– భూసేకరణ, ఆ ర్ అండఆర్ చెల్లింపుల్లో కలెక్టర్లు మిషన్ మోడ్‌లో పనిచేయాలి
– తక్షణమే పంపిణీకి సిద్ధంగా దాదాపు రూ.1,200 కోట్లు
– నిధుల కోసం చూడొద్దు.. అవార్డులు, టోకెన్ల ప్రక్రియ పూర్తి చేయాలి
– అటవీ అడ్డంకులనూ యుద్ధప్రాతిపదికన తొలగించాలి
– నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 21 : భూమిని కోల్పోయిన రైతుకు ప్రభుత్వం విడుదల చేసిన పరిహారం సకాలంలో అందకపోతే నిధులు మంజూరు చేసిన లక్ష్యమే నెరవేరదని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం విడుదల చేసిన ప్రతీ రూపాయి అంతిమంగా భూమి కోల్పోయిన రైతు, నిర్వాసిత కుటుంబం ఖాతాలోకి చేరాల్సిందేనని, కలెక్టర్ల పీడీ ఖాతాల్లో నిధులు ఉండిపోవడం వల్ల ప్రయోజనం లేదని తేల్చిచెప్పారు. కీలక నీటిపారుదల ప్రాజెక్టుల పురోగతికి అడ్డంకిగా మారిన భూసేకరణ, పునరావాసం-పునర్నిర్మాణం(ఆర్ అండ్ ఆర్), అటవీ అనుమతులు తదితర సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరించేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్లు, చీఫ్ ఇంజనీర్లు, ఉన్నతాధికారులతో శుక్రవారం అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అవసరమైన పత్రాలు, లబ్దిదారుల వివరాలు పూర్తిగా ఉన్నచోట ఒకటి రెండు రోజుల్లోనే పరిహారం రైతులు, నిర్వాసితుల ఖాతాల్లో జమ కావాలని ఆదేశించారు. నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో భూసేకరణ, ఆర్ అండ్ ఆర్, అటవీ భూములకు సంబంధించిన చెల్లింపులు తదితర సమస్యలు అడ్డంకిగా ఉండకూడదన్నది ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్పష్టమైన సంకల్పమని మంత్రి పేర్కొన్నారు. ఈ సమస్యల పరిష్కారానికే ముఖ్యమంత్రి రూ.5 వేల కోట్లను కేటాయించారని తెలిపారు. ఇంత పెద్ద మొత్తాన్ని ప్రభుత్వం సమకూర్చినప్పుడు ఆ నిధులు బాధితులకు చేరేలా అధికారులు బాధ్యత తీసుకోవాలన్నారు. ‘నిధులను కలెక్టర్ల పీడీ ఖాతాల్లో జమ చేయడంతో ప్రభుత్వ బాధ్యత పూర్తయినట్లు కాదు.. ఆ డబ్బు భూమి ఇచ్చిన రైతుకు, నిర్వాసిత కుటుంబానికి చేరినప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది.. మంజూరు నుంచి లబ్దిదారుడి ఖాతాలో జమయ్యే వరకు ఉన్న ప్రతి అనవసర పరిపాలనా అడ్డంకినీ తొలగించాలి’ అని ఉత్తమ్ కుమార్ స్పష్టం చేశారు. భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ తదితర అవసరాల కోసం ప్రభుత్వం ఇప్పటివరకు రూ.2,782 కోట్లు విడుదల చేయగా సుమారు రూ.566 కోట్లు లబ్దిదారులకు చేరాయని సమీక్షలో వెల్లడైంది. మరో రూ.989 కోట్లు వివిధ దశల్లో చెల్లింపుల ప్రక్రియలో ఉండగా రూ.199 కోట్లు జిల్లాల వద్ద అందుబాటులో ఉన్నప్పటికీ పంపిణీ ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉందని అధికారులు వివరించారు. ఈ ప్రకారం దాదాపు రూ.1,200 కోట్లను తక్షణమే లేదా స్వల్ప పరిపాలనా ప్రక్రియ పూర్తి చేసి లబ్దిదారులకు అందించే అవకాశం ఉందని, ఈ మొత్తాన్ని రైతులు, నిర్వాసితుల ఖాతాల్లోకి చేర్చడాన్ని అత్యవసర కార్యక్రమంగా చేపట్టాలని కలెక్టర్లు, నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. అదనంగా సుమారు రూ.455 కోట్లకు సంబంధించిన టోకెన్లు క్లియర్ అయి తదుపరి ప్రక్రియలో ఉన్నాయని వెల్లడైంది. విడుదలైన నిధులకు, రైతులకు జరిగిన వాస్తవ చెల్లింపులకు మధ్య ఉన్న అంతరాన్ని రోజూ పర్యవేక్షించాలని కలెక్టర్లను ఆదేశించారు. అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించి, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి చెల్లింపుల ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. కలెక్టర్ల పీడీ ఖాతాల్లోకి డబ్బులు వచ్చిన తరువాతే భూసేకరణ ప్రక్రియ మొదలుపెట్టాలనే పద్ధతికి స్వస్తి పలకాలని మంత్రి స్పష్టం చేశారు. భూసేకరణ ప్రక్రియ, కన్సెంట్ అవార్డులు, అవార్డు నంబర్లు, టోకెన్ల జనరేషన్ వంటి ప్రక్రియలన్నింటినీ ముందుగానే పూర్తి చేయాలని ఆదేశించారు. అవార్డు నంబర్లు, టోకెన్ వివరాలు సిద్ధమైన వెంటనే అవసరమైన నిధుల విడుదల కోసం నీటిపారుదల శాఖ ఆర్థిక శాఖతో సమన్వయం చేస్తుందని తెలిపారు.
వారం రోజుల సమయం కుదరదు
జగిత్యాల జిల్లాలో భూసేకరణ కోసం ఇప్పటికే జమ చేసిన నిధులను ఒకటి రెండు రోజుల్లోనే పంపిణీ చేయాలని మంత్రి ఆదేశించారు. ఇందుకు వారం రోజుల సమయం కావాలన్న అధికారుల అభ్యర్థనను ఆయన అంగీకరించలేదు. నిధులు అందుబాటులో ఉండి లబ్దిదారుల వివరాలు సిద్ధంగా ఉన్నప్పుడు పరిహారం చెల్లింపును వారం రోజులపాటు నిలిపివేయడానికి కారణం ఉండదని స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లాలో మల్లన్నసాగర్ ఫీడర్ కెనాల్తోపాటు ఇతర పనులకు అవసరమైన సుమారు 180 ఎకరాల భూసేకరణకు సంబంధించిన కన్సెంట్ అవార్డులను మొత్తం ఆర్థిక ప్రక్రియ పూర్తయ్యే వరకు వేచి చూడకుండా ముందుకు తీసుకెళ్లాలని ఆదేశించారు.
మున్నేరు-పాలేరు లింక్ కెనాల్‌పై ప్రత్యేక సమీక్ష
మహబూబాబాద్ జిల్లాలోని మున్నేరు-పాలేరు లింక్ కెనాల్ భూసేకరణ అంశాన్ని కూడా మంత్రి ప్రత్యేకంగా సమీక్షించారు. రైతులతో జరిగిన చర్చలకు అనుగుణంగా కన్సెంట్ అవార్డులు, సవరించిన పరిహార అంచనాలను వేగంగా పూర్తి చేయాలని, భూసేకరణ సమస్యల కారణంగా ప్రాజెక్టు పనులు ఆలస్యం కాకూడదని స్పష్టం చేశారు. అటవీ అనుమతులకు సంబంధించిన అడ్డంకులపైనా మంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. శాఖల మధ్య సమన్వయ లోపం లేదా అవసరమైన సమాచారం అందించడంలో జాప్యం కారణంగా పనులు నిలిచిపోవడానికి వీల్లేదన్నారు. జిల్లా కలెక్టర్లు రెవెన్యూ, నీటిపారుదల, అటవీ శాఖల అధికారులతో సంయుక్త సమావేశాలు నిర్వహించి పెండింగ్ అంశాలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌తోపాటు ఇతర నీటిపారుదల పథకాలకు సంబంధించిన అటవీ సమస్యలను సమావేశంలో ప్రత్యేకంగా సమీక్షించారు. భూసేకరణ, ఆ సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ‘ప్రాజెక్టులకు భూములిచ్చిన రైతు పరిహారం కోసం కార్యాలయాల చుట్టూ తిరగకూడదు.. ప్రభుత్వం వద్ద నిధులున్నప్పుడు పరిపాలనా జాప్యం కారణంగా బాధితుడు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉండొద్దు.. ప్రాజెక్టు ముందుకు సాగాలి.. రైతుకు న్యాయం జరగాలి -రెండూ ఒకేసారి సాధించాలి’ అని ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. కాన్ఫరెన్స్‌లో నీటిపారుదల శాఖ కార్యదర్శి ఈ.శ్రీధర్, ఇంజనీర్-ఇన్-చీఫ్(జనరల్) ఓ.వి.రమేష్ బాబు, జాయింట్ సెక్రటరీ కె.శ్రీనివాస్, ఈఎన్సీ(అడ్మినిస్ట్రేషన్) టి.శ్రీనివాస్, ఈఎన్సీ(ఓఅండ్ఎం అండ్ క్వాలిటీ కంట్రోల్) ఆర్.మధుసూదన్ రావు తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





