అభిజీత్ దీప్కే, నేహా బోరా విడుదల

– సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా ఇంకా తిహార్ జైలులోనే
– దిల్లీలో నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ భారీ నిరసన సభ
– జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్తో ఉద్యమం మరింత ఉధృతం
– సీఈసీ తొలగింపునకు డీఎంకే తీర్మానం

ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి, దిల్లీ, అక్టోబర్ 17: ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా, వోటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) నిలిపివేత డిమాండ్లతో దేశవ్యాప్తంగా కొనసాగుతున్న నిరసనల్లో శనివారం మూడు కీలక పరిణామాలు చోటుచేసు కున్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవ స్థాపకుడు అభిజీత్ దీప్కేను దిల్లీ ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ షరతులతో షరతులతో విడుదల చే శారు. అఖిల భారత విద్యార్థి సంఘం (ఐసా) అధ్యక్షురాలు నేహాబోరా పోలీసుల నిర్బంధం నుంచి విడుదలయ్యారు. మరోవైపు నవంబర్ 1న ఢిల్లీలోని రామ్జీలా మైదాన్ లో భారీ నిరసన సభ నిర్వహించేందుకు కాంగ్రెస్కు పోలీసులు నిరభ్యంతర పత్రం జారీ చేశారు.

ఏడాదిపాటు శాంతిభద్రతల పూచీకత్తుపై దీప్కే విడుదల

ఈనెల‌ 16న కన్నాట్ ప్లేస్ లో జాతీయ పతాకాలతో నిర్వహించతలపెట్టిన ‘లెహ్రా దో తిరంగా’ ప్రదర్శనకు వెళ్లకుండా అభిజీత్ దీప్కేను పోలీసులు నిర్బంధించిన విషయం తెలిసిందే. ఆయనను మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్లోని ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఎదుట శనివారం హాజరుపరిచారు. భారతీయ నాగరిక సురక్షా సంహిత సెక్షన్లు 126, 170 కింద నిరోధక చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. విచారణ అనంతరం ఏడాదిపాటు శాంతిభద్రతలకు విఘాతం కలిగించబోనని పూచీకత్తు సమర్పించే షరతుతో దీప్కే విడుదలకు అనుమతించారు. 10న మొదటిసారి నిర్బంధానికి గురైనప్పుడు కూడా ఆయన రూ.50 వేల పూచీకత్తు సమర్పించారు. ఆరు రోజుల వ్యవధిలో మరోసారి నిర్బంధానికి గురై కొత్త పూచీకత్తు సమర్పించాల్సి రావడం గమనార్హం. సీజేపీ న్యాయ విభాగం అధిపతి రత్నా సింగ్ ఈ నిర్బంధం చట్టబద్ధతను ప్రశ్నించారు.

నేహా బోరా విడుదల

ఈనెల‌ 16న మండీ హౌస్ ప్రాంతంలో నిర్బంధానికి గురైన నేహా బోరాను శనివారం తెల్లవారుజామున విడుదల చేశారు. దిల్లీ పోలీసు చట్టంలోని సెక్షన్ 65 ప్రకారం అవస రమైన ప్రక్రియ పూర్తయిన అనంతరం విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. విదుదల అనంతరం నేహా బోరా పోలీసుల తీరును తీవ్రంగా విమర్శించారు. తనను నిర్బంధించిన తర్వాత న్యాయవాదులను కలుసుకునేందుకు గంటల తరబడి అనుమతించలేదని ఆరోపించారు. న్యాయవాదులు ఐదారు గంటలపాటు తనను సంప్రదించేందుకు ప్రయత్నించారన్నారు. సాధారణ పౌరులు తమ వోటు హక్కును పరిరక్షించాలని కోరుతున్నారని, వారిని నేరస్థులుగా పరిగణించడం సమంజసం కాదని వ్యాఖ్యానించారు. ఎస్ఐఆర్ ప్రక్రియను నిలిపివేయాలని, జ్ఞానేశ్ కుమార్ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. నిరసనల సందర్భంగా నిర్బంధానికి గురైన ఇతర కార్యకర్తలను కూడా విడుదల చేయాలని కోరారు.

సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా ఇంకా తిహార్ జైలులోనే

దీప్కే, నేహా బోరా విడుదలైనప్పటికీ సీజేపీ నాయకులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా జ్యుడిషియల్ కస్టడీ కొనసాగుతోంది. అక్టోబర్ 13న జంతర్మంతర్ లోకి ప్రవేశించి జాతీయ పతాకాన్ని ప్రదర్శించిన ఘటనకు సంబంధించి ఈనెల‌ 14న వారిని ఐదు రోజుల కస్టడీకి పంపారు. సౌరవ్ దాస్ ను జైలు నంబర్ 2లోని మూడో వార్డులో, అశుతోష్ రాంకా ను జైలు నంబర్ 4లోని పదిహేనో వార్డులో ఉంచినట్లు జైలు వర్గాలు తెలిపాయి. వారి కదలికలను సీసీటీవీ ద్వారా పర్యవేక్షిస్తున్నారు.

 1న రామ్ లీలా మైదాన్ లో కాంగ్రెస్ భారీ సభ

శనివారం నాటి మరో ముఖ్యమైన పరిణామం కాంగ్రెస్ ప్రతిపా దిత భారీ సభకు దిల్లీ పోలీసులు అనుమతి ఇవ్వడం. దిల్లీ సెంట్రల్ డీసీపీ రోహిత్ రాబీర్ సింగ్ వెల్లడించిన వివరాల ప్రకారం నవంబర్ 1న రామ్జీలా మైదాన్లో సభ నిర్వహించేందుకు కాంగ్రెస్కు ఎన్వోసీ జారీ చేశారు. అంతకుముందు మైదానం అందుబాటులో ఉన్న తేదీలపై దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ను కాంగ్రెస్ సంప్రదించింది. అక్టోబర్ 25 నుంచి నవంబర్ 3 వరకు మైదానం అందుబాటులో ఉంటుందని మున్సిపల్ అధికారులు ధ్రువీకరించారు.

జ్ఞానేశ్ కుమార్ ను తొలగించాలి: డీఎంకే తీర్మానం

తమిళనాడులో మరో రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. ఎం.కె. స్టాలిన్ అధ్యక్షతన చెన్నైలో డీఎంకే పార్లమెంటరీ పార్టీ నాలుగు తీర్మానా లను ఆమోదించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ను తక్షణమే పదవి నుంచి తొలగించాలని, ఆయన వ్యవహారశైలిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది.

బెంగళూరు, ముంబయిలో కొనసాగుతున్న నిరసనలు

ఈనెల‌ 16న దిల్లీతోపాటు బెంగళూరు, ముంబయి, పాట్నాలో కూడా సీజేపీ అనుకూల నిరసనలు జరిగాయి. బెంగళూరులో జాతీయ పతాకా లతో ప్రదర్శన నిర్వహించారు. ముంబయి, పాట్నాలో చిన్నస్థాయి కార్య క్రమాలు జరిగాయి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *