కాళేశ్వరం ప్రాజెక్టు వివాదం, దాని పునరుద్ధరణపై న్యాయవాది శ్రీరాంభట్ల శరత్ కుమార్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు (జస్టిస్ బి. విజయ్‌సేన్ రెడ్డి బెంచ్), ఈనెల 15న కేంద్ర ప్రభుత్వానికి (కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ), రాష్ట్ర ప్రభుత్వానికి మరియు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్ ఏ) కు కీలక నోటీసులు జారీ చేసి, కేసు తదుపరి విచారణను కోర్టు ఈనెల 21కి వాయిదా వేసింది. 2023 అక్టోబర్‌లో మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోయినప్పటి నుండి, కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా నిరుపయోగంగా మారిందని, వర్షభావం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నప్పటికీ, గోదావరి నీరు వృధాగా సముద్రంలోకి పోతున్నా రాజకీయ కారణాల వల్ల మేడిగడ్డ పిల్లర్లను మరమ్మతులు చేయడం లేదని పిటిషనర్ పేర్కొన్నారు. పిటిషనర్ లేవనెత్తిన అంశాలను పరిశీలించిన హైకోర్టు ఈ అంశం అత్యంత సాంకేతికమైనది కావడంతో, ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలతో పాటు కన్నెపల్లి, సుందిళ్ల పంప్‌హౌస్‌ల రక్షణపై స్వతంత్ర సాంకేతిక తనిఖీ నిర్వహించి, ప్రాజెక్టును పాక్షికంగానైనా సురక్షితంగా ఉపయోగించుకునే అవకాశం ఉందో లేదో వివరణ ఇవ్వాలని ఎన్‌డీఎస్ ఏ తో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.
కోర్టు నోటీసులు ఒకవైపు, ప్రాజెక్టును పునరుద్ధరించడంలో ఆలస్యం జరుగుతోందన్న విమర్శలు మరోవైపు, కేంద్ర మరియు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాలు తమ చర్యలపై కోర్టుకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితిని సృష్టించాయి. ముఖ్యంగా విపక్ష బిఆర్ఎస్ పార్టీ ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసమే వాడుకుంటుందని తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్న నేపథ్యంతో పాటు, హైకోర్టు జోక్యంతో ఈ రాజకీయం మరింత వేడెక్కనుంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులు గమనిస్తే ప్రాజెక్టు నిలిచిపోవడం వల్ల రైతులకు సాగునీరు అందడంలేదు. అసలే ప్రాజెక్టు నుంచి నీరు రాక నానా ఇబ్బందులు పడుతున్న రైతులకు, ఎల్‌నినో ప్రభావం మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా మారింది. ప్రాజెక్టు గేట్లు ఎత్తకుండానే గోదావరి నీటిని ఎత్తిపోయడం వల్ల కొంతమేర పంటలను కాపాడవొచ్చునని బీఆర్ ఎస్ వాదిస్తుండగా, రేవంత్ ప్రభుత్వం మాత్రం ఎన్‌డీఎస్ఏ నిర్దేశాల మేరకు ఇది సాధ్యం కాదని తెగేసి చెబుతున్నది.
మరమ్మతులు పూర్తయిన తర్వాత మాత్రమే నీటిని ఒదులుతామని స్పష్టం చేస్తున్నది. ఇప్పుడు వివాదం కోర్టుకు చేరినందువల్ల, హైకోర్టు నోటీసులకు స్పందించి ఎన్ డీఎస్ ఏ ఒకవేళ ప్రాజెక్టును పాక్షికంగా వాడుకోవొచ్చని నివేదిక ఇస్తే, తక్షణమే రైతులకు కొంతమేర నీటిని పంపింగ్ చేసే అవకాశం లభిస్తుంది. ఎన్‌డీఎస్‌ఏ నివేదిక ప్రకారం బ్యారేజీల్లో నీటిని నిల్వ ఉంచడం దిగువ ప్రాంతాలకు ప్రమాదకరమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదివరకే పేర్కొన్న నేపథ్యంలో కోర్టు ఆదేశాల తర్వాత సాంకేతిక నిపుణుల కమిటీ మరిన్ని కఠినమైన భద్రతా చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. కోర్టు పర్యవేక్షణ పెరగడం వల్ల కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, రాష్ట్ర నీటిపారుదల శాఖలు సమన్వయంతో మరమ్మత్తు పనులను మరింత వేగవంతం చేయాల్సి వొస్తుంది. కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు నిరుపయోగంగా మారడం వల్ల రాష్ట్ర ఖజానాపై భారం పడుతున్నది . ఇప్పుడు కోర్టు ఆదేశాల ప్రకారం మళ్లీ స్వతంత్ర సర్వేలు, కొత్తగా రక్షణ చర్యలు చేపట్టడానికి అదనపు నిధులు కేటాయించక తప్పదు.
హైకోర్టు జారీ చేసిన నోటీసులకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఇచ్చే స్పందన పూర్తిగా సాంకేతిక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఎన్డీఎస్ ఏ కాళేశ్వరం ప్రాజెక్టు నుండి పాక్షికంగా నీటిని ఎత్తిపోయడానికి అనుమతి ఇస్తే, అది తెలంగాణ రాజకీయాలను పెద్ద కుదుపునకు లోను చేయక మానదు. డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021 ప్రకారం, ఎన్డీఎస్ఏ ఇప్పటికే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించి ప్రాథమిక నివేదికలను ఇచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) జూలై 21న తన తాజా సాంకేతిక అభిప్రాయాన్ని కోర్టుకు తెలియజేయనుంది. గోదావరి వరద నీరు వృధాగా సముద్రంలోకి పోతుండటం, రైతాంగం నుండి వొస్తున్న ఒత్తిడిని దృష్టిలో ఉంచుకుని, బ్యారేజీలకు పూర్తి ప్రమాదం కలగకుండా… తక్కువ నష్టం జరిగిన అన్నారం, సుందిళ్ల లేదా కన్నెపల్లి పంప్‌హౌస్ ద్వారా పాక్షికంగా నీటిని లిఫ్ట్ చేయడానికి గల నిబంధనలను ఎన్డీఎస్ఏ సూచించే అవకాశం ఉంది. ఒకవేళ ఎన్డీఎస్ఏ గ్రీన్ సిగ్నల్ ఇస్తే, అది కాంగ్రెస్ – బీఆర్ ఎస్ పార్టీల మధ్య పొలిటికల్ వార్‌ను మరింత పెంచుతుంది. “కాళేశ్వరం ఒక ఇంజనీరింగ్ అద్భుతం, చిన్న లోపాల వల్లే నీటిని ఎత్తట్లేదు తప్ప ప్రాజెక్టు డిజైన్ తప్పు కాదు” అని బీఆర్ఎస్ గట్టిగా వాదిస్తుంది. నీటిని లిఫ్ట్ చేయవొచ్చని తేలితే బిఆర్ఎస్ నేతలు దీనిని తమ నైతిక విజయంగా చెప్పుకుంటారు. కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్నాళ్లూ నీటిని ఎత్తకుండా రైతులను ఇబ్బంది పెట్టిందని, గోదావరి నీటిని సముద్రం పాలు చేసిందని కేసీఆర్, హరీష్ రావు, బిఆర్ఎస్ శ్రేణులు ప్రజల్లోకి వెళ్తారు. ఈ పని వారు ఇప్పటికే చేస్తున్నారు.
పాక్షికంగా నీటిని ఎత్తడానికి అనుమతి వొచ్చినా, మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోవడానికి గత బిఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి, నాణ్యతా లోపాలే కారణమని కాంగ్రెస్ తన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్లు మరియు పీసీ ఘోష్ కమిషన్ నివేదికల ద్వారా ప్రజలకు వివరిస్తుంది. తాము అధికారంలోకి వొచ్చిన తర్వాతే డ్యామ్ భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ, ఎన్‌డీఎస్‌ఏ నిబంధనల ప్రకారమే నడుచుకుంటున్నామని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వాదిస్తారు. ప్రజల భద్రతను పణంగా పెట్టకుండా సేఫ్ గా నీటిని అందిస్తున్న ఘనత తమదేనని క్రెడిట్ తీసుకుంటారు. మొత్తంగా, ఎన్డీఎస్ఏ గనుక పాక్షికంగా నీటిని ఎత్తడానికి అంగీకరిస్తే, అది ఉత్తర తెలంగాణ రైతులకు మేలు చేసినప్పటికీ… “కాళేశ్వరం రీ-డిజైన్ తప్పు” అని నిరూపించడానికి చూస్తున్న కాంగ్రెస్ కు కొంత రాజకీయ రక్షణ తగ్గి, “కాళేశ్వరం ద్వారా నీళ్లివ్వడం సాధ్యమే” అని చెప్తున్న బిఆర్ఎస్ కు ప్రజల్లో కొంత మైలేజ్ పెరిగే అవకాశం ఉంటుంది. ఈ సున్నితమైన అంశంపై కోర్టులో జూలై 21న జరిగే విచారణే అత్యంత కీలకం కానుంది.





