అక్రమార్కుల గుండెళ్లో రైళ్లు
వరంగల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 8 : ఏనుమాములలోని వరంగల్ వ్యవసాయ మార్కెట్ (Warangal Market) కమిటీలో గత కొన్ని సంవత్సరాలుగా జరిగిన అక్రమాలు, అవినీతి ఆరోపణలపై నిగ్గు తేల్చేందుకు ప్రత్యేక అధికారుల బృందం గురువారం వస్తున్నట్లు తెలిసింది. మార్కెట్ కార్యదర్శులుగా పనిచేసి పలువురు నిబంధనలకు విరుద్దంగా లైసెన్సులు జారీ చేయడం, నిధులు వ్యయం చేసినట్లు రాష్ట్ర కార్యాలయానికి ఫిర్యాదులు అందాయి. అదే విధంగా సీసీఐ పత్తి కొనుగోళ్ల సమయంలో జారీ చేసిన టీఆర్‌లకు సంబంధించిన కొందరి ఉద్యోగులపై విచారణ పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. మార్కెట్ పనిచేసిన సూపర్‌వైజర్ దడవాయి చిట్టాల బుక్కులు, అలాంట్‌మెంట్ రిజిస్టర్‌లు మాయం అయిన కేసులో విచారణలు పెండింగ్‌లో ఉన్నాయి.
రెండేళ్ల క్రితం మార్కెట్ ఉన్నత కార్యదర్శిగా పనిచేసిన సమయంలో అపరాల యార్డుల్లో మోటార్లు మాయం, కూరగాయల మార్కెట తరలింపు సమయంలో జారీ చేసిన లైసెన్సులు, అడ్డాల కేటాయింపుల్లో లక్షల రుపాయాలు చేతులు మారినట్లు అరోపణలు ఉన్నాయి. ఇదే కార్యదర్శి మార్కెట్‌లో కమీషన్ లైసెన్సులు నిబంధనలకు విరుద్దంగా జారీ చేసినట్లు ఫిర్యాదులు ఉన్నాయి. టూర్ల పేర్లతో లక్షల రుపాయాలు గత మూడేళ్లుగా స్వాహా చేసినట్లు రాష్ట్ర అధికారులకు ఫిర్యాదులు అందినప్పటికి వీరందరికి అప్పటి ఉన్నతాధికారి అండగా ఉండడంతో విచారణలు వాయిదా పడుతూ వస్తున్నాయి. ప్రస్తుతం సదరు అధికారి ఇతర శాఖకు వెళ్లడం ఆస్థానంలో ఐఏఎస్ అధికారులు రావడంతో ఆ ఫైల్‌కు మోక్షం లభించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలో అదనపు డైరెక్టర్ లక్ష్మణుడు నేతృత్వంలో ఇద్దరు డీఎంవోలతో పాటు పలువురు విజిలెన్స్ అధికారులతో కూడన బృందం వరంగల్ వస్తున్నట్లు సమాచారం పొక్కడంతో అవినీతీకి పాల్పడిన ఉద్యోగులు, అధికారులు అందోళలతో ఉన్నట్లు తెలుస్తోంది.




