“వాణిజ్యాన్ని నియంత్రించడానికి , దిగుమతి సుంకాలను విధించడానికి కాంగ్రెస్‌కు హక్కు ఉంది, కానీ ట్రంప్ జాతీయ భద్రత పేరుతో లేదా అన్యాయమైన వాణిజ్య పద్ధతుల ద్వారా సుంకాలను విధించడానికి చట్టాలను దుర్వినియోగం చేశారు. ఆ అధికారాన్ని పరిమితం చేయడానికి డెమోక్రటిక్ పార్టీ చేసే ప్రయత్నాలు అధ్యక్షుడి వీటోను ఎదుర్కొనే అవకాశం ఉంది. అమెరికన్ టెక్ దిగ్గజాలపై డిజిటల్ సేవల పన్ను విధించే యూరోపియన్ దేశాలపై 100% సుంకం విధించడం వంటి తక్షణ బెదిరింపులను ట్రంప్ అమలు చేస్తారా లేక యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నుండి ఎయిర్‌బస్‌కు ఇచ్చిన €3 బిలియన్ల ($3.37 బిలియన్ల) రుణం, 2025 నుండి చాలా వరకు కొనసాగుతున్న అట్లాంటిక్ వాణిజ్య సంధిని దెబ్బతీస్తుందా అనేది మరో ప్రశ్న..”
ఇరాన్ , ఇజ్రాయెల్
కాంగ్రెస్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నియంత్రణ కోల్పోవడం, ఇరాన్‌తో తన దేశానికి ఉన్న ఎనిమిది నెలల సంఘర్షణ గమనాన్ని ఎటు మారుస్తుందో తక్షణమే స్పష్టంగా తెలియడం లేదు. సామాన్యులకు బాధాకరంగా పెరిగిన ఇంధన ధరలకు ఈ సంఘర్షణే కారణమని చాలామంది ఆరోపిస్తుండగా, వోటర్లు ఈ సంఘర్షణతో విసిగిపోయామని తమ వోట్ల ద్వారా స్పష్టం చేశారు. శాంతి ఒప్పందం కోసం ప్రయత్నించడానికి ట్రంప్‌కు గతంలో కంటే ఇప్పుడు మరింత బలమైన కారణాలు ఉన్నాయని, మధ్యంతర ఎన్నికల తర్వాత ఇరాన్‌పై మరో పూర్తిస్థాయి దాడి జరిగే అవకాశం తక్కువని కొన్ని గల్ఫ్ ప్రభుత్వాలు ఇప్పుడు విశ్వసిస్తున్నాయని, గల్ఫ్ ప్రభుత్వాల ఆలోచనా విధానం గురించి తెలిసిన ఇద్దరు విశ్లేషకుల అభిప్రాయం .
ఇజ్రాయెల్ విషయానికొస్తే, డెమోక్రాట్ల నియంత్రణలో ఉన్న ప్రతినిధుల సభ, సెనేట్, ఇరాన్‌తో పాటు గాజా , లెబనాన్లలో ఇజ్రాయెల్ సైనిక కార్యకలాపాలపై కాంగ్రెస్ మరింత సునిశితమైన దృష్టి సారించవచ్చు. అదే సమయంలో సైనిక సహాయం, ఆయుధాల అమ్మకాల ద్వారా ఇజ్రాయెల్‌కు అమెరికా అందిస్తున్న దీర్ఘకాలిక మద్దతు ఇకముందు సాధ్యంకాకపోవచ్చు. ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహును పదవీచ్యుతి చేయాలని చూస్తున్న ప్రత్యర్థులు, ప్రస్తుత డెమోక్రట్ల విజయాన్ని, ఇజ్రాయిల్ ప్రధాని యుఎస్‌లోని రెండు పార్టీల మద్దతు కోల్పోయారన్న కోణంలో చూస్తున్నాయి. గత వారం ఇజ్రాయెల్ ఎన్నికలు అసంపూర్తిగా ముగియడంతో వారు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇంధన పంపు ధరలు
ఇరాన్ యుద్ధం గల్ఫ్ నుండి ముడి చమురు మరియు ద్రవీకృత సహజ వాయువు సరఫరాలను అడ్డుకుంది, దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు , ఇంధన పంపుల వద్ద ధరలు పెరిగాయి. ఈ ఎన్నికలు అమెరికా-ఇరాన్ శాంతి చర్చలకు మరింత ఊపునివ్వగలవని బుధవారం ఇంధన మార్కెట్ అంచనా వేసింది. వరుసగా మూడవ రోజు కూడా చమురు ధరలు తగ్గాయి, కానీ నిల్వల స్థాయిలు తక్కువగా ఉండటం వల్ల పెద్ద ఎత్తున అమ్మకాలు జరగడం సాధ్యం కాలేదని విశ్లేషకులు తెలిపారు. “అధ్యక్షుడు ట్రంప్ మధ్యప్రాచ్య యుద్ధానికి మంగళం పాడాలని చూస్తునానరని మార్కెట్ ఎక్కువగా పందెం కాస్తున్నట్లు కనిపిస్తుంది ,” అని సాక్సో బ్యాంక్ విశ్లేషకుడు ఓలే హాన్సెన్ అన్నారు.
ఉక్రెయిన్
డెమోక్రాటిక్, రిపబ్లికన్ చట్టసభ సభ్యుల నుండి విస్తృత మద్దతు ఉన్నప్పటికీ, రష్యాతో ఉక్రెయిన్ పోరాడుతున్నందున, ట్రంప్ ఆ దేశానికి ప్రత్యక్ష అమెరికా ఆర్థిక , సైనిక సహాయాన్ని చాలా వరకు నిలిపివేశారు. రష్యా డీజిల్‌పై ఆంక్షలను ఎత్తివేయడం, రష్యా ఇంధనంపై ఆంక్షలను రద్దు చేయడం వంటి చర్యలతో, వాటిపై చట్టంగా సంతకం చేసిన కొద్ది వారాలకే, ఆయన చాలా మంది రిపబ్లికన్లతో సహా కాంగ్రెస్ సభ్యులకు ఆగ్రహం తెప్పించారు. కాంగ్రెస్ ఉభయ సభలపై నియంత్రణ సాధిస్తే, డెమోక్రాట్లు ఉక్రెయిన్‌కు కొత్త సహాయాన్ని ప్రతిపాదించగలరు. రిపబ్లికన్ల నుండి తగినంత మద్దతు లభించి, మూడింట రెండు వంతుల మెజారిటీని సాధిస్తే, కొత్త సహాయ ప్యాకేజీ ట్రంప్ వీటోను తట్టుకుని నిలబడుతుంది. అయితే, అమెరికా సహాయంలో ఎలాంటి పెరుగుదల అయినా త్వరగా వచ్చే అవకాశం లేదు. అంతేకాదు ఉక్రెయిన్ భారీ అవసరాలను తీర్చదు — అదేమిటంటే, ఈ శీతాకాలంలో దాని ఇంధన మౌలిక సదుపాయాలను , నగరాలను రక్షించడానికి అవసరమైన, అమెరికాలో తయారైన పేట్రియాట్ వైమానిక రక్షణ ఇంటర్సెప్టర్ల కొరత.
ట్రంప్ విధానాలకు డెమోక్రట్ల నుంచి ఇబ్బందులు
హౌస్ ఫారిన్ అఫైర్స్ కమిటీకి అధ్యక్షత వహించే అభ్యర్థి, న్యూయార్క్‌కు చెందిన డెమోక్రాటిక్ ప్రతినిధి గ్రెగొరీ మీక్స్, రష్యన్ డీజిల్‌ను తిరిగి ప్రపంచ మార్కెట్లోకి తీసుకురావాలన్న ట్రంప్ ప్రణాళికను అడ్డుకోవడానికి ఉభయపక్షాల మద్దతు ఉన్న చట్టాన్ని ప్రవేశపెట్టారు. కానీ, రష్యాతో జరుగుతున్న త్రైపాక్షిక శాంతి చర్చలలో ట్రంప్ పరిపాలన వైఖరిని ఈ మధ్యంతర ఎన్నికలు మార్చే అవకాశం లేదు. ఈ చర్చలలో, ఒక ఒప్పందానికి రావడానికి ఉక్రెయిన్‌పై రాయితీలు ఇవ్వాలని ఒత్తిడి చేస్తూనే, అదే సమయంలో అమెరికా పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉండే వ్యాపార ఒప్పందాలను మాస్కోతో చర్చిస్తున్నది .ట్రంప్ “శాంతి స్థాపన ప్రయత్నాల”పై మధ్యంతర ఎన్నికల ఫలితాలు ప్రభావం చూపవని తాము ఆశిస్తున్నట్లు క్రెమ్లిన్ తెలిపింది.
వాణిజ్యం
ఈ ఎన్నికలు, సుంకాలను నివారించడానికి ఆసియాలోని కొన్ని దేశాలు చేసిన పెట్టుబడి హామీలు నిదానించడానికి మరింత కారణం ఇవ్వవచ్చని, అలాగే కొనసాగుతున్న వాణిజ్య చర్చలలో ఆర్థిక ప్రత్యర్థి అయిన చైనాకు ఒక రకమైన పైచేయి లభించేలా చేయవచ్చని విశ్లేషకులు తెలిపారు. అయితే, అమెరికా-చైనా విస్తృత ఆర్థిక సంబంధాలు “పెళుసుగా ఉన్న స్థిరత్వం” స్థితిలోనే కొనసాగే అవకాశం ఉందని బీజింగ్‌లోని ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ పారిశ్రామిక విధాన విశ్లేషకుడు చిమ్ లీ అభిప్రాయపడ్డారు.
భారత్ కు ఊరట?
ట్రంప్ మధ్యంతర ఎన్నికలలో ఎదుర్కొన్న ఓటములు, అమెరికాతో వాణిజ్య ఒప్పందం కోసం భారతదేశం జరుపుతున్న చర్చలకు ఊరట కలిగించవచ్చు. న్యూదిల్లీ తన రైతులను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నందున ఈ చర్చలు ఆలస్యమవుతున్నాయి.”అమెరికా మధ్యంతర ఎన్నికలలో ఓటమి తర్వాత, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏకపక్ష సుంకాలను విధించే సామర్థ్యం ఖచ్చితంగా ఒక సవాలును ఎదుర్కొంటుంది. ఏదో ఒక సమయంలో వాణిజ్య చర్యలకు ఆయనకు కాంగ్రెస్ ఆమోదం అవసరం, ఆ విషయంలో ఆయన బలహీనపడ్డారు,” అని భారత కేంద్ర ప్రభుత్వ మాజీ వాణిజ్య కార్యదర్శి అనూప్ వధావన్ అన్నారు. వాణిజ్యాన్ని నియంత్రించడానికి , దిగుమతి సుంకాలను విధించడానికి కాంగ్రెస్‌కు హక్కు ఉంది, కానీ ట్రంప్ జాతీయ భద్రత పేరుతో లేదా అన్యాయమైన వాణిజ్య పద్ధతుల ద్వారా సుంకాలను విధించడానికి చట్టాలను దుర్వినియోగం చేశారు. ఆ అధికారాన్ని పరిమితం చేయడానికి డెమోక్రటిక్ పార్టీ చేసే ప్రయత్నాలు అధ్యక్షుడి వీటోను ఎదుర్కొనే అవకాశం ఉంది. అమెరికన్ టెక్ దిగ్గజాలపై డిజిటల్ సేవల పన్ను విధించే యూరోపియన్ దేశాలపై 100% సుంకం విధించడం వంటి తక్షణ బెదిరింపులను ట్రంప్ అమలు చేస్తారా లేక యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నుండి ఎయిర్‌బస్‌కు ఇచ్చిన €3 బిలియన్ల ($3.37 బిలియన్ల) రుణం, 2025 నుండి చాలా వరకు కొనసాగుతున్న అట్లాంటిక్ వాణిజ్య సంధిని దెబ్బతీస్తుందా అనేది మరో ప్రశ్న.
ఏఐ , టెక్నాలజీ
ఏఐ డేటా సెంటర్ల విస్తరణపై చాలా మంది యూఎస్ వోటర్లు ఆందోళన చెందుతున్నారని ఎగ్జిట్ పోలింగ్ వెల్లడించింది. ఇది ప్రధాన ఆసియా చిప్ తయారీదారుల షేర్లలో ప్రకంపనలు సృష్టించింది. “కాంగ్రెస్‌లో డెమోక్రాట్ల పూర్తి విజయం టెక్నాలజీపై ఒత్తిడిని పెంచుతుంది, అలాగే ఏఐకి సంబంధించిన అన్ని విషయాలపై నియంత్రణపరమైన ఒత్తిడిని తీసుకువచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా, మనం రోజూ చూస్తూ, తరచుగా తేలికగా తీసుకునే అనియంత్రిత వృద్ధి గణాంకాలను ఇది బహుశా నెమ్మదింపజేయవచ్చు,” అని ఓక్లహోమాలోని లాంగ్‌బో అసెట్ మేనేజ్మెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జేక్ డాలర్హైడ్ అన్నారు.





