– మీ గుండె గురించి మీ స్మార్ట్‌వాచ్ హెచ్చరించవచ్చు
– ప్రపంచ హార్ట్ రిథమ్ వీక్ సందర్భంగా కేర్ వైద్యులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 4: ‘మీ గుండె స్పందన సక్రమంగా లేదు’ అని స్మార్ట్‌వాచ్ హెచ్చరిస్తే దానిని తేలిగ్గా తీసుకోకండి. చాలామంది దీనిని పరికరం లోపం, ఒత్తిడి లేదా నిద్రలేమి కారణంగా వచ్చి ఉండొచ్చని భావించి నిర్లక్ష్యం చేస్తారు. ఇటీవలి కాలంలో ఇలాంటి అలర్ట్‌లతో వైద్యులను సంప్రదిస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని, అనేకమందిలో ముందుగా గుర్తించని గుండె లయ లోపాలు బయటపడుతున్నాయని కేర్ హాస్పిటల్స్ వైద్యులు చెబుతున్నారు. స్మార్ట్‌వాచ్‌లు లేదా ఫిట్‌నెస్ ట్రాకర్లలో అసాధారణ గుండె స్పందనలకు సంబంధించిన అలర్ట్‌లు వచ్చిన తర్వాత వైద్యులను సంప్రదిస్తున్న రోగుల సంఖ్య పెరుగుతోందని వెల్లడించారు. అనేక సందర్భాల్లో ఈ సాధారణ నోటిఫికేషన్‌లే ముందుగా గుర్తించని గుండె లయ లోపాలను వెలికితీసి స్ట్రోక్, గుండె వైఫల్యం, ఆకస్మిక గుండె ఆగిపోవడం వంటి తీవ్రమైన సమస్యలను నివారించడంలో సహాయపడుతున్నాయన్నారు. ఈనెల 1 నుండి 7వ తేదీ వరకు నిర్వహిస్తున్న ప్రపంచ హార్ట్ రిథమ్ వీక్ సందర్భంగా వైద్యులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. గుండె దడ, వేగంగా గుండె కొట్టుకోవడం, తల తిరగడం, కారణం లేకుండా అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా స్మార్ట్‌వాచ్‌లో అసాధారణ గుండె స్పందనలకు సంబంధించిన హెచ్చరికలు వచ్చినప్పుడు వాటిని నిర్లక్ష్యం చేయవద్దని సూచిస్తున్నారు. ప్రతి అలర్ట్ తీవ్రమైన సమస్యకు సంకేతం కాకపోయినా సరైన సమయంలో పరీక్షలు చేయించుకోవడం వల్ల అత్యవసర పరిస్థితులను నివారించవచ్చని చెబుతున్నారు. ప్రపంచ హార్ట్ రిథమ్ వీక్ అనేది గుండె లయ లోపాలపై అవగాహన పెంచడం, ముందస్తు నిర్ధారణ, సరైన చికిత్సను ప్రోత్సహించేందుకు అరిత్మియా అలయన్స్ నిర్వహించే అంతర్జాతీయ కార్యక్రమం. ఈ ఏడాది థీమ్ ‘మీ గుండె.. మీ స్పందన.. మీ జీవన కథ’. కాగా, గుండె లయలో వచ్చే మార్పులను ముందుగానే గుర్తించి సరైన సమయంలో వైద్య సలహా తీసుకోవాల్సిన అవసరాన్ని ఇది తెలియజేస్తోంది. గుండె లయ లోపాల్లో అత్యంత సాధారణమైన ‘ఏట్రియల్ ఫైబ్రిలేషన’లో గుండె స్పందన క్రమబద్ధంగా ఉండదు. ప్రపంచవ్యాప్తంగా ఆరు కోట్ల మందికిపైగా ఈ సమస్యతో బాధపడుతున్నారు. సరైన చికిత్స లేకపోతే స్ట్రోక్ ప్రమాదం ఐదు రెట్లు పెరిగే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
గుండె లయ లోపాలు కేవలం వృద్ధులకే పరిమితం కావడం లేదని నిపుణులు చెబుతున్నారు. పెరుగుతున్న ఒత్తిడి, శారీరక శ్రమ తగ్గిపోవడం, రక్తపోటు, మధుమేహం, ఊబకాయం, నిద్ర సమస్యలు, ఇతర గుండె సంబంధిత ప్రమాద కారకాలు యువతలోనూ, మధ్య వయసు వారిలోనూ ఈ సమస్యలు పెరగడానికి కారణమవుతున్నాయి. చాలా సందర్భాల్లో ఈ సమస్యల లక్షణాలు అప్పుడప్పుడు మాత్రమే కనిపించడం వల్ల వాటిని ఆందోళన, ఒత్తిడి లేదా అలసటగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. కొందరిలో మొదటి హెచ్చరికే స్ట్రోక్, స్పృహ కోల్పోవడం లేదా ఆకస్మిక గుండె ఆగిపోవడం రూపంలో కనిపిస్తుంది.
ఇటీవల కేర్ హాస్పిటల్స్‌లో 42 ఏళ్ల ఐటీ ఉద్యోగి చికిత్స పొందారు. ఆయనకు కొన్ని నెలలుగా గుండె వేగంగా కొట్టుకోవడం, తల తిరగడం, ఛాతీలో కంపిస్తున్నట్లు అనిపించడం వంటి లక్షణాలు కనిపించినప్పటికీ వాటిని ఉద్యోగ ఒత్తిడి, నిద్రలేమి కారణంగా భావించి నిర్లక్ష్యం చేశారు. తర్వాత ఒక్కసారిగా ఇంట్లోనే స్పృహ తప్పి పడిపోవడంతో హాస్పిటల్‌కు తరలించారు. పరీక్షల్లో తీవ్రమైన గుండె లయ లోపం ఉన్నట్లు గుర్తించి ప్రత్యేక ఎలక్ట్రోఫిజియాలజీ చికిత్స అందించారు. సమయానికి చికిత్స అందడంతో ఆయన పూర్తిగా కోలుకున్నారు. స్మార్ట్‌వాచ్‌లు వైద్య నిర్ధారణ పరికరాలు కాకపోయినా, ప్రారంభస్థాయి స్క్రీనింగ్‌లో ఉపయోగకరంగా మారుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. అనేక సందర్భాల్లో ఈ పరికరాల ద్వారా వచ్చిన అలర్ట్‌లు ముందుగా గుర్తించని ఏట్రియల్ ఫైబ్రిలేషన్ సహా పలు గుండె లయ లోపాలను గుర్తించడంలో సహాయపడుతున్నాయి.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు 
బంజారాహిల్స్‌లోని కేర్ హాస్పిటల్స్ కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజీ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ రామకృష్ణ ఎస్.వి.కె మాట్లాడుతూ ‘గుండె లయ లోపాలు చాలామందికి తెలియకుండానే ఉండే సాధారణ సమస్యలు. అసమాన గుండె స్పందన, తల తిరగడం, స్పృహ కోల్పోవడం, కారణం లేకుండా అలసట లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు.. ముందస్తు నిర్ధారణతో చాలా అరిత్మియాలను సమర్థవంతంగా నియంత్రించవచ్చు లేదా పూర్తిగా నయం చేయవచ్చు.. ఇటీవల స్మార్ట్‌వాచ్‌లలో వచ్చే అసాధారణ గుండె స్పందన హెచ్చరికల కారణంగా వైద్యులను సంప్రదించే వారి సంఖ్య పెరుగుతోంది.. ఈ పరికరాలు వైద్య నిర్ధారణకు ప్రత్యామ్నాయం కాకపోయినా ప్రజల్లో అవగాహన పెంచి సమయానికి వైద్య సలహా తీసుకునేలా ప్రోత్సహిస్తున్నాయి.. ఆధునిక కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజీ సాంకేతికతతో గుండె లయ లోపాలను ఖచ్చితంగా నిర్ధారించి సూక్ష్మ చికిత్సల ద్వారా సమర్థవంతంగా నిర్వహించగలుగుతున్నాం’ అని తెలిపారు. తరచూ గుండె దడ, ఛాతీలో కంపిస్తున్నట్లు అనిపించడం, కారణం లేకుండా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తల తిరగడం, స్పృహ కోల్పోవడం లేదా అసాధారణంగా వేగంగా లేదా నెమ్మదిగా గుండె కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. సరైన సమయంలో పరీక్షలు చేయించుకోవడం ద్వారా తీవ్రమైన గుండె లయ లోపాలను ముందుగానే గుర్తించి, వాటి వల్ల వచ్చే సంక్లిష్టతల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చని ఆయన తెలిపారు. తమ శరీరం ఇచ్చే సంకేతాలను గమనించాలని, స్మార్ట్‌వాచ్ హెచ్చరికలను నిర్లక్ష్యం చేయకుండా అవసరమైతే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని కేర్ హాస్పిటల్స్ ప్రజలకు సూచిస్తోంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





