పోల‌వ‌రంతో భ‌ద్రాచ‌లానికి ముంపు ప్ర‌మాదం

– గ్రామాలు, ప‌రిశ్ర‌మ‌ల‌కు జ‌ల‌గండ‌మే
– ముంపు బాధితుల‌కు త‌క్ష‌ణం న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాలి
-శాశ్వ‌త పున‌రావాసం క‌ల్పించాలి
-పీపీఏ సీఈఓకు మాజీమంత్రి హ‌రీష్‌రావు లేఖ‌
– పోల‌వ‌రం ప్రాజెక్టు అధికార్ల‌కు లేఖ అంద‌జేత‌

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 4: పోలవరం పూర్తి స్థాయి నీటి మట్టం 45.72 మీటర్లు కాగా, భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి కూడా సరిగ్గా అదే 45.72 మీటర్లు కావడం గమనార్హం.. దీంతో ప్రాజెక్టు పూర్తయితే భద్రాచలానికి ఎల్లప్పుడూ ముంపు ప్రమాదం పొంచివుంటుంద‌ని బీఆర్ ఎస్ నేత హ‌రీష్‌రావు, పీపీఏ సీఈఓకు రాసిన లేఖ‌లో వెల్ల‌డించారు. భద్రాచలం వద్ద గోదావరి నది లోతైన బెడ్ లెవల్ 26 మీటర్లు కాగా, పోలవరం పూర్తయితే బ్యాక్ వాటర్ ప్రభావంతో భద్రాచలంలో ఎప్పుడూ 13.15 మీటర్ల నుంచి 17.72 మీటర్ల మేర నీరు నిలిచి ఉంటుందన్నారు. 2021లో కాఫర్ డ్యామ్ పూర్తయిన తర్వాత వచ్చిన బ్యాక్ వాటర్‌తో 2022లో భద్రాచలం, బూర్గంపాడు, సారపాకల్లో భారీ నష్టం వాటిల్ల‌డ‌మే కాకుండా, భ్ర‌దాచ‌లం ప‌ట్ట‌ణం 40 శాతం జ‌ల‌మ‌య‌మై, లక్ష మందికి పైగా ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ప‌డ్డార‌ని గుర్తుచేశారు. 2022లో 22 లక్షల క్యూసెక్కులకే ఇంత నష్టం జరిగితే, భవిష్యత్తులో ప్రాజెక్టు డిజైన్ ప్రకారం 36 లక్షల నుంచి 50 లక్షల క్యూసెక్కుల వరద వస్తే తెలంగాణకు ఊహించని ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లుతుంద‌ని పేర్కొన్నారు. కేవలం గ్రామాలకే కాకుండా భారీ పరిశ్రమలకు కూడా బ్యాక్ వాటర్ ముప్పు వున్న‌ద‌న్నారు. దాదాపు 5 వేల కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్న ఐటీసీ పేపర్ బోర్డ్స్, హెవీ వాటర్ ప్లాంట్, దుమ్ముగూడెం జలవిద్యుత్ ప్రాజెక్టులకు అనుక్ష‌ణం ప్ర‌మాదం పొంచి వుంటుంద‌న్నారు. ఈ పరిశ్రమలతో పాటు 36 గ్రామాల పరిధిలోని 184 చదరపు కిలోమీటర్ల మేర ముంపు ప్రభావం పడుతోందని ఐఐటీ, వ్యాప్కోస్ అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ముంపు వల్ల పదే పదే నష్టపోతున్న సుమారు 2,000 కుటుంబాలకు తక్షణమే నష్టపరిహారంతో పాటు పూర్తి స్థాయి పునరావాసం కల్పించాలని హరీశ్ రావు  డిమాండ్ చేశారు. భద్రాచలం డ్రైనేజీ వ్యవస్థకు అనుసంధానంగా ఉన్న 8 అవుట్ ఫాల్ రెగ్యులేటర్లు బ్యాక్ వాటర్ ముప్పును ఎదుర్కొంటున్నాయి, కాబట్టి వరద నీటిని గోదావరిలోకి పంపేందుకు తక్షణమే పంపింగ్ స్టేషన్లు, ట్రీట్మెంట్ ప్లాంట్లు నిర్మించాలని కోరారు. భద్రాచలం వద్ద కొత్తగా 5 కిలోమీటర్ల మేర కరకట్టల నిర్మాణం చేపట్టడంతో పాటు, బూర్గంపాడు, సారపాక తదితర ముంపు గ్రామాలకు రక్షణ గోడలు నిర్మించి పరిహారం అందించాల‌ని కోరారు. తెలంగాణలో పోలవరం ముంపు సమస్యల పరిష్కారం, పునరావాస పనుల పర్యవేక్షణ కోసం భద్రాచలంలో వెంటనే ప్రత్యేకంగా పీపీఏ డివిజన్ ఆఫీసును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *