ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.8,591 కోట్లు

 – శాసనమండలిలో మంత్రి అడ్లూరి

 హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 10 : రాష్ట్రంలో విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు, ఆశ్రమ పాఠశాలల్లోని పోస్టుల అప్‌గ్రేడేషన్‌పై ఎస్సీ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ శాసనమండలిలో గురువారం కీలక ప్రకటన చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు ఎమ్మెల్సీలు లేవనెత్తిన ప్రశ్నలకు ఆయన వివరంగా సమాధానమిచ్చారు. ఎమ్మెల్సీలు తీన్మార్ మల్లన్న, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, సత్యం నెలికంటి అడిగిన ప్రశ్నలకు మంత్రి బదులిస్తూ.. 2025–26 విద్యా సంవత్సరం వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ, దివ్యాంగ విద్యార్థులకు సంబంధించి ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.8,591.62 కోట్లుగా ఉన్నట్లు సభకు వెల్లడించారు. ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న పండిట్లు, వ్యాయామ ఉపాధ్యాయుల (పీఈటీ) పోస్టులను స్కూల్ అసిస్టెంట్లుగా అప్‌గ్రేడ్ చేసే అంశంపై ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ ప్రతిపాదన ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉందని, సాధ్యమైనంత త్వరగా దీనిపై తగిన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. విద్యార్థుల సంక్షేమంతో పాటు సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు.

సర్టిఫికెట్ల నిలిపివేత ఆరోపణలు అవాస్తవం

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు రాకపోవడంతో ప్రైవేటు కళాశాలలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఫీజులు వసూలు చేస్తున్నాయన్న సభ్యుల ఆరోపణలను మంత్రి తోసిపుచ్చారు. రాష్ట్రంలో అటువంటి పరిస్థితి లేదని స్పష్టం చేశారు. అక్రమ వసూళ్లు లేనందున, ప్రైవేటు కళాశాలలపై చర్యలు తీసుకునే ప్రశ్న ఉత్పన్నం కాదన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *