- టిఆర్‌ఎస్ పేరు మార్చుకోవాలని నోటీస్
– అలాంటి ప్రసక్తి లేదంటూ స్పష్టం చేసిన కవిత
– అవసరమైతే సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని వెల్లడి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 4: కల్వకుంట్ల కవిత స్థాపించిన తెలంగాణ రక్షణ సేన(టీఆర్‌ఎస్) పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. కవిత కొత్త పార్టీ పేరును మార్చాలంటూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ రక్షణ సేన పేరుపై ప్రజల నుంచి అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయని పేర్కొంది. 15 రోజుల్లో మూడు ప్రత్యామ్నాయ పేర్లు సమర్పించాలని ఆదేశించింది. లేని పక్షంలో దరఖాస్తును మూసివేస్తామని హెచ్చరించింది. టీఆర్‌ఎస్ పేరును కొనసాగించేందుకు వీల్లేదంటూ కవితకు ఈసీ లేఖ రాసింది. పేరు వివాదంతో కవిత కొత్త పార్టీ రిజిస్టేష్రన్‌కు తీవ్ర అడ్డంకులు ఏర్పడ్డాయి. దీంతో కొత్త పేర్లతో దరఖాస్తును సవరించాలని ఈసీ సూచించింది. ’తెలంగాణ రక్షణ సేన’ సంక్షిప్త నామంపై కేంద్ర ఎన్నికల సంఘం పంపిన లేఖ రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం లేఖ తమకు అందిందని, వారు లేవనెత్తిన రెండు ప్రధాన అభ్యంతరాలకు తాము ఇప్పటికే పూర్తిస్థాయిలో చట్టపరమైన సమాధానాలు ఇచ్చామని కవిత స్పష్టం చేశారు. తమ పార్టీ సంక్షిప్త నామం ఎప్పటికీ ’టిఆర్‌ఎస్ మాత్రమేనని తేల్చి చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం సూచించినట్లు తాము కొత్త పేర్లు గానీ, ప్రత్యామ్నాయ సంక్షిప్త నామాలు గానీ ఇచ్చే ప్రసక్తే లేదని మీడియా ముఖంగా కుండబద్దలు కొట్టారు. ప్రజా క్షేత్రంలో ఇప్పటికే టిఆర్‌ఎస్ పేరుతో తాము దూసుకుపోతున్నామని, ఈ తరుణంలో వెనక్కితగ్గే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఒకవేళ ఈసీ తమ వివరణను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తే దీనిపై అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయపోరాటం చేయడానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామని ఆమె స్పష్టం చేశారు. పిలుపునిచ్చారు. గతంలో తన తండ్రి కేసీఆర్ నేతృత్వంలో కొనసాగిన పాత పేరును గుర్తుచేసేలా ఉండటంతో ఈ పేరు ప్రజల్లోకి వేగంగా దూసుకెళ్లింది. అయితే, టెక్నికల్ , లీగల్ అభ్యంతరాల నేపథ్యంలో ఈసీ నుంచి 15 రోజుల గడువుతో నోటీసులు రావడం, దానికి కవిత దీటుగా బదులివ్వడం రాష్ట్ర పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





