– షావుకారు సినిమాతో ఆ పేరు స్థిరపడిపోయింది
చెన్నై, ఆగస్టు 21 : ప్రముఖ సీనియర్ నటి షావుకారు జానకి(94) శుక్రవారం చెన్నైలో కన్నుమూశారు. వయోభారంతోపాటు శ్వాసకోశ సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమెను కుటుంబ సభ్యులు ఇటీవల చెన్నైలోని కావేరి హాస్పిటల్‌లో చేర్పించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో తుది శ్వాస విడిచారు. షావుకారు జానకి మరణంపై నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఆమె మరణ వార్తతో తెలుగు, తమిళ, కన్నడ సినీ పరిశ్రమల్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. షావుకారు జానకి భౌతికకాయాన్ని శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి తేనామ్‌పేట్‌లోని సెనోటాఫ్ రోడ్‌లో అభిమానులు, స్నేహితులు, చిత్ర పరిశ్రమకు చెందిన వారు నివాళులర్పించేందుకు ఉంచుతామని తెలిపారు. టేకుమళ్ల జానకి 1931 డిసెంబర్ 12న తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో జన్మించారు. విజయ వారి ’షావుకారు’ సినిమాతో 1950లో జానకి సినీ రంగ ప్రవేశం చేశారు. మొదటి సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్నారు. అలా ’షాపుకారు’ జానకిగా పాపులర్ అయ్యారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో దాదాపు 380 చిత్రాలలో నటించారు. ఆమె చివరగా 2023లో వచ్చిన ’అన్నీ మంచి శకునములే’లో కనిపించారు. నాలుగు తరాల ప్రేక్షకులను తన అద్భుతమైన అభినయంతో మంత్రముగ్ధులను చేశారు. కేవలం నాయికగానే కాక క్యారెక్టర్ ఆర్టిస్టుగా, ప్రతినాయక ఛాయలున్న పాత్రల్లోనూ వైవిధ్యం చాటుకుని తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. కళారంగానికి ఆమె అందించిన అమూల్యమైన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2022లో దేశ అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన పద్మశ్రీ అవార్డుతో ఆమెను ఘనంగా సత్కరించింది. ఆమె మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ నివాళులర్పిస్తున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విచారం
షావుకారు జానకి మృతిపట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. చిన్నతనం నుంచే నాటకాల్లో వివిధ పాత్రలు పోషిస్తూ కెరీర్‌ను ప్రారంభించిన షావుకారు జానకి దాదాపు ఏడు దశాబ్దాలపాటు చలనచిత్ర రంగంలో తనదైన ముద్ర వేశారని అన్నారు. ‘షావుకారు’ సినిమాలో అసమాన ప్రతిభ కనబరిచి షావుకారు జానకిగా స్థిరపడ్డారని గుర్తుచేస్తూ తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో దాదాపు 400 చిత్రాల్లోనే కాక హిందీ, మలయాళ చిత్రాల్లో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించారన్నారు. పలు మేటి చిత్రాల్లో ఆమె పోషించిన పాత్రలు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలుస్తాయని కొనియాడారు. చలనచిత్ర రంగంలో ఆమె లేని లోటు పూడ్చలేనిదన్నారు. భగవంతుడు ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తూ అమె కుటుంబ సభ్యులకు, అభిమానులకు ముఖ్యమంత్రి సంతాపాన్ని, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





