రేవంత్‌, సురేఖ మ‌ధ్య ముదురుతున్న వివాదం

– ఇక అమీతుమీ తేల్చుకునే దిశ‌గా అడుగులు
– దిల్లీ కేంద్రంగా సీఎంపై సంచలన వ్యాఖ్యలు
– ‘కొండా’ వివాదాస్ప‌ద‌ వ్యాఖ్యలపై హైకమాండ్ సీరియస్
– బీసీ మ‌హిళ కావ‌డంతో వెనుక‌డుగు వేస్తున్న అధిష్టానం

(మండువ రవీందర్‌రావు, ప్ర‌జాతంత్ర‌ ప్ర‌త్యేక ప్ర‌తినిధి, వ‌రంగ‌ల్‌)

తెలంగాణ కాంగ్రెస్‌లో రాజకీయాలు మరింత ముదురుతున్నట్లు కనిపిస్తున్నది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి కొండా సురేఖల మధ్య‌ నెలకొన్న వివాదం మరింత తీవ్రరూపం దాలుస్తున్నది. రాష్ట్ర ఎల్లలు దాటి దేశరాజధానికి చేరిన వీరి వివాదాన్ని సామరస్య పూర్వకంగా పరిష్కరించేందుకు ఒకపక్క అధిష్టానం కృషిచేస్తుంటే సురేఖ బుధవారం ఢిల్లీ మీడియా ముందు ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలు మరింత ఆజ్యంపోసినట్లైంది. వీరి వివాదంపై కాంగ్రెస్ పెద్దలకు వివరణ ఇచ్చిన అనంతరం కొండా సురేఖ సిఎం రేవంత్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని మాట్లాడిన తీరు పార్టీలో మరింత అయోమయాన్ని సృష్టించింది. అధిష్టానం తనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికన్నా ముందు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ ఆరోపించారు. ఏ అధికారంతో పదేళ్ళపాటు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని రేవంత్‌రెడ్డి ప్రకటించారని ఆమె ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు ఇటీవల కాలంలో పరకాల నియోజకవర్గంలో పర్యటించినప్పుడు అక్కడ ఉన్న ఎమ్మెల్యేనే తర్వాత కూడా అభ్యర్థిగా ఉంటారని ప్రకటించడాన్నికూడా ప్రశ్నిస్తున్నారు. అధిష్టానం అభ్యర్ధులను ప్రకటించే కాంగ్రెస్ సంప్రదాయానికి ఆయన భిన్నంగా ప్రవర్తించినందుకు ముందుగా ఆయనపైన చర్యలు ఎందుకు తీసుకోరని అధిష్టానాన్ని నిలదీయటం పార్టీలో అమీతుమీ తేల్చుకోవడానికైనా సిద్దపడ్డారన్నది స్పష్టమవుతున్నది. ఆ  స్థానంపై ఎంతోకాలంగా ఆశపెట్టుకున్న తన కూతురు సుష్మితపటేల్‌కు ఆ విషయంలో అసహనానికి గురై చేసిన కామెంట్‌కు తనకు సంబంధమేంటని అడుగుతున్నారు. ఈ వివాదంలో తన పాత్ర ఎక్కడున్నదని నిలదీస్తున్నారు. ఇదే విషయాన్ని తాను పార్టీ అధినేతలు రాహుల్‌గాందీ, ప్రియాంకా గాంధీ, జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోపాటు కేసీ వేణుగోపాల్‌కు లిఖిత పూర్వకంగా ఇచ్చినట్లు ఆమె మీడియాతో చెప్పారు.  పార్టీలో కొనసాగుతున్న ఈ వివాదానికి బుధవారంతో ఫుల్‌స్టాప్ పడుతుందనుకున్న వారికి ఏఐసీసీ కార్యాలయం సాక్షిగా ముఖ్యమంత్రిపై ఆమె చేసిన కామెంట్ మరింత ఆజ్యం పోసింది. ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేల‌కు సురేఖకు మధ్య‌ కొంతకాలంగా పొసగటంలేదన్న విషయం తెలిసిందే. దానికితోడు సురేఖ కూతురు సుష్మిత సాక్షాత్తు ముఖ్యమంత్రిపైనే అవినీతి ఆరోపణలు చేయడం స‌మ‌స్య‌ను జ‌ఠిలం చేసింది. దాన్ని సురేఖ ఖండించకపోవడమే ఇప్పుడు ఆమె మీద చర్యకు పార్టీ ఉపక్రమించడానికి కారణమైంది. అది చిలికిచిలికి పెద్ద తుఫానుగా మారింది. సుమారు 17 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు చివరకు క్రమశిక్షణా కమిటి సిఫారసు కూడా ఆమెకు వ్యతిరేకంగా ఉండడంతో మంత్రి పదవి ఊడటం ఖాయమన్న ప్రచారం విస్తృతంగా జరిగింది. కానీ దిల్లీలో బుధవారం జరిగిన పరిణామాలు విచిత్ర మలుపు తిరిగాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పార్టీ రాష్ట్ర పరిశీలకురాలు మీనాక్షి నటరాజన్‌ లు అధ్యక్షుడు మల్లకార్జున ఖర్గే, జాతీయ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌ను కలిసి సురేఖపై తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. అయితే రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ మనుగడ, కార్యకర్తలు, ప్రజలనుండి వచ్చే వ్యతిరేకత ప్రధానంగా బీసీ వర్గాల్లో ఏర్పడే అసంతృప్తిని దృష్టిలో పెట్టుకుని హై కమాండ్ ఈ వివాదాన్ని సామరస్య ధోరణిలో పరిష్కరించేందుకు ప్రయత్నించే అవకాశాలున్నాయనుకుంటున్న తరుణంలో సురేఖ ముఖ్యమంత్రిని టార్గెట్ చేయడంతో అధిష్టానం తన నిర్ణయాన్ని మార్చుకోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో ఆమె ప్రయోగించిన  బీసీ కార్డు ఆమెపై చర్య తీసుకునే విషయంలో అధిష్టానం కొంత వెనక్కు తగ్గేదిగా కనిపిస్తున్నది. మరో విషయమేమంటే కేబినెట్‌లోని ఇతర మంత్రులపైన అనేక ఆరోపణలున్నా కేవలం బీసీ వర్గానికి చెందిన మహిళా మంత్రిగా ఉన్న తననే ఎందుకు టార్గెట్ చేస్తున్నారన్న ఆమె ప్రశ్నకూడా ఆలోచింపజేసేదిగా ఉంది. ముఖ్యమంత్రితోపాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతర మంత్రుల‌పైన‌ చర్యలు తీసుకున్నాకే తన జోలికి రావాలన్న విషయాన్ని ఏఐసీసీ కార్యాలయంలో మీడియా ముందు స్పష్టం చేయడంతో ఇపుడు కాంగ్రెస్ పెద్దలను ఆలోచనలో పడేసింది. ఈ విషయంలో ఆమే మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్లను ఎత్తిచూపడం మరింత ఇబ్బందికరంగా మారింది. ప్రధానంగా తనకు వ్యతిరేకంగా జట్టుకట్టిన ఎమ్మెల్యేల‌ వెనుక  ఉన్న అదృశ్య హస్తాన్ని గుర్తించి వారికి ముందుగా షోకాజ్ నోటీసు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న సురేఖ ఆ వ్యక్తి ఎవరన్నది వెల్లడించడానికి నిరాకరించారు.

ముందు రేవంత్ పై చర్యలు తీసుకోండి
– మంత్రి సురేఖ సంచలన వ్యాఖ్యలు

దిల్లీ, సెప్టెంబర్ 2: నాపై చర్యలు తీసుకునే ముందు సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. దిల్లీలో హైకమాండ్ను కలిసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి పదేళ్లు సీఎం అని తనే చెప్పుకుంటున్నాడు.. అది ఎంతవరకు సమంజసమన్నారు. కేబినెట్ లో ఇతర శాఖ మంత్రులపై అనేక ఆరోపణలు ఉన్నాయి.. సీఎంపై మంత్రులు, నేతలు కూడా తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు. ఇప్పటివరకు తనని రాజీనామా చేయమని, మరొకటిగాని నాకు ఎవరూ చెప్పలేదు. హైకమాండ్ కు రాతపూర్వకంగా అన్ని వివరాలు తెలియ జేశానని తెలిపారు. నా బిడ్డ మాట్లాడితే నాకెందుకు శిక్ష వేస్తారు. రెడ్లలో ఎంతో మంది అనుచిత వ్యాఖ్యలు చేశారు. వారిపై ఎందుకు చర్యలు తీసుకోరని ప్రశ్నించారు. బీసీకి ఒక న్యాయం ఇతర సామాజికవర్గాలకు మరో న్యాయమా అని ప్రశ్నించారు. అంతా సద్దుమణిగింది అనుకునే తరుణంలో సురేఖ వ్యాఖ్యల అంతరార్ధం ఏమిటనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్నది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *