భద్రాచలం, ప్రజాతంత్ర, నవంబర్ 27 : పవిత్రగోదావరి నదీ తీరాన బుధవారం నూతన శోభ సంతరించుకుంది. కార్తీక బహుళ ద్వాదశి వేళ సీతారామ చద్రస్వామి దేవాలయంలో బుధవారం అభిషేకం, సుదర్శన హోమం, రాత్రి నది హారతి తదితర పూజా కార్యక్రమాలు జరిగాయి. ముందుగా ఉదయం సుప్రబాత సేవ, అనంతరం ప్రాకార మండపంలో ఉత్సవ మూర్తులకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అలాగే కల్యాణ మూర్తులకు బేడా మండపంలో నిత్యకల్యాణం జరిగింది. చిత్తా నక్షత్రం సందర్బంగా యాగశాలలో సుదర్శన హోమం నిర్వహించారు. మాధ్యాహ్నిక ఆరాధన అనంతరం రాజభోగవ నివేదించారు. సాయంత్రం దర్బార్ సేవ తర్వాత సాయంత్రం దర్బారు సేవ, రామపాదకులను పల్లకిలో ఉంచి మేళాతాళాలు, కోలాటాలు చిన్నారుల నృత్యాలు, భక్తుల జయజయ ధ్వనాల మధ్య ఊరేగింపుగా గోదావరి తీరానికి తీసుకువెళ్ళారు. అక్కడ పూజాకార్యక్రమాలు నిర్వహించారు. ప్రధాన అర్చకులు హారతులు ఇవ్వడంతో నదీ తీరం పులకించింది. భక్తజనంతో కిటకిటలాడిరది. చల్లని గోదారమ్మ తల్లికి హారతులు పడుతూ భక్తులు తన్మయంలో మునిగితేలారు.
గోదావరి నదీ తీరంలో విద్యుత్ కాంతులీనుతుండగా పవిత్ర గోదావరి మాతకు హారతులు ఇస్తుంటే భక్తులు నేత్రానందంతో పరవశం చెందారు. భజన మండలి కోలాటాలు, భక్తుల జయ జయధ్వానాల నడుమ గోదావరి నది వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై పవిత్ర వేదమంత్రాలు చదివారు. అనంతరం మంగళహారతులు పట్టారు. మంగళవాయిద్యాలతో కీర్తనలు ఆలపించారు. అంతకముందు సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రముఖులు, స్వామీజీలకు అధ్యాత్మిక ప్రసంగం జరిగింది. అదే విధంగా వేదపఠనం నిర్వహించారు. హారతులు పడుతున్నారని, హరతి పట్టే ఒక్క వెలుగు కోటి ప్రాణులకు మంచి చేస్తుందని నమ్మకం.
అనంతరం అష్టోత్తర నామార్చనలు, సువర్ణ పుష్పాలతో పూజలతో వైభవంగా పూజలు జరిపారు. అనంతరం ప్రసాదం ఆరగింపు, మంగళ నీరాజన కార్యక్రమాలు కన్నుల పండుగగా నిర్వహించారు, గోదావరి నదీపూజ అత్యంత వైభవంగా జరిగింది. నదీమాతకు ఐదు రకాల హారతులను వేదమంత్రాల నడుమపట్టారు. అనంతరం నదీమాతకు నీరాజనం మహాహారతి అత్యంత వైభవంగా సాగింది. భద్రాచలం లో గోదారి నదికి పుణ్య హారతి కార్యక్రమాన్ని నిర్వహిండంతో గోదావరి నదీ తీరం భక్తులతో కిక్కిరిసి పోయింది. సాయంత్ర సమయంలో గోదావరి మహాహారతి కార్యక్రమంను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వేణుగోపాల్ దంపతులు, దేవస్థానం ఈఓ రమాదేవి, మరియు అర్చకులు పాల్గొన్నారు.