– ఎమ్మెల్సీ సర్వోత్తం రెడ్డి గెలుపే లక్ష్యం కావాలి
– రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి
వరంగల్/హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 15 : సింగరేణిలో 18 గనులను మూసివేసి 40 వేల మంది కార్మికుల జీవితాలను రోడ్డున పడేసిన చరిత్ర గత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. వరంగల్లో గురువారం నిర్వహించిన వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఉమ్మడి వరంగల్ జిల్లా సన్నాహక సమావేశంలో ఆయన ప్రసంగించారు. సింగరేణి విషయంలో ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు మొసలి కన్నీరు కారుస్తున్నారని, పదేళ్ల అధికారంలో గనుల వేలంపాటలో పాల్గొనకుండా సింగరేణికి అన్యాయం చేసిన మీకు ఈ అంశంపై మాట్లాడే నైతిక హక్కు లేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మూడు గనుల వేలం పాటలో పాల్గొని సింగరేణిని బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుందని మంత్రి స్పష్టం చేశారు. వరంగల్, నల్గొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సీపీఐతో కలిపి 32 స్థానాల్లో కాంగ్రెస్ పక్షం బలంగా ఉందని మంత్రి తెలిపారు. మిగిలిన రెండు నియోజకవర్గాల్లోనూ గతంలో కాంగ్రెస్కు గట్టి పట్టు ఉందని, దీన్ని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయంగా మలచుకోవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థి రామిరెడ్డి సర్వోత్తంరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించేందుకు ప్రతి నాయకుడు, కార్యకర్త కృషి చేయాలని కోరారు. గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు కాంగ్రెస్ శ్రేణులన్నీ సమన్వయంతో పనిచేసి పట్టభద్రుల ఓటర్లను కలిసి మొదటి ప్రాధాన్యత ఓటు సర్వోత్తం రెడ్డికి వేయించేలా కృషి చేయాలని సూచించారు. వచ్చే నెల 6 వరకు వోటు నమోదు, రెన్యువల్కు అవకాశం ఉన్న నేపథ్యంలో దసరా సహా పండుగలకు స్వగ్రామాలకు వచ్చే పట్టభద్రులను గుర్తించి అర్హులైన వారందరూ తమ వోటు హక్కును నమోదు చేసుకునేలా చూడాలన్నారు. ప్రభుత్వ పనితీరును ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఒక్క వరంగల్ జిల్లాలోనే సుమారు 47 వేల పట్టభద్రుల ఓట్లు ఉన్నాయని, అర్హులైన ఓటర్లందరి ఓటు నమోదు, రెన్యువల్పై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. ఎన్నికలకు ముందుగానే కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించడం పార్టీ ఎన్నికల సన్నద్ధతకు నిదర్శనమన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలు ప్రజలకు అనుకూలంగా పనిచేయాలంటే కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలని పొంగులేటి అన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో వోటు చోరీకి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే తదితరులు అండగా నిలుస్తున్నారని తెలిపారు. ఈ పోరాటానికి మరింత బలం చేకూర్చేలా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలన్న లక్ష్య సాధన దిశగా కాంగ్రెస్ శ్రేణులు ఐక్యంగా ముందుకు సాగాలన్నారు. బీఆరఎస్, బీజేపీ పరస్పర అవగాహనతో పనిచేస్తున్నాయంటూ ఆ పార్టీల వ్యూహాలను కాంగ్రెస్ కార్యకర్తలు సమర్థంగా తిప్పికొట్టాలని మంత్రి పొంగులేటి సూచించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





