– మాట నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలం
– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు
న్యూదిల్లీ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయినా ఏ ఒక్క హామీని పూర్తిస్థాయిలో నెరవేర్చలేకపోయిందని, ఇది తెలంగాణ సమాజాన్ని ప్రతీ విషయంలోనూ మోసం చేసిన ‘420’ ప్రభుత్వమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దిల్లీలో ఆయన బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆరు గ్యారెంటీలు, 420 సబ్-గ్యారెంటీల పేరుతో ప్రజలను వంచించి అధికారంలోకి వచ్చిన రేవంత్ ప్రభుత్వం, గత వెయ్యి రోజుల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలమైందన్నారు. హామీలు నెరవేర్చకపోగా రాష్ట్రాన్ని రూ.13 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టేశారని మండిపడ్డారు. పెండింగ్ బిల్లులు, పీఆర్సీ, ఆరు డీఏలను నిలిపివేసి ఉద్యోగులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. సరైన క్యాష్‌లెస్ వైద్య సేవలు అందించకుండానే ఈహెచ్‌ఎస్ పేరుతో జీతాల నుంచి కోతలు విధించడం దుర్మార్గమని ఆయన ధ్వజమెత్తారు.
మహిళలు, వృద్ధులు & నిరుద్యోగులు, రైతాంగం, విద్యా రంగం
మహిళలకు నెలకు రూ.2,500, వృద్ధులు-వితంతువులకు రూ.4,000 పెన్షన్ హామీల ముసుగులో మోసగించారని ఆరోపించారు. ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి హామీలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. రూ.2 లక్షల పూర్తిస్థాయి రుణ మాఫీ చేయకుండా రైతులను నమ్మించి గొంతు కోశారని, రైతు భరోసా బకాయిలు దాదాపు రూ.57 వేల కోట్లకు చేరాయని తెలిపారు. విద్యా రంగానికి సంబంధించి రూ.14 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థుల భవిష్యత్తు అంధకారంగా మారిందన్నారు. బీసీ సంక్షేమానికి కేటాయించిన రూ.60 వేల కోట్లను విడుదల చేయకపోగా కుల గణన పేరుతో నాటకమాడుతూ అన్యాయం చేశారని మండిపడ్డారు. వెయ్యి రోజుల పాలనపై ప్రభుత్వం తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాలపరిమితి ముగిసిన తర్వాత కాంగ్రెస్‌ను గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




