“నేడు మనం ప్రపంచానికి డిజిటల్ పురోగతిని గొప్పగా చాటుతున్నప్పటికీ, పౌరసత్వ గుర్తింపు విషయంలో మాత్రం తీవ్రమైన అయోమయంలో ఉన్నాం. ప్రభుత్వం కోట్లాది మంది ప్రజల వేలిముద్రలు, కనుపాపల వివరాలు సేకరిస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ గుర్తింపు వ్యవస్థను నడుపుతోంది. కానీ అదే సమయంలో ఆ వివరాలు పౌరసత్వానికి చట్టబద్ధమైన ధ్రువీకరణ కాదని చెప్పడం ఆశ్చర్యకరం.”
వెంక గారి భూమయ్య సీనియర్ జర్నలిస్ట్ మొబైల్ : 9848559863
ఒక సార్వభౌమ దేశంలో పౌరసత్వం అనేది కేవలం చట్టపరమైన హోదా మాత్రమే కాదు. అది ఒక వ్యక్తికి, ఆ మాతృభూమికి మధ్య ఉండే అత్యంత పవిత్రమైన, భావోద్వేగభరితమైన పేగు బంధం. ప్రపంచంలోని ఏ విదేశీ నేలపై అడుగుపెట్టినా, చేతిలో ఉన్న గుర్తింపు పత్రాన్ని చూపించి ‘నేను భారతీయుడిని’ అని గర్వంగా చెప్పుకునే ఒక సాధారణ పౌరుడికి, సొంత దేశంలోనే ‘నీ భారతీయతకు ఆధారం ఏమిటి?’ అనే ప్రశ్న ఎదురైతే, అంతకంటే అవమానకరమైన పరిస్థితి మరొకటి ఉండదు. ప్రజాస్వామ్య రాజ్యాంగ దేశంలో పౌరసత్వం అనేది పాలకులు ప్రసాదించే వరం కాదు; అది పౌరుడి జన్మహక్కు. కానీ నేడు దేశంలో ఏర్పడిన చట్టపరమైన అయోమయాలు, స్పష్టతలేని విధానాలు పౌరుడి ఉనికినే ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. నూట నలభై ఐదు కోట్లకు పైగా జనాభా ఉన్న దేశంలో ప్రతి పౌరుడూ తన దేశభక్తిని, తన ఉనికిని నిరూపించుకోవడానికి పత్రాల కోసం తిరగాల్సి రావడం పాలనా వ్యవస్థల వైఫల్యానికి పరాకాష్ట. ఈ అనిశ్చితి కేవలం చట్టాలకు సంబంధించినది కాదు; అది ప్రతి పౌరుడి ఆత్మగౌరవాన్ని గాయపరుస్తున్న తీవ్రమైన సమస్య.
జాతీయ భద్రత, సరిహద్దుల సంరక్షణ, అక్రమ చొరబాట్ల నివారణ ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యతలే. దేశ రికార్డులను పటిష్ఠంగా నిర్వహించడాన్ని ఎవరూ తప్పుపట్టరు. అయితే ఆ ప్రక్రియ పౌరుడిలో భయాందోళనలు కలిగించేలా కాకుండా, నమ్మకాన్ని పెంచేలా సాగాలి. నేడు మనం ప్రపంచానికి డిజిటల్ పురోగతిని గొప్పగా చాటుతున్నప్పటికీ, పౌరసత్వ గుర్తింపు విషయంలో మాత్రం తీవ్రమైన అయోమయంలో ఉన్నాం. ప్రభుత్వం కోట్లాది మంది ప్రజల వేలిముద్రలు, కనుపాపల వివరాలు సేకరిస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ గుర్తింపు వ్యవస్థను నడుపుతోంది. కానీ అదే సమయంలో ఆ వివరాలు పౌరసత్వానికి చట్టబద్ధమైన ధ్రువీకరణ కాదని చెప్పడం ఆశ్చర్యకరం. ఒకవైపు ప్రతి పౌరుడి సమాచారాన్ని భద్రపరుస్తున్నామని చెప్పుకుంటూ, మరోవైపు అతని భారతీయతకు స్పష్టమైన చట్టబద్ధమైన హామీ ఇవ్వలేకపోవడం పరస్పర విరుద్ధమైన వైఖరి.
కోట్లాది మంది భారతీయుల వద్ద ఉన్న ఆధార్ కార్డు కేవలం నివాస గుర్తింపేనని, అది పౌరసత్వానికి రుజువు కాదని ప్రభుత్వమే స్పష్టం చేసింది. అలాగే ఓటు హక్కును కల్పించే ఓటరు గుర్తింపు కార్డు కూడా పౌరసత్వానికి అంతిమ ఆధారం కాదని న్యాయస్థానాల వ్యాఖ్యానాలు తెలియజేశాయి. ప్రపంచ దేశాలు అంగీకరించే భారత ప్రభుత్వ ముద్ర కలిగిన పాస్‌పోర్టు కూడా ప్రయాణాలకే పరిమితమని, పౌరసత్వంపై వివాదం తలెత్తితే అది ఒక్కటే ఆధారం కాదని చట్టపరమైన వివరణలు చెబుతున్నాయి. ప్రతి సమాచారాన్నీ అనుసంధానిస్తూ పౌరుడి వివరాలన్నింటినీ భద్రపరుస్తున్న ప్రభుత్వం, ఒక వ్యక్తి భారతీయుడేనని తిరుగులేని ధ్రువీకరణ ఇచ్చే ఏకైక పత్రాన్ని రూపొందించలేకపోవడం ప్రజా విధానాల లోపానికే నిదర్శనం. ఈ అయోమయం కారణంగా సామాన్య పౌరుడు ఏ అధికారిని కలిసినా అభద్రతతో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
భారతదేశం అంటే కేవలం పట్టణాల్లో కూర్చొని పత్రాలు పరిశీలించే వారి దేశం కాదు. కోట్లాది మంది గ్రామీణ ప్రాంతాల్లో, గిరిజన తండాల్లో, చదువుకు, ఆధునిక సౌకర్యాలకు దూరంగా జీవిస్తున్నారు. తొంభైల దశకం వరకు జనన నమోదు ప్రతి చోట క్రమబద్ధంగా జరగలేదు. నిరక్షరాస్యత, వలస జీవనం, వరదలు, అగ్నిప్రమాదాలు వంటి విపత్తుల మధ్య జీవించిన నిరుపేదల వద్ద తరతరాల నాటి పత్రాలు ఎలా ఉంటాయి? అలాంటి పత్రాలు లేవనే కారణంతో వారి పౌరసత్వాన్ని ప్రశ్నించడం సామాజిక న్యాయానికి విరుద్ధం. పాత తరాల ధ్రువీకరణ పత్రాలను తప్పనిసరిగా చూపించాలనే నిబంధన పెడితే, ఈ దేశాన్ని తమ శ్రమతో నిర్మించిన రైతులు, కార్మికులు, నిరుపేదలు సొంత నేలపైనే పరాయివారిగా మారే ప్రమాదం ఉంది. కేవలం పత్రాల ఆధారంగానే పౌరసత్వాన్ని కొలవడం భారతదేశ సామాజిక వాస్తవాలను విస్మరించడమే అవుతుంది. పత్రాల కోసం నిరుపేదలు తమ జీవనోపాధిని వదిలి కార్యాలయాల చుట్టూ తిరగాల్సి రావడం మానవీయ సంక్షోభానికి దారి తీస్తుంది.
పౌరసత్వం అనేది పాలకులు ప్రజలకు ఇచ్చే రాయితీ కాదు. అది పౌరుడికీ, గణతంత్రానికీ మధ్య ఉన్న పరస్పర విశ్వాసానికి ప్రతీక. పౌరుడు చట్టాలను గౌరవిస్తూ, పన్నులు చెల్లిస్తూ తన బాధ్యతను నిర్వర్తించినప్పుడు, అతనికి సంపూర్ణ రక్షణ, గౌరవం, స్పష్టమైన గుర్తింపును కల్పించడం ప్రభుత్వ రాజ్యాంగబద్ధమైన బాధ్యత. సొంత దేశంలోనే ఒక పౌరుడు తన భారతీయతను నిరూపించుకోవడానికి అల్లాడాల్సి రావడం ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మేలు చేయదు. దేశం బలంగా ఉండటం అంటే సరిహద్దుల వద్ద కాపలా పెంచడం మాత్రమే కాదు; ప్రతి పౌరుడి హృదయంలో భద్రతా భావాన్ని నింపడం. రాజ్యాంగం కల్పించిన రక్షణ ప్రతి ఒక్కరికీ సమానంగా అందాలి. చట్టాలు పౌరుడికి రక్షణ కవచాలుగా నిలవాలి తప్ప, వారిని అనుమానించే సాధనాలుగా మారకూడదు.
ఇకనైనా పాలకులు పత్రాల చుట్టూ నెలకొన్న అయోమయానికి ముగింపు పలికి, ప్రతి నిజమైన భారతీయుడికి స్పష్టమైన, సరళమైన, తిరుగులేని పౌరసత్వ గుర్తింపును అందించే విధానాన్ని రూపొందించాలి. ఏ ఒక్క నిరుపేద పౌరుడు కూడా ఒక పత్రం లేకపోయిందనే కారణంతో తన సొంత దేశంలో పరాయివాడిగా మారకూడదు. పౌరుడి ఉనికిని, దేశభక్తిని నిరంతరం అనుమానించే ధోరణికి ముగింపు పలికి, అతని అస్తిత్వానికి సంపూర్ణ భరోసా కల్పించినప్పుడే ఈ దేశ సార్వభౌమత్వానికి, ప్రజాస్వామ్యానికి నిజమైన సార్థకత లభిస్తుంది. ప్రతి పౌరుడు తాను సురక్షితుడినని, ఈ దేశం తనను ఆదరిస్తుందనే విశ్వాసంతో జీవించినప్పుడే దేశం మరింత బలపడుతుంది. పాలకుల ఆలోచనా విధానంలో మార్పు వచ్చి, పౌరుల పట్ల నమ్మకాన్ని పునరుద్ధరించినప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థలకు తగిన గౌరవం దక్కుతుంది.