“గోబెల్స్” గోత్రజులు?

“అధికారం అనబడే ఆలంబన దొరికిన తర్వాత అది పేట్రేగి పోయింది.అన్నిస్తంబాలు లాగానే నాల్గవ స్తంభం బీటలు వారింది.ఈ తరహా వ్యవహారం కేంద్రం లోనే కాదు.ఇప్పుడు రాష్ట్రలలో కూడా ఇదే తరహా పెంపుడు మీడియా నడుస్తోంది.ఈ మీడియా లక్ష్యం ఒక్కటే.తాము ఎంచుకున్న రాజకీయ నేతలను ఆకాశానికి ఎత్తడం,ఏదన్నా సహేతుక విమర్శ వచ్చినా వారిపై పరుష భాషతో దాడి చేయడం.మానసిక హింసా క్రీడలకు అంకురార్పణ చేశారు.”
అసలు ఎవరీ గోబెల్స్?డేంజర్ బెల్స్ మాదిరిగా!నియంతలకు పర్యాయపదం హిట్లర్! ఆయనకి ముందు వెనుక గోబెల్స్.ఆయన లేకుండా హిట్లర్ లేడు.ఎందుకంటే ఎన్నో అబద్ధాలు,దుష్ప్రచారాల అల్లిక గోబెల్స్.”ఒక అబద్దం పదేపదే గనుక చెప్పగలిగితే!అదే నిజం అవుతుంది”అని సూత్రీకరించిన ప్రపంచ రాజకీయ మానవుడు.ఆయనే జర్మనీ నియంత హిట్లర్ ఎదుగుదల లో క్రియాశీల పాత్ర.ఆయనే హిట్లర్ చెవులు,ముక్కు, నోరు కూడా! అందుకే ఆయనను ఏరికోరి సమాచార మంత్రిగా గోబెల్స్ ను నియమించుకున్నారు.
నాజీయిజం ఏర్పాటు నుండి దాని అభివృద్ధి లో సాంస్కృతిక పరమైన పాత్ర కీలకం.అలాంటి కీలక శాఖలో తిష్టవేసి పుకార్లు,అబద్ధాలు పదేపదే చెప్పడం ద్వారా నిజం అదే అని నమ్మించి “అబద్దాల”కు నగిషీలు చెక్కిన మహామనిషి!కనుకనే ప్రపంచం ఆయనను గుర్తుంచుకుంది.అంతేకాదు ,ఆ కళలో ఆరితేరిన ప్రపంచ మానవుడు.అందుకే హిట్లర్ కంటే ఎక్కువ ప్రచారంలో ఉన్న మనిషి గోబెల్స్.”నిజం చెప్పులు తొడిగే లోగా అబద్దం ప్రపంచాన్ని చుట్టేస్తుంది”అన్న ఫిలాసఫీకి కూడా ఆయనే పేటెంట్.వ్యాకరణ పరిభాషలో చెప్పాలంటే కర్త,కర్మ,క్రియ.అట్లాంటి ‘గోబెల్స్’ అక్రమ సంతానం ఇప్పుడు ప్రపంచం అంతా వ్యాప్తి చెందింది.
గోబెల్స్ గోత్రజులు అంటే ఆయన సూత్రాలు మనసా వాచా కర్మణా వంటపట్టించుకొని తూచ తప్పకుండా అమలు జరిపే వారని అర్థం.అలాంటి గోబెల్స్ అక్రమ సంతానం లేదా గోత్రజుల సంఖ్య మన దేశం లో తక్కువేం లేదు.ఇప్పుడు మనలను ఏలేటి వారంతా గోబెల్స్ గోత్రజులే ! అందులో సందేహమే లేదు.ఎన్నికల ముందు వాగ్దానాలు చేయడం ఎన్నికల తర్వాత వాటిని మరిచిపోయో వారంతా ఇంచుమించు ఈయన గోత్రీకులు ,సూత్రీకులే, కాకుంటే తరతమ స్థాయిలను బట్టి కాస్తా దూరపు బంధువులుగా నైన చూడ వచ్చును.నీతులు ఎదుటివారికి చెప్పి అవినీతి పుట్టలుగా మారిన రాజకీయ పిపిలీకాలదీ ఈయన వాసనే.నీతికి, అవినీతి కి మధ్య సరిహద్దు రేఖ గుర్తుపట్టకుండా చెరిపేశారు.ఒకరకంగా చెప్పాలంటే మన రాజకీయ ఆషాడ భూతులంతా ఈయన అక్రమ సంతానమే.
రాష్ట్రాలు కావచ్చు, కేంద్రం లో కావచ్చును.ఇప్పుడు పాలకుల తరపున మాట్లాడే మీడియా అంతా ఏ పేరుతో నైనా పిలువ వచ్చును.కానీ,అది నూటికి నూరు శాతం గోదీ మీడియా నే! గోదీ మీడియా కు పోటీగా వచ్చిన సోషల్ మీడియా ను ఎదుర్కొనడం కోసం పాలకులు వాట్సాప్, ఫేస్బుక్ లలో సొంత యూనివర్సిటీలు తెరిచారు.వీరు తాము ఎంచుకున్న నాయకులపై ఈగ వాలినా సహించరు.వాలకపోయినా అక్కడ ఈగలు,లేని ఈకలు సృష్టిస్తారు..వేలాదిమంది హిందూ దేవుళ్ళ బొమ్మలు ధరించి బూతులతో విరుచుకు పడుతారు.విమర్శ ఎంత సహేతుకం అయినా వీరికి పట్టదు.నచ్చిన వార్తకు కామెంట్ చేసినా వీరికి నచ్చదు.వీరి అధికార భాష బూతులు,వీరు రాజకీయ ఆషాడభూతులకు అంగరక్షకులు.
అధికారం అందలం ఎక్కాలంటే మొదట రాజకీయ నాయకుల వ్యూహం గోబెల్స్ గోత్రికులను వెతుక్కొని ,కొనుక్కొని అక్కున చేర్చుకుంటారు.అలా సోషల్ మీడియా ను అబద్దాల అల్లిక గా మార్చేశారు.చిలక పలుకులుగా తీర్చేశారు.చివరకు నిజం చెప్పినా నమ్మని స్థాయిలో ఈ గొబెల్స్ మీడియా ప్రభావం ఉంటుంది. ఉబుసుపోకా, ఉదారత్వంకు అలవాటుపడ్డ ప్రజలు అదే నిజం అనుకుంటారు.తరతరాలుగా పేరుకున్న అజ్ఞానాంధకారం సొమ్ము చేసుకోవడంలో వారికి ఒక ఎజెండా ఉంటుంది.ఇదే అదనుగా రాజకీయ నాయకులు అబద్ధాల అల్లికలు తో మాయామేయ ప్రపంచం సృష్టిస్తున్నారు.వాటికి ఆశ్రిత పెట్టుబడిదారులు ఆర్థిక అరాచకం వెన్నుదన్నుగా నిలుస్తుంది.తమ దోపిడిని సమర్థించే వారికి రక్షణ కవచంగా మీడియా కొంటున్నారు. మలుచుకున్నారు.చెదపురుగులా జర్నలిజం విలువల్ని తినేశారు.ఒక రకంగా నరేంద్ర మోదీ అధికారం లోకి వచ్చేముందు నుంచే ఈ తరహా గోదీ మీడియాకు అంకురార్పణ జరిగింది.అటుతర్వాత అది యదేచ్ఛగా ఎదిగింది.
అధికారం అనబడే ఆలంబన దొరికిన తర్వాత అది పేట్రేగి పోయింది.అన్నిస్తంబాలు లాగానే నాల్గవ స్తంభం బీటలు వారింది.ఈ తరహా వ్యవహారం కేంద్రం లోనే కాదు.ఇప్పుడు రాష్ట్రలలో కూడా ఇదే తరహా పెంపుడు మీడియా నడుస్తోంది.ఈ మీడియా లక్ష్యం ఒక్కటే.తాము ఎంచుకున్న రాజకీయ నేతలను ఆకాశానికి ఎత్తడం,ఏదన్నా సహేతుక విమర్శ వచ్చినా వారిపై పరుష భాషతో దాడి చేయడం.మానసిక హింసా క్రీడలకు అంకురార్పణ చేశారు.దీనివలన పాలనలో అబద్ధాలకు,నటనకు ప్రాధాన్యత పెరిగింది.కొద్దోగొప్పో నిజాలు మాట్లాడిన వారిని,నీతివంతమైన పాలన అనుకున్న వారిని పోల్చుకునే అవకాశం లేకుండా సర్థిసద్దిగట్టారు.
కేజ్రీవాల్,దీదీ,శరద్ పవార్, నవీన్ పట్నాయక్, పినరాయివిజయన్ తదితరులందరిని అవినీతి ముద్రవేసి పీఠాలు లాగేశారు.వాళ్ళే అవినీతి పరులుగా ముద్రవేసిన సువేందు అధికారి,బిశ్వాస్ శర్మ, చంద్రబాబు నాయుడు తదితరులపై పవిత్రజలం చల్లి అవసరాలకు ముఖ్యమంత్రులుగా గద్దెనెక్కించారు.ఇలాచిన్నాచితకా వాషింగ్ పౌడర్లు ఇప్పుడు అధికార పార్టీలో సింహబాగమే!అక్కున జేరిన అవకాశవాదులంతా అందలం ఎక్కారు..అవకాశం ఉన్నమేరకు ఇప్పుడు అవినీతిపరులంతా ఒకే గూటి పక్షులు.అధికారం అంగట్లో సేదతీరిన బేహారులు.గోదీ మీడియా దృష్టి లో వీరే స్వచ్చమైన జాతీయ వాదులు, నిక్కచ్చి పాకిస్తాన్ వ్యతిరేకులు.మరీ మాట్లాడితే హిందూ మతం రక్షకులు,తాజా పీఠాధిపతులు.
పుకార్లు,అబద్ధాలు,భయాలు,దుర్మార్గాలు,మూకదాడులు,బుల్డోజర్ లు అన్నీ వారి అంతరంగీక రాజకీయాల అంతర్భాగమే! ఐటి, సిబిఐ,ఇడి,ఇసి,కోర్టులు,చట్టాలు తదితర స్వతంత్ర రాజ్యాంగ సంస్థలు అన్నీ వీరి పంజరంలో చిలకలే! ఆత్మస్తుతి -పరనింద తప్ప ఈ గోదీ బాబులకు మరో కార్యక్రమం కనపడదు.వినపడదు.పళ్ళాలు గొడితే కొరోనా పరారవుతుంది, గోమూత్రం తాగితే సర్వరోగాలు నయం అవుతాయి.యోగాలు చేస్తే ఆకలి అంతర్ధానం అవుతుంది.తప్ప,ఘర్మజలానికి,కర్మ జలానికి ఖరీదు కట్టే షరాబు మాత్రం లేనేలేరు.
కేంధ్ర మత్రులంతా వైఫల్యాల పుట్టలు.విదేశాంగం చేష్టలుడిగి ఉంది.ఆర్థికశాఖ గోళ్ళూడ కొడుతుంది.చివరకు రక్షణశాఖ మంత్రుల ఇండ్లలో నే పోక్సో కేసులు నమోదు అవుతున్నాయి. బుద్దులు చెప్పాల్సిన విద్యాశాఖలో విజ్ఞ్యత లోపించింది.70 సార్లు పేపర్ లీకులు,17మంది పిల్లల ఆత్మహత్యలు అయినా మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా కు ససేమిరా అంటున్నారు. అనడమే కాదు ఆయనపై ఆందోళన ఫేక్,అబద్దం అంటున్నారు? కాక్రోచ్ పేరుతో యువత వీధుల్లో కొచ్చింది. పది రోజులు పైగా పట్టుదలతో జంతర్ మంతర్ వద్ద యువత అవిశ్రాంత ఆందోళన చేస్తుంది.ఎండకు ఎండుతూ,వానకు తడుస్తూ,వీధుల్లో నిద్రపోతూ పోరాడుతున్నారు.
అయినా ప్రభుత్వంలో కదలికలేదు, చలనం లేదు. ఇవేవి గోదీ మీడియా కు పట్టవు,గిట్టవు.జెన్ జెడ్ యువత ఆందోళన పై కాగడా పెట్టిన వెతికినా ఎక్కడా అర అంగళం వార్త ఏ పేజీలో కనపడదు,ఏ డిజిటల్ మీడియా లో వినపడదు.40 లక్షల మంది విద్యార్థుల భవితవ్యం తో ఆడుకున్న ,17 మంది మరణాలకు కారణం అయిన అవినీతి పరులు గురించి పల్లెత్తి మాట్లాడరు.కానీ,ప్రదాని మోదీ విదేశీటూరు నుండి వచ్చి విమానాశ్రయంలో అరగంట విశ్రాంతి తీసుకుంటే అది నీట్ రీ ఎగ్జామ్ రాసే విద్యార్థుల కోసమని తాటికాయంత అక్షరాలతో పేజీలకు పేజీలు నింపేస్తారు. గొంతు చించుకొని బ్రెకింగ్ న్యూస్ లు అదర గొట్టేస్తారు.దటీజ్ గోదీ మీడియా.వీళ్ళే నిజంగా ఈ దేశంలో గోబెల్స్ , ఫక్తు వాళ్ళ రక్తం నింపుకున్న గోత్రజులు!?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *