విద్య నుండి వెలివేయబడ్డ వర్గాలు ఆందోళన కలిగించే విద్యా అసమానతలు

“విద్యా కమిషన్ సూచన మేరకు పూర్వ ప్రాథమిక పాఠశాలలను తెరువాలి. ప్రతి మండలంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ను ఏర్పాటు చేయాలి. ప్రైవేటీకరణను నియంత్రించాలి. మండల వారీగా మరియు పట్టణ వార్డుల వారీగా అత్యంత వెనుకబడిన వర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని  సామాజిక,  ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల (SEEEPC) సర్వే ఒక స్పష్టమైన హెచ్చరిక చేస్తుంది.  వెంటనే చర్యలు తీసుకోకపోతే తెలంగాణలో విద్య మరింత అసమానంగా, అన్యాయంగా మారుతుంది.”

సామాజికఆర్థికవిద్యఉపాధిరాజకీయ మరియు కుల (SEEEPC) సర్వే వెల్లడి

తెలంగాణ విద్యా ఎమర్జెన్సీ లో ఉందని తక్షణ చర్యలు చేపట్టాలని కొంత కాలంగా తెలంగాణ విద్యా స్థితిగతులపై పరిశీలనలు చెపుతూనే ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల (SEEEPC) సర్వే–2024 పై స్వతంత్ర నిపుణుల వర్కింగ్ గ్రూప్ చేసిన విశ్లేషణ కూడా  రాష్ట్రంలోని విద్యా పరిస్థితులపై అత్యంత స్పష్టమైన చిత్రాన్ని అందించింది. 3.5 కోట్లకు పైగా ప్రజలను కవర్ చేసిన ఈ నివేదిక ఒక కీలక వాస్తవాన్ని బయటపెడుతోంది. తెలంగాణలో విద్యా అసమానతలు కులంవర్గం మరియు విద్యా అవకాశాల ఆధారంగా నిర్మితమవుతున్నాయని గణాంకాలు స్పష్టం చేసాయి. బిడ్డ ఎవరికి పుట్టారు ఎక్కడ పుట్టారు అన్న ఆధారంగానే విద్య అందుతుంది తప్ప రాజ్యాంగం ప్రసాదించిన విద్యా హక్కు అందరికి  అందడం లేదని ఈ సర్వే ద్వారా తెలుస్తుంది. సామాజిక ఎదుగుదలకు విద్య ప్రధాన ఆధారం అయింది. కానీ అదే సమయంలో నాణ్యమైన విద్యకు అందరికీ సమాన అవకాశాలు  లేకపోవడం వలన అసమానతలు మరింత బలపడుతున్నాయని ఈ నివేదిక స్పష్టం చేస్తుంది.

 తెలంగాణలో విద్యా రంగంలోని తీవ్రమైన అసమానతలను ఈ సర్వే స్పష్టంగా బయటపెట్టింది. రాష్ట్ర జనాభాలో 90% ను కవర్ చేసే 56 ప్రధాన కులాలపై చేసిన ఈ అధ్యయనం ఒక అసౌకర్యకరమైన నిజాన్ని చెబుతోంది. విద్య అందరికీ సమానంగా అందడం లేదని అది నిర్మాణాత్మకంగా అసమానంగా మారిందని సర్వే ద్వారా తెలుస్తుంది.

తీవ్ర విద్యా అసమానతలు:

సర్వే ప్రకారం రాష్ట్రంలో రెండు వేర్వేరు విద్యా వ్యవస్థలు పనిచేస్తున్నాయని ఉన్నత వర్గాల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలలు, ఇంగ్లీష్ మీడియం, ఉన్నత విద్య అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ మరియు అత్యంత వెనుకబడిన వర్గాల పిల్లలు ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలలపై ఆధారపడుతున్నారు. ఉన్నత విద్యలో ఉన్నత  వర్గాల్లో 37%  వరకు ఉండగా, మరికొన్ని వర్గాల్లో5% కన్నా తక్కువ. ఇవి  ఆందోళన కలిగించే అసమానతలు.

ఉన్నత విద్య:

ఉన్నత విద్య విషయంలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. ఎస్టీ  కోలాం, ఎస్టీ  గోండ్స్, ఎస్సీ  బెడాస్, బిసి – ఏ  ఒడ్డేలు, వాల్మీకీలు, పిచ్చిగుంట్ల,బిసి – డి మాలీలు, బిసి-ఈ ముస్లిం వర్గాలు మరియు ఓసి ముస్లింలు ఉన్నత విద్యలో తీవ్రంగా వెనుకబడి ఉన్నారు. ఇది ఉన్నత విద్య కొద్ది వర్గాలకే పరిమితమవుతున్నదనే సంకేతాన్ని ఇస్తోంది.

ప్రైవేటు విద్య:

ప్రైవేట్ విద్య ను అందుకోవడం గిరిజన,ఎస్సి,ఎస్టీ బీసీ వర్గాలు వెనుకబడి ఉన్నాయి.  అంటే, విద్య ఇప్పుడు డబ్బు ఉన్నవారికి మాత్రమే అందుబాటులోకి వెళ్తోందనే విషయం స్పష్టమవుతోంది. మరోవైపు, రాష్ట్రంలో సుమారు 40% మంది  ప్రభుత్వ పాఠశాలలపై ఆధారపడుతున్నారు. ఈ పాఠశాలలను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం వాటిని నిర్లక్ష్యం చేస్తోంది.

ప్రభుత్వ విద్య -దశాబ్దాల నిర్లక్ష్యం

ఈ నివేదిక కేవలం గణాంకాల సమాహారం కాదు. ఇది అన్నీ ప్రభుత్వాల  ప్రభుత్వ విద్యా విధానంపై తీవ్రమైన ఆరోపణ. గత రెండు మూడు దశాబ్దాలుగా ప్రభుత్వాలు  తన బాధ్యత నుంచి వెనక్కి తగ్గుతూ, ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తూ, కుల మరియు వర్గాల మధ్య అసమానతలను మరింత పెంచుతోంది. పేద పిల్లలు బడుల నుండి  బయటకు నెట్టబడుతున్న ఈ పరిస్థితి పరిపాలన వైఫల్యానికి నిదర్శనం మరియు  బాధ్యతల నుంచి తప్పించుకోవడమే.

తెలంగాణ సమాజం గురించి SEEEPC సర్వే వెలికితీసిన వాస్తవాలు అత్యంత ఆందోళనకరంగా ఉన్నాయి. బాల్య వివాహాలు, మహిళల తక్కువ విద్య, పిల్లల్లో నిరక్షరాస్యత, పాఠశాల డ్రాప్‌అవుట్‌లు, బాల కార్మికత ఇవి విడివిడిగా కనిపించే సమస్యలు కావు, ఇవన్నీ కలిసి ఒకే విషయాన్ని చెబుతున్నాయి. ముఖ్యంగా ఎస్టీలు, ఎస్సీలు ఎక్కువగా ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం వ్యవస్థాత్మక వైఫల్యమే అని తెలుస్తుంది. పాఠశాలలు పిల్లలను నిలబెట్టలేకపోతే, పిల్లలు పని వైపు మళ్లడం సహజం అవుతోంది. ఇది కేవలం ఆర్థిక సమస్య కాదు ఇదిపిల్లల హక్కుల ఉల్లంఘన.

బాల్య  వివాహాలు :

మన విద్యా వ్యవస్థ బలహీన వర్గాల పిల్లలను కాపాడలేకపోతుంది. 18 సంవత్సరాల లోపు 5% బాలికలు వివాహం కావడం అంటే, అమ్మాయిల జీవితాలు చిన్న వయసులోనే ముగిసిపోతున్నాయన్న మాట. అదే సమయంలో, రాష్ట్రంలో 65%కి పైగా మహిళలు 10వ తరగతి దాటకపోవడం, సమాజంలో లింగ అసమానత ఎంత లోతుగా ఉందో స్పష్టంగా చూపిస్తుంది.

పిల్లల్లో నిరక్షరాస్యత, డ్రాప్‌అవుట్‌లు ఇంకా కొనసాగుతుండటం, ప్రాథమిక విద్య బలహీనంగా ఉందని సూచిస్తుంది. సర్వే ప్రకారం 38% పిల్లలు 7వ తరగతి వరకు మాత్రమే చదవడం, 56% మంది 12వ తరగతి దాటకపోవడం అంటే, మన యువత పెద్ద మొత్తంలో ఉన్నత విద్యకు చేరుకోలేకపోతున్నారు. ఇదే కారణంగా వారు తక్కువ నైపుణ్యాలతో తక్కువ వేతన ఉద్యోగాల్లోనే పరిమితమవుతున్నారు.

ఈ పరిస్థితులు ఒక స్పష్టమైన సందేశం ఇస్తున్నాయి:వెనుకబాటుతనం చిన్ననాటి నుంచే ప్రారంభమవుతోంది మరియు తరతరాలకు కొనసాగుతోంది. ప్రత్యేకంగా అత్యంత వెనుకబడిన కులాల పిల్లల కోసం నాణ్యమైన విద్యను హామీ ఇవ్వాలి. లేకపోతే, తెలంగాణా రైజింగ్ లేదా ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక అభివృద్ధి  అనే మాట కేవలం నినాదంగానే మిగిలిపోతుంది.

జిల్లాల వారి జిల్లాలోని  అంతరాలు:

ఇక జిల్లాల వారీగా చూస్తే ఆదివాసీ ప్రాంతాలలో విద్యకు  అత్యంత వంచనకు గురి అవుతున్నారని సర్వే వెల్లడించింది. అదిలాబాద్,కొమరంభీం ఆసిఫాబాద్,మంచిర్యాల లో కొంత భాగం ,బద్రాద్రి  కొత్తగూడెం మరియు ములుగు జిల్లాలలో  ఈ పరిస్థితి నెలకొన్నది.

అలాగే మహబూబ్నగర్,గద్వాల,నాగర్ కర్నూల్,నల్గొండ,సూర్యాపేట మరియు కామారెడ్డి జిల్లాలు గ్రామీణ ప్రాంతాలలోని బీసీ సామాజిక వర్గం బాలలు  విద్యకు దూరంగా ఉన్నారు. కరీంనగర్ ,వరంగల్,ఖమ్మం మరియు సిద్దిపేట జిల్లాలలో కొంత మెరుగుగా కనిపించిన ఎస్సీ  ఎస్టీ వర్గాలలో మండలాల వారీగా చూస్తే  విద్యకు దూరంగా ఉన్నారు. జిల్లాల అంతర్గతంగా అసమానతలు కనిపించాయి.

విద్య నుండి వెలివేయబడుతున్న పట్టణ పేదల బిడ్డలు :

పట్టణ ప్రాంతాలైన హైదరాబాద్,రంగారెడ్డి మేడ్చల్ అంటే గ్రేటర్ హైదరాబాద్ అనవచ్చు. ఈ ప్రాంతం లో ఉన్నత వర్గాల పిల్లలు మంచి విద్య అవకాశాలు కలిగి ఉన్నారు. కానీ పట్టణ పేదలైన ఏసీ,ఎస్టీ బీసీ వర్గాలు ప్రధానంగా పొట్ట చేత పట్టుకుని పట్టణానికి వచ్చిన వలస  కుటుంబాల పిల్లలు ప్రభుత్వ బడులు అందుబాటులో లేక అటు ప్రైవేటు లో చదివించే స్థోమత లేక  విద్య నుండి  వెలివేయబడుతున్నారు.అంటే ఒకే నగరంలో పిల్లల భవిష్యత్తు వారి కులం, వర్గం ఆధారంగా నిర్ణయించబడుతోంది. పట్టణ జనాభా పెరుగుతున్న క్రమం లో జనాభా ఆధరంగా ప్రభుత్వ బడులు ఏర్పాటు చేయాలి.

ఈ నేపాధ్యాన్ని పరిశీలిస్తే కొన్ని జిల్లాల విద్యా స్థితి బాగుందని కొన్ని జిల్లాలు  బాగా లేవని చెప్పలేము. తెలంగాణ లోని  ప్రతి జిల్లాలో కులాల వారీగా విద్యా  అంతరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

అత్యధిక శాతం తక్కువ ఆదాయ వనరులు:

రాష్ట్రం లో సంవత్సరానికి లక్ష కన్న తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులు తెలంగాణ లో 78%  ఉండగా అందులో 86% ఎస్సీలు, 88% ఎస్టీలు మరియు 80 శాతం బీసీలు. ఈ కుటుంబాలన్నీ విద్యా తోనే విముక్తి అని నమ్మి  తమ  పిల్లలను చదువుకు పంపిస్తున్నారు. ప్రభుత్వ బడులు సరియిన వసతులు మరియు బోధనా సిబ్బంది కొరతను చూసి తమ పిల్లలను అత్యధిక  శాతం కుటుంబాలు ప్రైవేటు బడులకు  పంపిస్తున్నారు.  అధిక   ప్రైవేటు ఫీజుల భారం తో సతమతమవుతున్నారు. దేశంలోనే అతి ఎక్కువ తలసరి ఆదాయం గల రాష్ట్రం  అని ఎంత చెప్పుకున్నా వ్యక్తుల  ఆదాయానికి వచ్చినప్పుడు అసలు సమస్య అర్థం అవుతుంది. అందుకే ప్రభుత్వ విద్యా విధానం బలోపేతం అత్యవసరం.

చివరగా ..

ప్రభుత్వం బలమైన రాజకీయ సంకల్పం తో నిర్వహించిన సర్వే తో ఆగిపోకుండా… ఉపన్యాసలతో కాలం గడపకుండా  తక్షణ కార్యాచరణకు పూనుకోవాలి. అప్పుడే సర్వే కు సార్ధకత  ఉంటుంది.   విద్యా కమిషన్ సూచన మేరకు పూర్వ ప్రాథమిక పాఠశాలలను తెరువాలి. ప్రతి మండలంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ను ఏర్పాటు చేయాలి. ప్రైవేటీకరణను నియంత్రించాలి. మండల వారీగా మరియు పట్టణ వార్డుల వారీగా అత్యంత వెనుకబడిన వర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల (SEEEPC) సర్వే ఒక స్పష్టమైన హెచ్చరిక చేస్తుంది.  వెంటనే చర్యలు తీసుకోకపోతే తెలంగాణలో విద్య మరింత అసమానంగా, అన్యాయంగా మారుతుంది. విద్య అసమానతలకు కారణం కాకుండా, సమానత్వానికి సాధనంగా మారడానికి ఈ సర్వే ఒక దిక్సూచి  కావాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *