“ఈవీఎంలపై వచ్చిన అభ్యంతరాలు ప్రధానంగా ఐదు అంశాలకు సంబంధించినవి. మొదటిది, వోటరు తాను వేసిన వోటును స్వయంగా ధృవీకరించుకునే అవకాశం లేకపోవడం. రెండవది, యంత్రాల్లో ఉపయోగించే సాఫ్ట్వేర్ వివరాలు పూర్తిగా బహిరంగంగా లేకపోవడం. మూడవది, యంత్రాల్లో సాంకేతిక మార్పులు లేదా జోక్యం జరిగితే వాటిని గుర్తించడం కష్టమవడం. నాలుగవది, అనుమానం వచ్చినప్పుడు వోట్లను స్వతంత్రంగా తిరిగి లెక్కించే అవకాశం లేకపోవడం. ఐదవది, యంత్రాల భద్రత, నిర్వహణపై నిరంతర పర్యవేక్షణ అవసరం కావడం..”

దేశాలు ఈవీఎంలను వదిలేసి మళ్లీ బ్యాలెట్ పేపర్ల వైపు ఎందుకు మళ్లుతున్నాయి? వోటింగ్ వేగంగా జరగి ఫలితాలు త్వరగా రావడం మాత్రమే ఎన్నికల వ్యవస్థకు ప్రామాణికమా? వోటరు వేసిన వోటు తాను కోరుకున్న అభ్యర్థికే పడిందని, లెక్కింపులోనూ అదే నమోదైందని అతను స్వయంగా తెలుసుకునే అవకాశం ఉండకూడదా? ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు పూర్తి నమ్మకం కలగాలంటే పారదర్శకత అవసరం. యంత్రాల పనితీరుపై అధికారులు భరోసా ఇవ్వడం మాత్రమే సరిపోదు. ప్రజలు కూడా ఆ ప్రక్రియను పరిశీలించి నమ్మగలగాలి. ఈ కారణంగానే కొన్ని ప్రజాస్వామ్య దేశాలు ఈవీఎంలను పక్కనపెట్టి మళ్లీ బ్యాలెట్ పద్ధతిని ఎంచుకున్నాయి.
నెదర్లాండ్స్ ఇందుకు ఒక ఉదాహరణ. అక్కడ 1990ల నుంచే ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రాలను ఉపయోగించేవారు. అయితే 2006లో స్వతంత్ర పరిశోధకులు వాటిలోని భద్రతా లోపాలను బయటపెట్టారు. యంత్రాల్లోని చిప్పులను మార్చడం ద్వారా వాటి పనితీరును ప్రభావితం చేయవచ్చని నిరూపించారు. యంత్రాల నుంచి వెలువడే విద్యుదయస్కాంత తరంగాల ద్వారా వోటింగ్ సమాచారాన్ని గుర్తించే అవకాశం కూడా ఉందని చూపించారు. అంతకంటే ముఖ్యమైన సమస్య మరోటి ఉంది. వోటరు వేసిన వోటుకు సంబంధించిన స్వతంత్ర కాగితపు ఆధారం లేదు. యంత్రంలో నమోదైన సమాచారాన్ని తిరిగి అదే యంత్రం ఆధారంగా పరిశీలించాల్సి వచ్చేది. దీంతో ఎన్నికల పారదర్శకతపై సందేహాలు పెరిగాయి. 2007లో ప్రభుత్వం ఈ యంత్రాల వినియోగాన్ని నిలిపివేసింది. మళ్లీ బ్యాలెట్ పేపర్లు, చేతితో వోట్ల లెక్కింపు ప్రారంభించింది.
జర్మనీ అనుభవం కూడా ఇదే విషయాన్ని చెబుతోంది. 2005 ఎన్నికల్లో అక్కడ ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రాలను ఉపయోగించారు. అయితే 2009లో జర్మనీ రాజ్యాంగ న్యాయస్థానం కీలక తీర్పు ఇచ్చింది. వోటు నమోదు, లెక్కింపు ప్రక్రియలను సాధారణ పౌరుడు కూడా అర్థం చేసుకుని పరిశీలించగలగాలని స్పష్టం చేసింది. ఎన్నికల ప్రక్రియను పరిశీలించడానికి ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానం అవసరం కాకూడదని పేర్కొంది. యంత్రాల్లో నమోదైన వోట్లను ప్రజలు స్వయంగా ధృవీకరించుకునే అవకాశం లేకపోవడాన్ని ప్రధాన సమస్యగా గుర్తించింది. ఈ తీర్పు తర్వాత జర్మనీలో ఆ తరహా ఎలక్ట్రానిక్ వోటింగ్ విధానం నిలిచిపోయింది.
ఐర్లాండ్ కూడా ఈవీఎంలపై ప్రయోగం చేసి వెనక్కి తగ్గింది. 2002లో వేలాది ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రాలను కొనుగోలు చేసింది. ఇందుకోసం 50 మిలియన్ యూరోలకు పైగా ఖర్చు చేసింది. కానీ ఆ యంత్రాల్లో వోటరు ధృవీకరించుకునే కాగితపు రికార్డు లేదు. సాఫ్ట్వేర్ వివరాలు కూడా పూర్తిగా బహిరంగంగా లేవు. యంత్రాలు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో స్వతంత్రంగా పరిశీలించడం కష్టమైంది. దీంతో 2009లో ఆ ప్రాజెక్టును రద్దు చేసింది. తిరిగి పేపర్ బ్యాలెట్ విధానాన్నే కొనసాగిస్తోంది.
ఫిన్లాండ్, కజకిస్తాన్, బంగ్లాదేశ్లలోనూ ఇలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఫిన్లాండ్లో 2008లో కొన్ని స్థానిక ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ వోటింగ్ను ప్రయోగాత్మకంగా అమలు చేశారు. అయితే సాంకేతిక, విధానపరమైన లోపాల వల్ల కొన్ని ఎన్నికలను తిరిగి నిర్వహించాలని న్యాయస్థానం ఆదేశించింది. కజకిస్తాన్ తన సైలౌ ఎలక్ట్రానిక్ వోటింగ్ విధానాన్ని ప్రజా విశ్వాసం, సాఫ్ట్వేర్ నిర్వహణ, ఆడిట్ సమస్యల కారణంగా నిలిపివేసింది. బంగ్లాదేశ్ 2018లో కొన్ని నియోజకవర్గాల్లో ఈవీఎంలను ఉపయోగించింది. అయితే 2023 సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ బ్యాలెట్ పేపర్లను ఎంచుకుంది.
ఈ దేశాల అనుభవాలను చూస్తే ఈవీఎంలపై వచ్చిన అభ్యంతరాలు ప్రధానంగా ఐదు అంశాలకు సంబంధించినవి. మొదటిది, వోటరు తాను వేసిన వోటును స్వయంగా ధృవీకరించుకునే అవకాశం లేకపోవడం. రెండవది, యంత్రాల్లో ఉపయోగించే సాఫ్ట్వేర్ వివరాలు పూర్తిగా బహిరంగంగా లేకపోవడం. మూడవది, యంత్రాల్లో సాంకేతిక మార్పులు లేదా జోక్యం జరిగితే వాటిని గుర్తించడం కష్టమవడం. నాలుగవది, అనుమానం వచ్చినప్పుడు వోట్లను స్వతంత్రంగా తిరిగి లెక్కించే అవకాశం లేకపోవడం. ఐదవది, యంత్రాల భద్రత, నిర్వహణపై నిరంతర పర్యవేక్షణ అవసరం కావడం.
భారతదేశంలో ఈవీఎంల వినియోగం 1990లలో పరిమిత స్థాయిలో ప్రారంభమైంది. 2004 లోక్సభ ఎన్నికల నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. భారత ఎన్నికల సంఘం ఈవీఎంలు ఇంటర్నెట్కు అనుసంధానం కాని యంత్రాలని చెబుతోంది. వాటిలోని సాఫ్ట్వేర్ ప్రత్యేక చిప్పుల్లో ఉంటుందని వివరిస్తోంది. యంత్రాలను వివిధ ప్రాంతాలకు పంపే ముందు రాండమైజేషన్, సీలింగ్ వంటి చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతోంది. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో మాక్ పోలింగ్ కూడా నిర్వహిస్తోంది.అయితే భారతదేశంలోనూ వోటు ధృవీకరణపై చర్చ జరిగింది. 2013లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత వీవీపీఏటీ విధానాన్ని ప్రవేశపెట్టారు. వోటరు ఈవీఎంలో బటన్ నొక్కినప్పుడు తాను ఎంచుకున్న అభ్యర్థి పేరు, గుర్తుతో కూడిన కాగితపు స్లిప్ కొన్ని సెకన్ల పాటు కనిపిస్తుంది. తర్వాత అది సీలు చేసిన పెట్టెలో పడుతుంది. ఈ స్లిప్పుల్లో నిర్ణీత సంఖ్యను లెక్కించి ఈవీఎంలో నమోదైన ఫలితాలతో పోల్చి చూస్తారు.
అయితే ఇక్కడే మరో ప్రశ్న వస్తోంది. నిర్ణీత సంఖ్యలో స్లిప్పులను లెక్కించడం సరిపోతుందా? మరిన్ని స్లిప్పులను లెక్కించాలా? లేక అన్ని వీవీపీఏటీ స్లిప్పులనూ లెక్కించాలా? అన్నది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత విధానం సరిపోతుందని ఎన్నికల సంఘం చెబుతోంది. మరింత విస్తృతంగా స్లిప్పులను లెక్కించాలని కొన్ని ప్రతిపక్ష పార్టీలు కోరుతున్నాయి. పూర్తి స్థాయి లెక్కింపు వల్ల ఫలితాల ప్రకటన ఆలస్యమవుతుందని ఎన్నికల సంఘం అభిప్రాయపడుతోంది.
భారతదేశంలోని విధానాన్ని ఇతర దేశాలు వదిలేసిన పేపర్ రికార్డు లేని ఈవీఎంలతో పోల్చలేం. మన దేశంలో వీవీపీఏటీ ద్వారా వోటరు తన వోటును కాగితంపై చూసుకునే అవకాశం ఉంది. ఇది ఒక ముఖ్యమైన భద్రతా చర్య. అయితే ఆ స్లిప్పులను ఎంత విస్తృతంగా లెక్కిస్తున్నారు? ఎలక్ట్రానిక్ ఫలితాలతో వాటిని ఎంత సమర్థంగా పోల్చుతున్నారు? అన్న అంశాలపై స్పష్టత అవసరం. భద్రతా చర్యలు ఉన్నాయని చెప్పడం ఒకటైతే, వాటిని ప్రజలకు నమ్మకం కలిగించేలా అమలు చేయడం మరొకటి.
ప్రపంచంలోని అన్ని దేశాలూ ఈవీఎంలను వదిలేయలేదు. బ్రెజిల్ వంటి దేశాలు చాలా కాలంగా ఎలక్ట్రానిక్ వోటింగ్ను కొనసాగిస్తున్నాయి. భారతదేశం కూడా వీవీపీఏటీతో కూడిన విధానాన్ని అనుసరిస్తోంది. కాబట్టి అసలు చర్చ ఈవీఎంలు ఉండాలా? వద్దా? అన్నదానికే పరిమితం కాకూడదు. వాటి ద్వారా నమోదైన వోట్లను ఎలా ధృవీకరించాలి? ఏదైనా లోపం జరిగితే దాన్ని ఎలా గుర్తించాలి? ప్రజలకు పూర్తి నమ్మకం కలిగించేలా ఎలాంటి ఆడిట్ వ్యవస్థ ఉండాలి? అన్న అంశాలపై చర్చ జరగాలి.
ఎన్నికలు కేవలం వోట్లను లెక్కించి ఫలితాలు ప్రకటించే ప్రక్రియ కాదు. ప్రజల తీర్పును పారదర్శకంగా నిరూపించాల్సిన బాధ్యత కూడా ఎన్నికల వ్యవస్థపై ఉంది. యంత్రం సరిగ్గా పనిచేస్తోందని అధికారులు చెప్పడం మాత్రమే సరిపోదు. ఆ ప్రక్రియపై ప్రజలకు కూడా నమ్మకం కలగాలి. ఎన్నికల వ్యవస్థను అర్థం చేసుకోవడానికి సామాన్య పౌరుడు సాంకేతిక నిపుణుడిగా మారాల్సిన అవసరం ఉండకూడదు.
కొన్ని దేశాలు ఈ కారణంగానే వేగం కంటే విశ్వసనీయతకు ప్రాధాన్యమిచ్చి మళ్లీ బ్యాలెట్ పద్ధతిని ఎంచుకున్నాయి. భారత్ కూడా ఈ అనుభవాలను పరిశీలించాలి. వీవీపీఏటీ స్లిప్పుల లెక్కింపును మరింత విస్తృతం చేయాలా? స్వతంత్ర ఆడిట్ వ్యవస్థను బలోపేతం చేయాలా? అన్న అంశాలపై నిర్మాణాత్మక చర్చ జరగాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ముఖ్యమైనది ఎన్నికల ఫలితాలను త్వరగా ప్రకటించడం మాత్రమే కాదు. ప్రతి వోటరు తన వోటు సరిగ్గా నమోదైందని, సరిగ్గా లెక్కించబడిందని నమ్మగలగడం. ఆ నమ్మకమే ప్రజాస్వామ్యానికి అసలైన బలం.





