కాంగ్రెస్‌ పాలనలో విద్యుత్‌ వ్యవస్థ అస్తవ్యస్తం

– బొగ్గు కొరత.. ప్లాంట్ల మూత.. రైతులకు కష్టాలు
– జెన్‌కోకు సింగరేణి నాసిరకం బొగ్గు
– రూ.2,900 కోట్ల నష్టం
– బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపణ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబరు 23 : రాష్ట్రంలో విద్యుత్‌ సంక్షోభం నెలకొనడానికి కారణం కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనా వైఫల్యం, విద్యుత్‌ రంగంలో మిస్‌ మేనేజ్‌మెంట్‌, సింగరేణి–జెన్‌కో మధ్య ఆర్థిక వ్యవహారాల్లో గందరగోళమేనని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌ పెరుగుతున్న సమయంలో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో బొగ్గు కొరతతో ఉత్పత్తి పడిపోతున్నదని, మరోవైపు జల విద్యుత్‌ కేంద్రాలు కూడా నీటి లభ్యత లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. ఈ పరిస్థితులపై వాస్తవాలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు ఆరు బీఆర్‌ఎస్‌ బృందాలు రాష్ట్రంలోని థర్మల్‌ పవర్‌ ప్లాంట్లు, సింగరేణి ప్రధాన కార్యాలయాన్ని గురువారం సందర్శించనున్నాయని వెల్లడించారు. తెలంగాణ భవన్‌లో బుధవారం మీడియా సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు కరెంట్‌ విలాస వస్తువు కాదని, జీవన రేఖ అని అన్నారు. వ్యవసాయం, సాగు, తాగునీరు, పరిశ్రమలు, ఐటీ రంగం, గృహ అవసరాలు అన్నింటికీ విద్యుత్‌ అత్యంత కీలకమని చెప్పారు. విద్యుత్‌ సమస్యపైనే తెలంగాణ మలి దశ ఉద్యమానికి పునాది పడిందని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో 7,778 మెగావాట్ల స్థాపిత విద్యుత్‌ సామర్థ్యం ఉండగా బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్న పదేండ్లలో దాన్ని 19,472 మెగావాట్లకు పెంచామని కేటీఆర్‌ తెలిపారు. విద్యుత్‌ రంగంలో దాదాపు రూ.లక్ష కోట్లు పెట్టుబడి పెట్టామని చెప్పారు. 400 కేవీ సబ్‌స్టేషన్లను  28కు, 220 కేవీ సబ్‌స్టేషన్లను 51 నుంచి 103కు పెంచినట్టు వివరించారు. దాదాపు 30 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు 24 గంటల ఉచిత విద్యుత్‌ అందించామన్నారు. అప్పట్లో దేశంలోనే అత్యధిక ప్లాంట్‌ లోడ్‌ ఫ్యాక్టర్‌ సాధించిన విద్యుత్‌ కేంద్రాల్లో సింగరేణి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ కూడా ఒకటని కేటీఆర్‌ చెప్పారు. సింగరేణి విద్యుత్‌ కేంద్రం సుమారు 91 శాతం పీఎల్‌ఎఫ్‌తో పనిచేసిందని తెలిపారు. ప్రస్తుతం అదే సంస్థ, అదే విద్యుత్‌ వ్యవస్థ ఇబ్బందుల్లోకి వెళ్లిందని ఆరోపించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రైతులకు ఆరు గంటలకు మించి కరెంట్‌ సరఫరా కావడం లేదన్నారు. ప్రభుత్వం 24 గంటల విద్యుత్‌ ఇస్తున్నామని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందన్నారు. సబ్‌స్టేషన్ల వద్ద రైతుల ధర్నాలు, రాస్తారోకోలు జరుగుతున్నాయని చెప్పారు. విద్యుత్‌ కోతల ప్రభావం వ్యవసాయ రంగానికే పరిమితం కావడం లేదని, పరిశ్రమలు కూడా ప్రత్యామ్నాయ వనరులపై ఆధారపడుతున్నాయని తెలిపారు. దీనివల్ల పరిశ్రమల నిర్వహణ వ్యయం పెరిగే పరిస్థితి ఏర్పడుతున్నదన్నారు.

80ల నాటి పరిస్థితులు

సోషల్‌ మీడియాలో ‘80స్‌ ట్రెండ్‌’ నడుస్తున్న సమయంలో తెలంగాణలో మాత్రం 1980ల నాటి విద్యుత్‌ పరిస్థితులు తిరిగి వచ్చాయని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. అప్పట్లో రైతులు విద్యుత్‌ కోసం పడిన ఇబ్బందులు ఇప్పుడు మళ్లీ కనిపిస్తున్నాయన్నారు. విద్యుత్‌ కోతలతో పంటలు ఎండిపోయే పరిస్థితి, క్రాప్‌ హాలిడే ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నదని ఆరోపించారు. రానున్న వేసవిలో పరిస్థితి మరింత తీవ్రమైతే తాగునీరు, యాసంగి పంటలు, పరిశ్రమలకు విద్యుత్‌ సరఫరా వంటి అంశాలపై ప్రభుత్వం ఏం ప్రణాళికతో ముందుకెళ్తున్నదో చెప్పాలని ఆయ‌న‌ డిమాండ్ చేశారు. విద్యుత్‌ డిమాండ్‌ పెరుగుతున్న సమయంలో ఉత్పత్తి కేంద్రాలు వరుసగా నిలిచిపోవడంపై ప్రశ్నలు సంధించారు. 4,000 మెగావాట్ల సామర్థ్యం ఉన్న యాదాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌లో సుమారు 400 మెగావాట్లే ఉత్పత్తి అవుతున్నదని తెలిపారు. భద్రాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌లో 270 మెగావాట్ల సామర్థ్యం ఉన్న యూనిట్‌ నిలిచిపోయిందన్నారు. జైపూర్‌లోని సింగరేణి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ 1,200 మెగావాట్ల సామర్థ్యం కలిగి ఉండగా సుమారు 544 మెగావాట్ల స్థాయిలోనే ఉత్పత్తి జరుగుతున్నదని చెప్పారు. పలు థర్మల్‌ యూనిట్లలో బొగ్గు కొరతతో ఉత్పత్తి ప్రభావితమైందని ఆరోపించారు.

‘ఎల్‌నినో కాదు.. ఎల్‌ కాంగో’

విద్యుత్‌ సంక్షోభానికి ఎల్‌నినో ప్రభావమే కారణమన్న వివరణను కేటీఆర్‌ తిరస్కరించారు. ‘ఇది ఎల్‌నినో కాదు.. ఎల్‌ కాంగో’ అంటూ కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని విమర్శించారు. విద్యుత్‌ సంక్షోభానికి ప్రధాన కారణాల్లో సింగరేణి బొగ్గు సరఫరా వ్యవస్థ కూడా ఒకటని కేటీఆర్‌ ఆరోపించారు. జెన్‌కోకు నాణ్యమైన బొగ్గు అందించాల్సిన సింగరేణి తక్కువ నాణ్యత కలిగిన జి-13, జి-14 గ్రేడ్‌ బొగ్గును సరఫరా చేస్తున్నదన్నారు. నాసిరకం బొగ్గు వినియోగంతో విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం తగ్గడంతో రూ.2,900 కోట్ల ప్రజాధనం నష్టపోయిందని చెప్పారు. సింగరేణి నుంచి 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందంటూ దీనిలో సుమారు రూ.1,600 కోట్ల మేర అక్రమాలు జరిగాయన్న తమ పార్టీ ఆరోపణలను మరోసారి ప్రస్తావించారు. బొగ్గు నిల్వలు అందుబాటులో ఉంటే థర్మల్‌ పవర్‌ ప్లాంట్లు ఎందుకు నిలిచిపోతున్నాయని ప్రశ్నించారు. సింగరేణి నుంచి జెన్‌కోకు బొగ్గు సరఫరా, జెన్‌కో నుంచి సింగరేణికి రావాల్సిన బకాయిల వ్యవహారంపై కూడా ప్రశ్నలు లేవనెత్తారు. సింగరేణికి ప్రభుత్వం నుంచి సుమారు రూ.52 వేల కోట్ల బకాయిలు రావాల్సి ఉందని తెలిపారు. బకాయిల చెల్లింపులు నిలిచిపోవడం సంస్థ కార్యకలాపాలపై ప్రభావం చూపుతున్నదన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం సింగరేణి సంస్థతో ఫుట్‌బాల్‌ ఆట ఆడుతున్నదని కేటీఆర్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సింగరేణి కార్మికులు, రైతులు, పరిశ్రమలు, ఐటీ పార్కుల భవిష్యత్తుతో ఆటలాడే పరిస్థితి రావద్దన్నారు. బొగ్గు ఉత్పత్తి, సరఫరా, ఆర్థిక వ్యవహారాలు, పవర్‌ ప్లాంట్ల నిర్వహణపై ప్రభుత్వం సమగ్రంగా దృష్టి పెట్టాలని డిమాండ్‌ చేశారు. సింగరేణిలో ‘గ్రాస్‌ మిస్‌ మేనేజ్‌మెంట్‌ ఆఫ్‌ రిసోర్సెస్‌, గ్రాస్‌ మిస్‌ మేనేజ్‌మెంట్‌ ఆఫ్‌ ఫైనాన్సెస్‌, గ్రాస్‌ మిస్‌ మేనేజ్‌మెంట్‌ ఆఫ్‌ నేచురల్‌ రిసోర్సెస్‌’ జరుగుతున్నట్లు కేటీఆర్‌ ఆరోపించారు. సింగరేణి బొగ్గు ఉత్పత్తి 2023-24లో 70 మిలియన్‌ టన్నుల నుంచి 2025-26లో 58 మిలియన్‌ టన్నులకు పడిపోయిందని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఈ గణాంకాల ఆధారంగా సంస్థ పనితీరుపై ప్రభుత్వం సమగ్ర వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

కాంగ్రెస్‌ వచ్చింది.. కరెంట్‌ పోయింది

రాష్ట్రంలో విద్యుత్‌ సంక్షోభానికి ప్రకృతి పరిస్థితులే కారణం కాదని, కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనా వైఫల్యం, చేతకానితనం, మిస్‌ మేనేజ్‌మెంట్‌, కమీషన్లు, అవినీతి కారణమని కేటీఆర్‌ ఆరోపించారు. గత ప్రభుత్వం నిర్మించిన విద్యుత్‌ మౌలిక వసతులను సరిగా నిర్వహించకుండా ఉన్న వ్యవస్థను నాశనం చేసి, చిన్నాభిన్నం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ వచ్చింది.. కరెంట్‌ పోయింది అని వ్యాఖ్యానించిన కేటీఆర్‌ ఎన్నికల సమయంలో తాము చేసిన హెచ్చరికలే ఇప్పుడు నిజమవుతున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లిలోనూ రైతులు విద్యుత్‌ సమస్యపై రోడ్డెక్కారని గుర్తు చేశారు.

ఆరు బృందాలతో క్షేత్రస్థాయి పరిశీలన

విద్యుత్‌ వ్యవస్థపై తాము చేస్తున్న ఆరోపణలకు క్షేత్రస్థాయి ఆధారాలు సేకరించేందుకు ఆరు బృందాలను పంపుతున్నట్టు కేటీఆర్‌ ప్రకటించారు. యాదాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ను మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి నేతృత్వంలోని బృందం పరిశీలిస్తుంది. కొత్తగూడెం థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ను ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు ఆధ్వర్యంలోని బృందం సందర్శిస్తుంది. మణుగూరులోని భద్రాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ను మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు నేతృత్వంలోని బృందం పరిశీలించనుంది. భూపాలపల్లిలోని కాకతీయ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ను ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తదితరులు పరిశీలిస్తారు. జైపూర్‌లోని సింగరేణి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ను ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, అనిల్‌ జాదవ్‌, మాజీ మంత్రి జోగు రామన్న, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్‌, దివాకర్‌రావు తదితరులు సందర్శించనున్నారు. హైదరాబాద్‌లోని సింగరేణి ప్రధాన కార్యాలయాన్ని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్యే వివేకానందగౌడ్‌, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్‌, శంభీపూర్‌ రాజు తదితరులు పరిశీలిస్తారు. అన్ని అంశాలను పరిశీలించి వాస్తవాలను ప్రజల ముందుంచుతామని కేటీఆర్‌ తెలిపారు. రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ అందించాలని, పంటలు ఎండిపోకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసిన ఆయన ఆరు బృందాల నివేదికల అనంతరం పార్టీ తరఫున తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *