జాతీయ పార్టీల హైకమాండ్ మార్కు రాజకీయం

భారత రాజకీయ చరిత్ర చెబుతున్న గొప్ప సత్యం ఏమిటంటే, జాతీయ పార్టీలు రాష్ట్ర నాయకత్వాన్ని గౌరవించకపోతే చివరకు రాష్ట్రాలను కోల్పోతాయి. రాష్ట్రాలను కోల్పోయిన పార్టీలు క్రమంగా జాతీయ ప్రభావాన్ని కూడా కోల్పోతాయి. కాంగ్రెస్ గత మూడు దశాబ్దాల ప్రయాణం దీనికి సాక్ష్యం. అందుకే నేడు కర్ణాటకలో జరుగుతున్న చర్చను కేవలం ఒక ముఖ్యమంత్రి మార్పు చర్చగా చూడకూడదు. ఇది కాంగ్రెస్ భవిష్యత్తుకు సంబంధించిన పరీక్ష. అంతకంటే పెద్దగా చెప్పాలంటే భారత జాతీయ పార్టీల రాజకీయ స్వభావానికి సంబంధించిన ప్రశ్న. ప్రజల తీర్పే ప్రజాస్వామ్యంలో శాశ్వతం .  హైకమాండ్ నాయకులను నియమించ గలవు పదవులను పంచగలవు ముఖ్యమంత్రులను మార్చగలవు కానీ ప్రజల విశ్వాసాన్ని ఆదేశాలతో మార్చలేవు..” 

దుప్పటి మొగిలి
8466827118

భారతదేశంలో ప్రజాస్వామ్యం బలపడుతున్న కొద్దీ ఒక విరుద్ధ ధోరణి కూడా పెరిగింది. ప్రజలు నాయకులను ఎన్నుకుంటున్నారు. కానీ పార్టీల అధిష్ఠానాలు వారిని మార్చేస్తున్నాయి. ప్రజలు ఒక ముఖాన్ని చూసి వోటు వేస్తున్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరో ముఖం కనిపిస్తోంది. ఇదే పరిస్థితి పలు రాష్ట్రాల్లో పదేపదే కనిపిస్తోంది. అందుకే నేడు కర్ణాటకలో జరుగుతున్న చర్చ కేవలం సిద్ధరామయ్య లేదా డి.కె. శివకుమార్ గురించి కాదు. అది కాంగ్రెస్ రాజకీయ సంస్కృతి గురించి. అంతకంటే పెద్దగా చెప్పాలంటే భారత జాతీయ పార్టీల రాజకీయ మనస్తత్వం గురించి.

 భారత రాజకీయ చరిత్రను పరిశీలిస్తే ఒక ఆసక్తికరమైన విషయం కనిపిస్తుంది.ప్రాంతీయ పార్టీలు నాయకులను నిర్మిస్తాయి.జాతీయ పార్టీలు నాయకులను నియంత్రించడానికి ప్రయత్నిస్తాయి.ఇదే రెండు వ్యవస్థల మధ్య ప్రధాన తేడా. డీఎంకే అంటే స్టాలిన్. టీఎంసీ అంటే మమతా బెనర్జీ. బీజేడీ అంటే నవీన్ పట్నాయక్.బీఆర్ఎస్ అంటే కేసీఆర్.ఈ పార్టీలు నాయకుల చుట్టు నిర్మించబడ్డాయి.  కానీ కాంగ్రెస్, బీజేపీ వంటి జాతీయ పార్టీల్లో పరిస్థితి వేరు. అదే జాతీయ పార్టీల్లో రాష్ట్ర నాయకుల భవిష్యత్తును నిర్ణయించేది ప్రజలా? లేక పార్టీ హై కమాండ్లా? ఇక్కడ నాయకుడు పార్టీ కంటే పెద్దవాడిగా ఎదగకుండా ఒక అంతర్గత వ్యవస్థ పనిచేస్తుంది. అందుకే జాతీయ పార్టీల్లో తరచూ ఒక మౌన సంఘర్షణ కనిపిస్తుంది.దిల్లీ నాయకత్వమా? రాష్ట్ర నాయకత్వమా? ఈ పోరాటం స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కొనసాగుతూనే ఉంది. పరిగెత్తుతున్న గుర్రాన్ని మధ్యలో మార్చరు.కానీ భారత జాతీయ పార్టీల చరిత్ర చూస్తే చాలాసార్లు అదే జరిగింది. కొన్నిసార్లు అది విజయాన్ని ఇచ్చింది. మరికొన్నిసార్లు ఘోర పరాజయాలకు దారితీసింది. ముఖ్యమంత్రి మార్పు అనేది ఒక వ్యక్తి పదవి కోల్పోవడం కాదు. అది పార్టీ, ప్రభుత్వం, ప్రజల విశ్వాసం, భవిష్యత్ ఎన్నికలపై ప్రభావం చూపే రాజకీయ ప్రక్రియ.

కాంగ్రెస్ హైకమాండ్ నిర్మించిన రాజకీయ నమూనా

భారతదేశంలో ముఖ్యమంత్రుల మార్పు రాజకీయాలకు అసలు పునాది వేసింది కాంగ్రెస్ పార్టీ. ముఖ్యంగా ఇందిరా గాంధీ కాలం నుంచి రాష్ట్ర నాయకత్వాన్ని నియంత్రించడం కాంగ్రెస్ రాజకీయ సంస్కృతిలో భాగమైంది. ఒకప్పుడు కాంగ్రెస్ దేశమంతా వ్యాపించిన మహా రాజకీయ వృక్షం. రాష్ట్ర నాయకులు దాని శాఖలు మాత్రమే. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రులు ప్రజాదరణ పొందినా, పార్టీ అధిష్టానం ముందు వారి స్థానం పరిమితంగానే ఉండేది. ఇందిరా గాంధీ కాలంలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్ వంటి రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు తరచూ మారడం సాధారణ రాజకీయ చర్యగా మారిపోయింది. దీని వెనుక ఉన్న తత్వం స్పష్టమైనది. రాష్ట్ర నాయకుడు బలపడవచ్చు, కానీ హైకమాండ్ కంటే బలపడకూడదు. ఈ విధానం తాత్కాలికంగా కేంద్ర నాయకత్వానికి ప్రయోజనం చేకూర్చినా, దీర్ఘకాలంలో కాంగ్రెస్‌కు తీవ్రమైన నష్టం చేసింది.

ప్రాంతీయ నాయకులు ఎదగకపోవడంతో రాష్ట్రాల్లో కాంగ్రెస్ వేర్లు క్రమంగా బలహీనపడ్డాయి. ఒకప్పుడు కాంగ్రెస్‌కు అజేయ కోటలుగా ఉన్న ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఒక్కొక్కటిగా కాంగ్రెస్ చేతుల నుంచి జారిపోయాయి. కారణం కేవలం ప్రత్యర్థుల బలం కాదు. స్థానిక నాయకత్వాన్ని పెంచడంలో కాంగ్రెస్ వైఫల్యం కూడా ఒక ప్రధాన కారణం. ప్రజాస్వామ్యంలో ప్రజలు పార్టీకే కాదు, నాయకత్వానికి కూడా వోటు వేస్తారు. ఒక ప్రాంతీయ నాయకుడు ప్రజలతో బలమైన అనుబంధం ఏర్పరచుకుంటే పార్టీ కూడా బలపడుతుంది. కానీ కాంగ్రెస్ చాలా సందర్భాల్లో నాయకుడి బలాన్ని పార్టీకి ఆస్తిగా కాకుండా ప్రమాదంగా చూసింది. ఫలితంగా అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ స్థానాన్ని ప్రాంతీయ పార్టీలు ఆక్రమించాయి.

జనతాదళ్ నుంచి బీజేపీ వరకు

సీఎంల మార్పుల సమస్య కాంగ్రెస్‌కే పరిమితం కాదు. భారత రాజకీయ చరిత్రలో జనతాదళ్ దీనికి అత్యంత పెద్ద ఉదాహరణ. 1989లో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదిగిన జనతాదళ్ దేశ రాజకీయాల్లో ఒక కొత్త ఆశను రేకెత్తించింది. కానీ ఆ ఆశ ఎక్కువకాలం నిలవలేదు. కారణం సిద్ధాంతపరమైన విభేదాలు కాదు.  ఆ పార్టీ పతనానికి ప్రధాన కారణం బీజేపీ కాదు, కాంగ్రెస్ కాదు.అంతర్గత నాయకత్వ పోరాటాలే. వి.పి.సింగ్, దేవిలాల్, చంద్రశేఖర్, అజిత్ సింగ్ వంటి నాయకులు ఒకే వేదికపై ఉన్నప్పటికీ ఒకే నాయకత్వాన్ని అంగీకరించలేక పోయారు. ప్రతి నాయకుడు తనను తాను కేంద్రంగా భావించారు.ఫలితంగా దేశాన్ని పాలించిన పార్టీ కొన్నేళ్లలోనే ముక్కలైంది. జనతాదళ్ అనేక ముక్కలుగా విడిపోయింది. తర్వాత జేడీయూ, ఆర్జేడీ, సమాజ్‌వాదీ పార్టీ, జేడీఎస్ వంటి  ప్రాంతీయ రూపాల్లో విడిపోయింది. నాయకులను పూర్తిగా అణచివేస్తే పార్టీ చనిపోతుంది నాయకులను పూర్తిగా అదుపు చేయకపోతే పార్టీ చీలిపోతుందని జనతాదళ్  గొప్ప రాజకీయ పాఠాన్ని నేర్పింది.

బీజేపీ కూడా ఈ సమస్య నుంచి పూర్తిగా బయటపడలేదు. గుజరాత్‌ లో విజయ్ రూపాణిని మార్చడం, ఉత్తరాఖండ్‌లో వరుస ముఖ్యమంత్రుల మార్పులు, కర్ణాటకలో యడియూరప్ప స్థానంలో బసవరాజ్ బొమ్మైని తీసుకురావడం వంటి నిర్ణయాలు బీజేపీ కూడా అవసరమైతే నాయకత్వ మార్పులకు వెనుకాడదని చూపించాయి. అయితే కాంగ్రెస్‌తో పోలిస్తే బీజేపీ ఒక విషయంలో భిన్నంగా వ్యవహరించింది. నాయకుడి వ్యక్తిగత ప్రజాదరణ కంటే సంస్థాగత క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇస్తుంది.అయినప్పటికీ బీజేపీ నిర్ణయాలూ విమర్శల నుంచి తప్పించుకోలేదు. యడియూరప్ప ను పక్కన పెట్టిన తర్వాత లింగాయత వర్గంలో అసంతృప్తి పెరిగిందనే అభిప్రాయాలు వినిపించాయి. ఉత్తరాఖండ్‌లో వరుస మార్పులు ప్రజల్లో అయోమయాన్ని కలిగించాయి. ముఖ్యమంత్రి మార్పు అనే రాజకీయ ఆయుధం ఏ పార్టీ చేతిలో ఉన్నా అది రెండువైపులా పదునున్న కత్తిలాంటిదే.

కర్ణాటక మార్పు కాంగ్రెస్ కు  కత్తిమీద సాము

కర్ణాటక నేడు కాంగ్రెస్‌కు కేవలం ఒక రాష్ట్రం కాదు. దక్షిణ భారతదేశంలో కాంగ్రెస్ భవిష్యత్తుకు కేంద్ర బిందువు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన ఘన విజయం పార్టీకి కొత్త ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో పోటీలో లేని స్థితి నుండి అపూర్వ విజయాన్ని అందుకున్నది అంటే కర్ణాటక గెలుపే కారణం.అయితే అదే విజయానికి కారణమైన ఇద్దరు నాయకులు సిద్ధరామయ్య, డి.కె. శివకుమార్  ఇప్పుడు కాంగ్రెస్ రాజకీయ సమీకరణాల కేంద్రంగా మారారు. సిద్ధరామయ్య ఓబీసీ వర్గాల్లో విశేష ప్రజాదరణ కలిగిన నాయకుడు. సంక్షేమ రాజకీయాల ముఖచిత్రంగా నిలిచారు. మరోవైపు డి.కె. శివకుమార్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన నిర్వాహకుడు. ఈ ఇద్దరి మధ్య సమతుల్యత సాధించడం కాంగ్రెస్‌కు ఎప్పటినుంచో సవాలే. ఇక్కడ సమస్య వ్యక్తుల మధ్య పోటీ కాదు. ప్రజల ముందు పార్టీ ఏ సందేశం ఇస్తుందనేదే అసలు ప్రశ్న. ఒకవేళ అధికార భాగస్వామ్య ఒప్పందం పేరుతో ముఖ్యమంత్రి మార్పు జరిగితే ప్రజలు దానిని రాజకీయ స్థిరత్వంగా చూస్తారా? లేక అధికార పోరాటంగా భావిస్తారా? ఇదే కాంగ్రెస్ ముందున్న అసలు పరీక్ష.

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా గుర్తింపు తెచ్చుకుంటున్న సమయంలో ముఖ్యమంత్రి మార్పు చర్చలు రావడం ప్రతిపక్షాలకు ఆయుధంగా మారే అవకాశం ఉంది. బీజేపీ ఇప్పటికే ఇదే అంశాన్ని రాజకీయంగా వినియోగించేందుకు ప్రయత్నిస్తోంది. ప్రభుత్వం పాలనపై దృష్టి పెట్టిందా? లేక పదవుల పంచాయతీ పైన? అనే ప్రశ్నలను ప్రజల్లోకి తీసుకెళ్తోంది. ఒకవేళ కాంగ్రెస్ ఈ పరిస్థితిని సమర్థంగా నిర్వహించలేకపోతే కర్ణాటక విజయాన్ని భవిష్యత్ ఎన్నికలలో రాజకీయ మూలధనంగా మార్చుకునే అవకాశం కోల్పోవచ్చు. సీఎంల మార్పుల వెనుక అసలు కారణం చాలాసార్లు పరిపాలన కాదు.అధికార సమతుల్యత. జాతీయ పార్టీలు ఎపుడు రాష్ట్ర నాయకుడు పార్టీ కంటే పెద్దవాడైతే? అనే భయంతో ఉంటాయి.ఈ భయం కాంగ్రెస్‌లో ఎక్కువ.బీజేపీలో కొంత తక్కువ. జనతాదళ్‌ లో ఈ భయం లేకపోవడం వల్లే పార్టీ విచ్ఛిన్నమైంది. అందుకే జాతీయ పార్టీలు తరచూ నాయకత్వ మార్పులను ఒక రాజకీయ భద్రతా వాల్వ్‌లా ఉపయోగించుకుంటాయి.

ప్రజా తీర్పే శాశ్వతం                         

 కాంగ్రెస్ చరిత్రలో ముఖ్యమంత్రి మార్పులు కొన్నిసార్లు వ్యూహాత్మక విజయాలు సాధించాయి. కానీ ఎక్కువ సార్లు అవి అంతర్గత బలహీనతలను బయటపెట్టాయి. పంజాబ్‌లో అమరిందర్ సింగ్‌ను మార్చి చరణ్‌జీత్ సింగ్ చన్నీని తీసుకురావడం ద్వారా సామాజిక సమీకరణాలు మారతాయని కాంగ్రెస్ భావించింది. కానీ ప్రజలు దాన్ని నాయకత్వ సంక్షోభంగా అర్థం చేసుకున్నారు. ఫలితంగా పార్టీ ఘోర పరాజయం చవిచూసింది. రాజస్థాన్‌లో అశోక్ గెహ్లాట్-సచిన్ పైలట్ వివాదం కాంగ్రెస్‌ను ఏ స్థాయిలో ఇబ్బంది పెట్టిందో దేశం చూసింది. మధ్యప్రదేశ్‌లో కమల్‌నాద్ , సింధియా విభేదాలు చివరకు ప్రభుత్వాన్నే కూల్చేశాయి. ఈ ఉదాహరణలన్నీ చెప్పే విషయం సమస్య ముఖ్యమంత్రి మార్పు కాదు మార్పు వెనుక ఉన్న రాజకీయ నిర్వహణ. భారత రాజకీయ చరిత్ర చెబుతున్న గొప్ప సత్యం ఏమిటంటే, జాతీయ పార్టీలు రాష్ట్ర నాయకత్వాన్ని గౌరవించకపోతే చివరకు రాష్ట్రాలను కోల్పోతాయి. రాష్ట్రాలను కోల్పోయిన పార్టీలు క్రమంగా జాతీయ ప్రభావాన్ని కూడా కోల్పోతాయి.

కాంగ్రెస్ గత మూడు దశాబ్దాల ప్రయాణం దీనికి సాక్ష్యం. అందుకే నేడు కర్ణాటకలో జరుగుతున్న చర్చను కేవలం ఒక ముఖ్యమంత్రి మార్పు చర్చగా చూడకూడదు. ఇది కాంగ్రెస్ భవిష్యత్తుకు సంబంధించిన పరీక్ష. అంతకంటే పెద్దగా చెప్పాలంటే భారత జాతీయ పార్టీల రాజకీయ స్వభావానికి సంబంధించిన ప్రశ్న. ప్రజల తీర్పే ప్రజాస్వామ్యంలో శాశ్వతం .  హైకమాండ్ నాయకులను నియమించ గలవు పదవులను పంచగలవు ముఖ్యమంత్రులను మార్చగలవు కానీ ప్రజల విశ్వాసాన్ని ఆదేశాలతో మార్చలేవు. ప్రజలు చూసేది ఒకటే స్థిరత్వం, పనితీరు, నాయకత్వం. అవి ఉంటే మార్పు కూడా అంగీకరిస్తారు. అవి లేకపోతే మార్పును శిక్షిస్తారు.అందువల్ల సీఎంల మార్పుల రాజకీయాలు కాంగ్రెస్‌కు తాత్కాలిక వ్యూహం కావచ్చు. కానీ పార్టీ భవిష్యత్తును నిర్ణయించేది ఆ వ్యూహం కాదు. ప్రజలతో ఏర్పడే నమ్మకం. కర్ణాటక నేడు కాంగ్రెస్‌కు అదే పాఠాన్ని మరోసారి గుర్తు చేస్తోంది. ముఖ్యమంత్రి మారవచ్చు. నాయకులు మారవచ్చు. కానీ ప్రజల తీర్పు మారాలంటే విశ్వాసం నిలవాలి. ఆ విశ్వాసమే ఏ జాతీయ పార్టీకైనా నిజమైన రాజకీయ మూలధనం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *