– మహిళా రిజర్వేషన్‌పై  బీజేపీకి చిత్తశుద్ధి లేదు
– బిల్లు ముసుగులో డీలిమిటేషన్ చట్టం
– రాజ్యాంగం మార్పు.. రిజర్వేషన్ల రద్దుకు కుట్ర
– ప్రతిపక్షాలు ఓడించింది బీజేపీ దురుద్దేశాలనే..
– డీలిమిటేషన్‌పై అఖిలపక్షంతో చర్చలు జరపాలి
– బీజేపీతో జత కట్టిన పార్టీలకు ఎదరు దెబ్బలు తప్పవు
– మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి

న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 18 : మహిళా బిల్లు పేరుతో కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ బిల్లు తీసుకొచ్చిందని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. మహిళా బిల్లు వీగిపోవడంతో ప్రతిపక్షాలపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దిల్లీలో ఆయన మీడియాతో శనివారం మాట్లాడారు. మహిళల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ చాలా చేసిందని పేర్కొన్నారు. మహిళా బిల్లు వీగిపోవడం రాజకీయ ఓటమి కాదు.. బీజేపీ విధానాల ఓటమి అంటూ వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలు ఓడించింది బీజేపీ దురుద్దేశాలనే అని స్పష్టం చేశారు. ఈ బిల్లుపై ప్రధాని మోదీకి నిజాయతీ లేదు.. నిజాయతీగా మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొస్తే పార్లమెంట్‌లో అందరూ మద్దతు తెలిపేవారని అన్నారు. మహిళా బిల్లు పేరుతో డీలిమిటేషన్ బిల్లు తీసుకొచ్చి దక్షిణాదికి అన్యాయం చేయాలని చూశారు. ప్రధాని మోదీ.. ఉత్తర, దక్షిణ భారత్ మధ్య అంతరాలు సృష్టించే విధానాన్ని విరమించుకోవాలన్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లుపై తమకు చిత్తశుద్ధి ఉందని, 2023 నాటి బిల్లును యథాతథంగా అమలు చేయాలని బీజేపీకి సూచించారు. అలా చేస్తే ఇండి కూటమి ఏకగ్రీవంగా మద్దతు ఇచ్చేందుకు సిద్ధమని, దక్షిణాది రాష్ట్రాలను ఒప్పించి తీసుకువచ్చే బాధ్యత తనదని ఈ సందర్భంగా రేవంత్ హామీ ఇచ్చారు.   ఇందులోనూ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. రిజర్వేషన్ల బిల్లు విషయంలో రాజకీయం చేయాల్సిన అవసరం లేదన్నారు. మూడు బిల్లుల పేరుతో డీలిమిటేషన్ అమలుకు కుట్ర చేశారని ఆరోపించారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర చేసిందని, బీజేపీ ఉద్దేశం రాజ్యాంగం మార్పు, రిజర్వేషన్ల ఎత్తివేయడమేనని, పార్లమెంట్ వేదికగా జరిగిన ఈ తీరును 140 కోట్ల మంది దేశ ప్రజలు చూశారని అన్నారు. దక్షిణాదికి జరగబోయే అన్యాయాన్ని లోక్‌సభ సాక్షిగా అడ్డుకున్నామని చెప్పారు. విపక్షాల ఐక్యతతో మోదీ సర్కార్ ఓడిపోయిందన్నారు. 2011 జనాభా లెక్కలు, ఇతర డేటా ఎన్నికల కమిషన్ దగ్గర ఉన్నాయని, 2009లో డీలిమిటేషన్ జరిగిందని, ఆ లెక్కలతో ఈ ఆగస్టు 15 లోపు మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను కల్పించవచ్చని, అయినా మహిళా రిజర్వేషన్ల బిల్లు ఇప్పటికే పాసైందంటూ చిన్న సవరణలతో రిజర్వేషన్లు అమలు చేయవచ్చని రేవంత్ సూచించారు. రిజర్వేషన్లు తొలగించేందుకే బీజేపీ కుట్ర చేసిందని, ఆ పార్టీకి 400 సీట్లు వచ్చి ఉంటే రాజ్యాంగాన్ని మార్చేవారని తీవ్రంగా మండిపడ్డారు. యూపీ ఎన్నికల్లోపు ఆ బిల్లును అమలు చేయాలని ముఖ్యమంత్రి డిమాండ్ చేశారు. దీంతో ప్రజల్లో ఎవరికి మద్దతు ఉందో ప్రజాక్షేత్రంలోనే తేలుతుందని సవాల్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి దేశం మొదటి ప్రాధాన్యత అని, ఆ తర్వాత ప్రజలు, చివరగా పార్టీ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నరేంద్ర మోదీ, బీజేపీకి మాత్రం తొలుత పార్టీ,  తర్వాత సొంత విషయాలు, ఆ తర్వాతే దేశమని విమర్శించారు. దేశంలో దక్షిణాది రాష్ట్రాలు భాగమేనని, దేశంలోనే దక్షిణాది ప్రజలు బతుకుతున్నారని, దేశ సేవలో తాము ఎవరికన్నా తక్కువ కాదని, దేశాన్ని కాపాడుకోవడం తమ బాధ్యత అని రేవంత్ రెడ్డి అన్నారు. దేశానికి విధేయంగా వ్యవహరించిన దక్షిణాది రాష్ట్రాలను ప్రోత్సహించాల్సింది పోయి జరిమానా విధిస్తామనడం ఏవిధంగా సరైందని ప్రశ్నించారు. తల్లిని చంపి బిడ్డను రక్షించారని నరేంద్ర మోదీ రాష్ట్ర విభజనపై పలుమార్లు ద్వేషం చూపారని, ఇప్పుడు ఆయన బాటలోనే ఎంపీ తేజస్వీ సూర్య పయనిస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఆ పార్టీ ఎంపీ లక్ష్మణ్ మోదీ దృష్టిని ఆకర్షించి ప్రమోషన్లు పొందేందుకు ప్రయత్నిస్తున్నారే తప్ప ప్రజల అభిప్రాయాలను పట్టించుకోవడం లేదని సీఎం విమర్శించారు. తాను సూచించిన విధానం కిషన్ రెడ్డికి నచ్చకపోతే ప్రత్యామ్నాయం ఏమిటో చెప్పాలే తప్ప ఎదురుదాడి చేయడమేమిటని ప్రశ్నించారు.
అఖిలపక్షం, రాష్ట్రాలతో సంప్రదించాలి
లోక్‌సభ, రాజ్యసభ ఉన్నది చట్టాలు చేయడానికి మాత్రమేనని చెప్పుకొచ్చారు. వాటిని అమలు చేసేది స్థానికంగా ఉండే రాష్ట్ర ప్రభుత్వాలు, అధికార యంత్రాంగమని తెలిపారు. కేంద్రంలో మెజారిటీ ఉందని ప్రధానిగా ఉన్న ఎవరైనా తనకు తనకు రాజుగా 2/3 మెజారిటీతో చట్టం చేసుకుంటే ఒప్పుకోరు కదా అని ప్రశ్నించారు. డిక్టేటర్‌షిప్‌ని ఎవరూ ఒప్పుకోరని చెప్పారు. ఏపీలో ప్రతిపక్షానికి కేవలం 11 సీట్లే ఉన్నాయని రేవంత్‌రెడ్డి తెలిపారు. నియోజకవర్గాల పునర్విభజనకు అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేయాలని, నిపుణులతో చర్చించాలని, ప్రతి రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయాలు తెలుసుకోవాలని, ప్రతి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి జాతీయ ఏకాభిప్రాయ సాధనకు కృషి  చేయాలని  ముఖ్యమంత్రి సూచించారు. ఆయా రాష్ట్రాలతో సంప్రదించి శాసనసభల్లో స్థానాల సంఖ్య పెంచవచ్చని సీఎం అన్నారు. బిల్లును అడ్డుకోకుంటే డీలిమిటేషన్ పేరుతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసేవారని ధ్వజమెత్తారు. నార్త్, సౌత్ మధ్య అంతరాలు పెట్టే విధానం ఇకనైనా మార్చుకోవాలని బీజేపీకి సీఎం రేవంత్ రెడ్డి హితవు పలికారు. ఇక బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీల మనుగడ భవిష్యత్తులో కష్టంగా ఉంటుందని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. టీడీపీ, చంద్రబాబు నాయుడు పరిస్థితి కూడా అలాగే అవుతుందని పేర్కొన్నారు. నితీశ్ కుమార్, ఏక్‌నాథ్ షిండేలా పరిస్థితి మనం ఇప్పుడు చూస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం బీజేపీకి కేంద్రంలో సీట్లు తక్కువగా ఉన్నాయి కాబట్టి టీడీపీకి ప్రాముఖ్యత ఇస్తోందన్నారు.
కాంగ్రెస్‌తోనే మహిళా సాధికారిత
మహిళా రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్దిని ఏ ఒక్కరూ ప్రశ్నించలేరని  సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అగ్రరాజ్యం అమెరికాలో ఓటు హక్కు కోసం మహిళలు 150 సంవత్సరాలు పోరాడారని, కానీ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన వెంటనే మహిళలకు ఓటు హక్కు కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని గుర్తు చేశారు. దేశానికి మహిళా రాష్ట్రపతి, ప్రధానమంత్రిలను కాంగ్రెస్ అందించిందని, లోక్‌సభ స్పీకర్‌గా, అనేక రాష్ట్రాల్లో గవర్నర్లు, ముఖ్యమంత్రులుగా మహిళలను కాంగ్రెస్ పార్టీ చేసిందని సీఎం తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి స్వాతంత్య్రానికి పూర్వమే మహిళలు అధ్యక్షులుగా ఎన్నికయ్యారని, స్వాతంత్య్రానంతరం ఇందిరా గాంధీ, సోనియా గాంధీ అధ్యక్షులుగా సేవలందించారని గుర్తు చేశారు. రాజీవ్ గాంధీ స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు తీసకొచ్చారని, దాని ఫలితమే ఇప్పుడు దేశంలో పలు ప్రాంతాల్లో స్థానిక సంస్థల్లో మహిళల ప్రాతినిధ్యం 50 శాతానికి చేరుకుందని చెప్పారు. 1980లో ఏర్పడిన బీజేపీకి ఇప్పటివరకు 15 మంది అధ్యక్షులైతే అందులో ఒక్కరూ కూడా మహిళ లేరని అన్నారు. అలాంటి బీజేపీ మహిళా రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీని ఎలా విమర్శిస్తుందని సీఎం ప్రశ్నించారు. సమావేశంలో ఎంపీలు డాక్టర్ మల్లు రవి, సురేష్ షెట్కార్, బలరాం నాయక్, విప్‌లు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు మల్‌రెడ్డి రంగారెడ్డి, బుయ్యాని మనోహర్ రెడ్డి, తూడి మేఘా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
——————————————————————————————————————————————————————

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.