిపడి ఫ్లోర్ మీంచి లేచాడు.
ఏదో గుర్తుకువచ్చినట్టు యింట్లోంచి వెళ్ళబోతూ ఆగాడు. ఆగి యింటిని మరోసారి పరిశీలనగా చూశాడు.
తన కష్టం అణువణువునా కనిపిస్తున్నట్టే వుంది.
పెద్దగా గుండెలనిండా గాలి పీల్చుకున్నాడు.
ఒక గదిలోంచి మరో గదిలోకి అడుగు పెట్టాడు. నెమ్మదిగా అడుగులు వేస్తూ గోడల్ని తడిమాడు. కిటికీ దగ్గర నిలబడ్డాడు. గాలి అతడి ముఖాన్ని నిమిరింది. కళ్ళు మూసి తెరిచాడు. అక్కడి నుండి బెడ్ రూమ్‌కూ బెడ్ రూమ్ నుండి బాత్ రూమ్‌కూ వెళ్ళాడు. ఫ్లోర్ మీద నీళ్ళు పోసి చూశాడు. నీళ్ళు నిలువకుండా మూలకు వెళ్ళి డ్రైన్‌లోకి జారిపోయాయి.
కిచెన్‌లోకి వెళ్ళాడు. కిచెన్ ఫ్లాట్ ఫామ్ చూశాడు. గ్యాసు పైపుకోసం పెట్టిన కన్నంలో చెయ్యి పెట్టి చూశాడు. సెల్ఫ్‌లు చూశాడు. మూల మూలలూ చూశాడు.
మళ్ళీ హాల్లోకి వచ్చాడు. స్లాబ్ వంక చూస్తూ బయటకు వస్తూ వున్నాడు.
ఇంతలో ‘అసిరయ్యా… అసిరయ్యా’ పిలుపు వినిపించింది. పరుగున గుమ్మంలోకి వచ్చాడు. అతడిని చూస్తూనే ‘ఏమిటి మేస్త్రీ… లోపల వున్నావా?, నయం నువ్వు లేవని తాళం వేసుకు వెళ్ళిపోయేవాణ్ని…’ అన్నాడు ఓనర్.
‘లేదయ్యా, ఆఖరి రోజు కదా… సామాన్లు యేమైనా మర్చిపోయానేమోనని వోసారి చూసుకున్నా’ అన్నాడు అతడు.
ఇంటికి తాళం వేసి ఓనర్ కారెక్కి వెళ్ళిపోతుంటే, నమస్కారం చేసిన అతడు రెండడుగులు వేసి రోడ్డెక్కాడు. ముందుకు నడుస్తూ ఆగి వెనక్కితిరిగి చూశాడు.
ఎందుకోగాని తను కట్టిన ఆ కొత్త యిల్లు పరాయిదిగా అనిపించింది!





