– 22-ఎ నిషేధిత భూముల బాధితుల గోడు
-తెలంగాణ భవన్‌కు పోటెత్తిన బాధితులు
– అండగా ఉంటామని హరీష్‌రావు భరోసా
– న్యాయ సహాయం కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 19 : కాంగ్రెస్ ప్రభుత్వం 22-ఎ నిషేధిత భూములు, యూఎల్‌సీల పేరుతో ప్రైవేట్ ఆస్తులపై అడ్డగోలుగా విధించిన నిషేధాల వల్ల తీవ్రంగా నష్టపోయిన బాధితులు తెలంగాణ భవన్‌కు పోటెత్తారు. బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్‌రావు, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇతర సీనియర్ నాయకులు కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి బాధితుల సమస్యలను ఓపికగా విని వారికి తమ పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. రిజిస్ట్రేషన్ స్లాట్ బుక్ చేసుకుని స్టాంప్ డ్యూటీ చార్జీలు చెల్లించిన తర్వాత తీరా రిజిస్ట్రేషన్ రోజున మీ ఆస్తి 22-ఎ జాబితాలో ఉందని అధికారులు చెప్పారని మోహన్ రెడ్డి (బాధితుడు) తెలిపారు. ఇలా చేస్తే తాము ఎక్కడికి వెళ్లాలి.. ప్రభుత్వమే మమ్మల్ని అనాథలను చేస్తే మా ఆవేదన ఎవరు వింటారు అని వాపోయాడు. తాను 2017లో బ్యాంకు లోన్ తీసుకుని కాలనీ మధ్యలో ఇల్లు కొనుక్కున్నాను. ఇటీవల ఉద్యోగం పోవడంతో ఇల్లు అమ్ముకుని వ్యాపారం చేసుకుందామని జూలై 1న రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కు వెళ్తే తమ ఆస్తి 22-ఎలో ఉందని చెప్పారు. ఎమ్మార్వో ఆఫీసులో దరఖాస్తు పెట్టుకుని రెండు నెలలైనా దిక్కులేదు. ఇల్లు కొనే వ్యక్తి దగ్గర నుంచి డబ్బులు తీసుకుని అగ్రిమెంట్ చేశాను.. ఆయన లోన్ ఈఎంఐ కూడా కడుతున్నాడు.. కానీ రిజిస్ట్రేషన్ కావడం లేదు. కాలనీ మధ్యలో ఉన్న ఇల్లు ఉన్నట్టుండి 22-ఎలోకి ఎలా పోతుంది.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం సమాధానం చెబుతారు అని రాజేష్ (బాధితుడు) ప్రశ్నించాడు. 1995లోనే లేఅవుట్ అనుమతులు పొంది వందలాది ఇళ్లు నిర్మించుకున్నాం. కానీ సర్వే నం.330ని ఒక్కసారిగా 22-ఎలో పెట్టారు. జూలైలోనే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం ఇచ్చినా దాన్ని చెత్తబుట్టలో వేశారు. ప్లాట్లు కొనుక్కున్న మధ్యతరగతి ప్రజలు ఇవాళ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం కమీషన్ల కోసం, 50-50 సెటిల్మెంట్ల కోసం లేదా 30% కమీషన్ డిమాండ్ల కోసమే ఈ లేఅవుట్లను అడ్డం పెట్టుకుని ప్రజలను ఆగం చేస్తోంది అని దేవేందర్ రావు (హెచఎమ్‌టీ హౌసింగ్ కాలనీ సొసైటీ సెక్రటరీ) ఆరోపించారు. మా కాలనీలో 1500 ఇళ్లు ఉన్నాయి. గతంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా రిజిస్ట్రేషన్లు జరిగిన భూములను ఇప్పుడు యూఎల్‌సీ పేరుతో ఆపేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసి విన్నవించినా ఎలాంటి పరిష్కారం చూపలేదు అని బి.ఎన్.నగర్, ఉప్పల్ బాధితులు వాపోయారు. పదేళ్ల క్రితం క్లియర్ డాక్యుమెంట్లతో బ్యాంకు లోన్ ద్వారా ప్రాపర్టీ కొన్నాను. అవసరం ఉండి అమ్ముకుందామని స్టాంప్ డ్యూటీ కట్టిన తర్వాత ప్రొహిబిషన్ లిస్టులో ఉందన్నారు. రెండు సర్వే నంబర్ల సాకుతో కాలనీ మొత్తం 22-ఎలో పెడితే సామాన్య కుటుంబాల పరిస్థితి ఏంటి? 22-ఎ అని ముద్ర వేస్తే మా భూమిని ఎవరు కొంటారు శ్రీనివాస్ (అమీన్‌పూర్ బాధితుడు) ప్రశ్నించాడు.
బాధితుల ఆవేదనను విన్న మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తుగ్లక్ నిర్ణయాల వల్ల, కమీషన్ల దాహం వల్ల లక్షలాదిమంది సామాన్యుల జీవితాలు రోడ్డునపడ్డాయని మండిపడ్డారు. బాధితుల తరఫున బీఆరఎస్ పార్టీ అసెంబ్లీ లోపల, బయట పోరాడుతుందని, 22-ఎ పేరుతో జరుగుతున్న దందాను అరికట్టి బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని స్పష్టం చేశారు. 22-ఎ బాధితుల రక్షణకు తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ లీగల్ సెల్ ఏర్పాటు చేస్తామని, పదిమంది న్యాయవాదులతో ఉచిత న్యాయ సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అడ్వకేట్ కల్యాణ్ (ఫోన్: 812535604)ని సంప్రదిస్తే తమ లీగల్ సెల్ ఉచితంగా న్యాయ సేవలు అందిస్తుందని తెలిపారన్నారు. 30% కమీషన్లు, 50-50 సెటిల్మెంట్ల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేట్ భూములను 22-ఎలో పెట్టిందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి, పొంగులేటిలకు రియల్ ఎస్టేట్ వ్యాపారం తెలిస్తే బీఆరఎస్ నాయకులకు ప్రజల తరఫున పోరాటాలు తెలుసన్నారు. యాదాద్రిలో 40 వేల ఎకరాలు 22-ఎలో పెట్టారని మంత్రి కోమటిరెడ్డి చెప్పినా సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు సైలెంట్‌గా ఉన్నారని ప్రశ్నించారు. లక్షలాదిమంది జీవితాలను రోడ్డున పడేసిన మంత్రి పొంగులేటిని తక్షణమే కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. 22-ఎ భూముల వల్ల తీవ్రంగా నష్టపోయిన బాధితులతో హరీశ్ రావు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. లీగల్ సెల్ సపోర్ట్‌తో పాటు ఎమ్మెల్యేలుగా తాము కూడా అధికారులతో, కలెక్టర్లతో మాట్లాడి సమస్యలు పరిష్కారమయ్యే వరకు మీ వెంటే ఉంటాం.. ఎవ్వరూ భయపడి 20%, 30% కమీషన్లు ఇవ్వవద్దు.. తక్కువ ధరలకు ఆస్తులు అమ్ముకోవద్దు.. ఎంతటి పోరాటానికైనా సిద్ధపడి ప్రభుత్వం మెడలు వంచి మీ ఆస్తులను రక్షించే బాధ్యత బీఆరఎస్ తీసుకుంటుంది.. ‘హూడా’, హెచ్‌ఎండీఏ అప్రూవ్‌డ్ లేఅవుట్లలో 30 ఏళ్ల క్రితం కొనుక్కున్న ఇళ్లను కూడా ఇప్పుడు 22-ఎలో పెట్టారంటే దీని వెనుక ఎంత పెద్ద కమీషన్ల దందా నడుస్తోందో అర్థమవుతోందన్నారు. బుద్వేల్ గ్రామం సర్వే నం.282, 283, 284లలోని 30 ఎకరాల భూమి కోసం సర్వే సెటిల్మెంట్ డైరెక్టర్‌పై ఒత్తిడి తెచ్చి రాత్రికి రాత్రే 22-ఎ నుంచి క్లియర్ చేసి కోట్లాది రూపాయల దందా చేశారన్నారు. శేరిలింగంపల్లి సర్వే నం.20/1, 21లో ఎస్‌ఏఎస్ ఇన్‌ఫ్రా ప్రాపర్టీకి 30% కమీషన్ తీసుకుని 22దిఎ నుంచి క్లియర్ చేసి రిజిస్ట్రేషన్లు చేయించారని, బిల్డర్ పని అయిపోయాక మళ్లీ పది రోజుల క్రితం దాన్ని 22-ఎ లోకి మార్చారని ఆ నాయకులు ఆరోపించారు. సంగారెడ్డి సమీపంలో శిల్పా మోహన్ రెడ్డి భూమిని 22-ఎ నుంచి తీసి రిజిస్ట్రేషన్లు చేశాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలిసి మళ్లీ 22-ఎలో పెట్టించారన్నారు. వీరి ఇష్టారాజ్యంతో సామాన్యుల జీవితాలు ఏమవ్వాలి అని ప్రశ్నించారు. అమీన్‌పూర్ కేఎసఆర్ కాలనీలో సుప్రీంకోర్టు తీర్పు ఉన్నప్పటికీ 500 ఇళ్లను 22-ఎలో పెట్టి కాలనీ వాసులను ఇబ్బంది పెడుతున్నారన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. పొంగులేటి పది రోజుల క్రితమేమో ఎకరం కూడా 22-ఎలో పెట్టలేదు అన్నారు.. నిన్నేమో అధికారులు పొరపాటు చేశారు సారీ అంటున్నారు.. చిన్నచిన్న విషయాలకే సీఐడీ, విజిలెన్స్ విచారణలు వేసే రేవంత్ రెడ్డి లక్షలాదిమంది జీవితాలతో ఆడుకున్న ఈ 22-ఎ కుంభకోణంపై సీఐడీ ఎంక్వైరీ ఎందుకు వేయడం లేదని నిలదీశారు. రేవంత్ రెడ్డికి ఈ దందాతో సంబంధం లేకపోతే తక్షణమే మంత్రి పొంగులేటి ని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. తాండూరులో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఎకరాల్లో కొని గజాల చొప్పున బకరాలకు అమ్ముతున్నారని అని రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరే ప్రభుత్వ అసలు రంగును బయటపెట్టిందన్నారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ప్రజలకు నిద్ర లేని రాత్రులు మిగిల్చిన ఈ ప్రభుత్వం ఒక తుగ్లక్ ప్రభుత్వంలా మారిపోయిందన్నారు. ప్రభుత్వం చేసిన తప్పును ప్రభుత్వమే సుమోటోగా స్వీకరించి ఆన్‌లైన్ నుంచి 22-ఎ ఆంక్షలను వెంటనే తొలగించాలని అన్నారు. అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికే భూభారతి వెబ్‌సైట్‌ను డౌన్ చేసి, హైదరాబాద్ జిల్లా వివరాలు కనిపించకుండా మాయం చేశారన్నారు. 2008లోనే డాక్టర్ రాజశేఖర్ రెడ్డి హయాంలో సీలింగ్ రద్దయి హెచఎండీఏ, జీహెచఎంసీ పర్మిషన్లతో కట్టుకున్న ఇళ్లను కూడా ఇప్పుడు సీలింగ్ భూములని చెప్పడం దుర్మార్గమని అన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే బాధితులతో కలిసి పెద్ద ఎత్తున సీఎం ఇల్లు ముట్టడికి సిద్ధమవుతాం అని హెచ్చరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




