కాలం
ఏ గాలానికీ చిక్కుకోదు
గంట చుట్టూ గాలి ఉన్నా
గంటను మోగించలేదు
పెదవి కదపనంత వరకు
ఏ పదానికీ
ఉలుకూ పలుకూ ఉండదు
అలలు
ఎంత ఎత్తు ఎగరనీ
ఆకాశం
అణుమాత్రం కదలదు
మేఘాలన్నీ
గుంపు కట్టి నడిచినా
పక్షులన్నీ
బారులు తీరి సాగినా
నింగి మాత్రం ఒంటరి
తడియారని కళ్ళలో
దుఃఖం విస్ఫోటించదు
కార్చని కన్నీటి చుక్కలో
బాధ ఇమిడిపోదు
ఎంత వేడుకున్నా
విషాదం ప్రవాసం వెళ్ళదు
– కంచరాన భుజంగరావు





