22-ఏతో భూ యజమానులకు ఇబ్బందులు

– ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్న ప్రభుత్వం
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 15 : రాష్ట్రంలో 22-ఏ నిషేధిత జాబితా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు ఆరోపించారు. గురువారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ చాలాచోట్ల 20-30 ఏళ్లుగా తమ ఆధీనంలో ఉన్న భూములను సైతం 22-ఏ నిషేధిత జాబితాలో చేర్చడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారన్నారు. తమ భూమి తమకు ఉంటుందో లేదోనన్న ఆందోళనతో బాధితులు కలెక్టరేట్ల చుట్టూ తిరగాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. 22-ఏ పేరుతో అవినీతి జరుగుతోందని, నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించుకోవాలంటే లంచాలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని అన్నారు. ఇదే నేపథ్యంలో రాష్ట్రంలో ఇటీవల అనేకమంది రెవెన్యూ అధికారులను ఏసీబీ పట్టుకుంటున్న ఘటనలు కూడా చూస్తున్నామన్నారు. శామీర్‌పేట మండలం బొమ్రాస్‌పేటలో సుమారు 1,500 ఎకరాల భూములను నిషేధిత జాబితాలో చేర్చడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని, ఆ రైతులు తమ సమస్య పరిష్కారం కోసం కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారని తెలిపారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లోనూ ఒక సర్వే నంబరులో ఏదో ఒక ప్లాట్ ప్రభుత్వ భూమి ఉందనే కారణంతో ఆ సర్వే నంబర్‌లోని మొత్తం భూమిని నిషేధిత జాబితాలో చేరుస్తున్న పరిస్థితులు ఉన్నాయన్నారు. దీంతో పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్రంగా నష్టపోతుండగా, బడా బాబులు, బిల్డర్లు లాభపడుతున్నారన్నారు. ప్రజల భూముల హక్కులను కాపాడాల్సిన ప్రభుత్వం నిషేధిత జాబితా పేరుతో వారిని ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. 22-ఏ జాబితాలో భూముల చేర్పు, తొలగింపుల ప్రక్రియలో పారదర్శకత ఉండాలని, బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ఈ అంశానికి సంబంధించిన పలు కీలక వివరాలను బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వెల్లడించారు. 22-ఏ సమస్యపై కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని రామచందర్‌రావు డిమాండ్ చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *