– జలభద్రత ఒక ప్రభుత్వ శాఖకే పరిమితం కాకూడదు
– ప్రతి ఆస్తికి ‘యూనిక్ ఐడీ’ కేటాయించాలి
– జల్ సంచయ్–జన్ భాగీదారీ’ సదస్సులో మంత్రి ఉత్తమ్
న్యూదిల్లీ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2 : దేశవ్యాప్తంగా చేపడుతున్న ప్రతి జల సంరక్షణ పనిని ఒకే జలభద్రతా ప్రణాళిక పరిధిలోకి తీసుకురావాలని నీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతి జల సంరక్షణ ఆస్తికి ప్రత్యేక గుర్తింపు ఉండాలని, దాని నిర్వహణకు నిర్దిష్ట బాధ్యతగల సంస్థను కేటాయించడంతోపాటు కొలవగలిగే స్పష్టమైన ఫలితాలను సాధించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూదిల్లీలోని సుష్మా స్వరాజ్ భవన్‌లో బుధవారం నిర్వహించిన తొలి ‘జల్ సంచయ్–జన్ భాగీదారీ’ జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. జలభద్రత అనేది కేవలం ఒక ప్రభుత్వ శాఖ లేదా ఇంజినీరింగ్ విభాగానికే పరిమితం కాకూడదని, తాగునీరు, వ్యవసాయ స్థిరత్వం, పర్యావరణ పరిరక్షణ కోసం ఇది ప్రజలందరి భాగస్వామ్యంతో కూడిన ప్రజా ఉద్యమంగా మారాలని పిలుపునిచ్చారు.
సమన్వయ లోపం అధిగమించాలి
ఉపాధి హామీ, పీఎంకేఎస్‌వై, ‘కంపా’, ఆర్థిక సంఘం, సీఎస్ఆర్ నిధులతో వేర్వేరుగా పనులు చేపట్టడం వల్ల ప్రణాళికల్లో విచ్ఛిన్నం, నిధుల పునరావృతం జరుగుతున్నాయని విమర్శించారు. వీటి స్థానంలో ప్రతి ఆస్తికి ‘యూనిక్ ఐడీ’ కేటాయించి జియో ట్యాగింగ్ చేయాలని ఆయన ప్రతిపాదించారు.
‘జల్ సంచయ్–జన్ భాగీదారీ’ కింద 2025లో తెలంగాణ అత్యుత్తమ పనితీరు కనబరచడమే కాకుండా దేశంలోని టాప్ 50 జల సంరక్షణ జిల్లాల్లో రాష్ట్రానికి చెందిన 13 జిల్లాలు స్థానం సాధించాయని మంత్రి ఉత్తమ్ తెలిపారు. రాష్ట్రంలో 44,360 చెరువులకు గాను ఇప్పటికే 22,428 జలవనరుల పునరుద్ధరణ పూర్తయినట్లు వెల్లడించారు.
రూ. 46,110 కోట్ల ప్రణాళికలు
2026–29 మూడేళ్ల వ్యవధిలో రూ. 46,110.35 కోట్ల అంచనా వ్యయంతో కొత్తగా 17.28 లక్షల ఎకరాలకు సాగునీటి సదుపాయం కల్పించడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వివరించారు. రాష్ట్రంలోని 18 ప్రధాన జలాశయాల్లో పూడిక వల్ల దాదాపు 22.95 శాతం (40.97 టీఎంసీలు) నీటి నిల్వ సామర్థ్యం తగ్గిందని, దీనిని పునరుద్ధరించేందుకు దిగువ మానేరు, మధ్య మానేరు, కడెం ప్రాజెక్టుల్లో ఆదాయ ఆధారిత పూడికతీత పనులను ప్రయోగాత్మకంగా చేపట్టినట్లు తెలిపారు.
తెలంగాణ ప్రాజెక్టులకు పీఎంకేఎస్‌వై కింద ప్రాధాన్యం
తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు పిఎంకెఎస్‌వై కింద ప్రాధాన్యం ఇవ్వాలని, పర్యావరణ అనుమతులను నిర్దిష్ట గడువులోగా మంజూరు చేయాలని మంత్రి కోరారు. వర్షపాతం, నదీ ప్రవాహాల అంచనా, జలాశయాల సక్రమ నిర్వహణ కోసం కృత్రిమ మేధ సాంకేతికత వినియోగానికి కేంద్రం సాంకేతిక, ఆర్థిక సహకారం అందించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




