– వ్యవసాయ విద్య ప్రక్షాళనకు చర్యలు
– శాసనసభలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 10 : రాష్ట్రంలో తగ్గుతున్న కూరగాయల సాగును పెంచడం, వ్యవసాయ విద్యలో నాణ్యతా ప్రమాణాలు పెంచడం లక్ష్యంగా ప్రభుత్వం సమగ్ర వ్యవసాయాభివృద్ధికి కృషి చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శాసనసభలో వెల్లడించారు. ఈ మేరకు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఇతర రాష్ట్రాలపై ఆధారపడటం తగ్గించి ఎగుమతి చేసే స్థాయికి ఎదిగేలా ఈ వానాకాలంలో లక్ష ఎకరాలు, రబీలో మరో లక్ష ఎకరాల్లో కూరగాయల సాగుకు ప్రణాళిక. ఇందుకోసం బిందు సేద్యం (రూ.97 కోట్లు), నారు, మల్చింగ్ (రూ.20 కోట్లు), పందిళ్ల (రూ.8 కోట్లు) కోసం మొత్తం రూ.125 కోట్లకు పైగా రాయితీలు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రమాణాలు పాటించని ఆరు ప్రైవేట్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలల గుర్తింపును రద్దు చేశామన్నారు. డిమాండ్ లేని కోర్సులను పునర్వ్యవస్థీకరించి నాలుగు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాలుగా మారుస్తున్నామన్నారు. హుజూర్‌నగర్, డిచ్‌పల్లి, వికారాబాద్‌లలో కొత్త వ్యవసాయ కళాశాలలకు అనుమతులు మంజూరు చేశామని, దీంతో వ్యవసాయ విద్యలో సీట్ల సామర్థ్యం 1,100 నుంచి 2,000కు పెరిగిందని మంత్రి తెలిపారు.
కోహెడలో అంతర్జాతీయ మార్కెట్
హైదరాబాద్ విమానాశ్రయానికి సమీపంలో 170 ఎకరాల్లో కోహెడ మార్కెట్‌ను భారీ స్థాయిలో అభివృద్ధి చేయనున్నారు. కోల్డ్ స్టోరేజ్, ప్రాసెసింగ్, ఎగుమతుల సదుపాయాలకు కేంద్ర నిధులతో కలిపి 60:40 నిష్పత్తిలో మౌలిక వసతులు కల్పిస్తున్నారు.
ఆయిల్ పామ్, అంతర పంటలు
ఆయిల్ పామ్ సాగును అన్ని జిల్లాలకు విస్తరించడంతో పాటు అందులో కూరగాయలు, అల్లం, కంది వంటి అంతర పంటల సాగుకు ప్రోత్సాహం అందిస్తున్నారు.
టాప్ ర్యాంక్ దిశగా వ్యవసాయ వర్సిటీ
మారుతున్న వాతావరణ పరిస్థితులు, డిజిటల్ అగ్రికల్చర్, కొత్త సాంకేతికతను జోడిస్తూ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని దేశంలో మొదటి ర్యాంకుకు (ప్రస్తుతం 19వ ర్యాంకు) తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





