పేదల ఆత్మగౌరవం ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యం

– రెవెన్యూ మంత్రి పొంగులేటి 

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 2 : తమది పేదవాడి కష్టం తెలిసిన ప్రభుత్వమని, గత ప్రభుత్వం వదిలి వెళ్లిన భారీ అప్పులు, పెండింగ్ బిల్లులను చెల్లిస్తూనే ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, మహ్మద్ అజహరుద్దీన్, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌లతో కలిసి సచివాలయంలో ఆయన బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సుమారు 3,475 రోజులు పాలించిన గత ప్రభుత్వం రాష్ట్రంపై ఆర్థిక భారాన్ని మోపి వెళ్లినప్పటికీ సంక్షేమం, అభివృద్ధిని ఎక్కడా ఆపకుండా తమ వెయ్యి రోజుల ప్రజా పాలనను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. గతంలో ఆగిపోయిన అభివృద్ధి పనులకు సంబంధించిన అస‌లైన‌ బిల్లులు, సర్పంచులు, కాంట్రాక్టర్ల బకాయిలను కూడా చెల్లిస్తున్నామని తెలిపారు. త్వరలోనే రాష్ట్రంలో మరో మూడు లక్షలకు పైగా కొత్త పింఛన్లను మంజూరు చేయనున్నట్లు ఈ సందర్భంగా మంత్రి ప్రకటించారు.

4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు

మొదటి విడతలో మంజూరు చేసిన 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లలో ఇప్పటికే రెండు లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తయిందని మంత్రి పొంగులేటి తెలిపారు. ప్రతి ఇంటికి ప్రభుత్వం రూ. 5 లక్షల సహాయం అందిస్తోంది. త్వరలోనే రెండో విడతలో మరో 2.5 లక్షల ఇళ్లను మంజూరు చేయనున్నారు.

హైదరాబాద్‌లో ‘ఇందిరమ్మ టవర్స్’

పేదలను దూరప్రాంతాలకు పంపకుండా వారు నివసించే నియోజకవర్గాల్లోనే, ఎకరం రూ. 100 కోట్లకు పైగా విలువైన ఖరీదైన స్థలాల్లో ఇళ్లు నిర్మిస్తున్నారు. పైలట్ ప్రాజెక్టుగా హైదరాబాద్‌లోని 20 నియోజకవర్గాల్లో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణం చేపడుతున్నారు. ప్రతి నియోజకవర్గానికి సుమారు 600 ఇళ్ల చొప్పున బహుళ అంతస్తుల్లో లిఫ్ట్, మౌలిక వసతులతో నిర్మిస్తున్నారు. పారదర్శక లక్కీ డ్రా విధానం ద్వారా ఎంపిక చేసిన అర్హులైన మహిళల పేరు మీదనే 525 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఇంటిని, భూమిలో అన్‌డివైడెడ్ షేర్‌తో రిజిస్టర్ చేస్తారు. దీనికోసం పేదలపై రూపాయి భారం పడదని, ఎలాంటి పైరవీలు, సిఫారసులకు అవకాశం లేదని తేల్చి చెప్పారు.

రైతు భరోసా & నిరుద్యోగులకు ఊరట

గత వెయ్యి రోజుల్లో రైతు సంక్షేమానికి రూ. 1.76 లక్షల కోట్లు వెచ్చించామని, సన్న వడ్లకు రూ. 500 బోనస్ ఇస్తున్నామని తెలిపారు. టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేసి వేలాది ఉద్యోగాలను పారదర్శకంగా భర్తీ చేశామన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను అందుబాటులోకి తెస్తున్నట్లు మంత్రి పొంగులేటి వెల్లడించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *