– మల్లూరు ఆలయ అభివృద్ధిపై మంత్రి సీతక్క సమీక్ష
– క్షేత్రస్థాయిలో పర్యటించి పనుల డిజైన్ ఖరారు చేస్తాం
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 19 : ములుగు జిల్లాలోని ప్రసిద్ధ మల్లూరు లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆలయ అభివృద్ధి పనులపై అధికారులతో సచివాలయంలో శనివారం సమీక్ష నిర్వహించారు. దేవాలయ ప్రస్తుత పరిస్థితి, భక్తుల రాకపోకలు, అందుబాటులో ఉన్న సౌకర్యాలు, భవిష్యత్ అవసరాలు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. దేవాలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతోపాటు, మల్లూరు క్షేత్ర ప్రాశస్త్యం, చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యతకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టాలని మంత్రి సీతక్క సూచించారు. అభివృద్ధి పనులలో భాగంగా కళ్యాణ మండపం, డార్మిటరీ, అన్నదాన సత్రం వంటి అవసరమైన మౌలిక వసతులను ఏర్పాటు చేయడంపై చర్చించి వాటి అభివృద్ధికి చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. అదేవిధంగా, దేవాలయ ప్రధాన నిర్మాణానికి ఎలాంటి ఇబ్బంది లేదా క్షేత్ర పవిత్రతను కాపాడుతూ అభివృద్ధి పనులు చేపట్టాలని మంత్రి స్పష్టం చేశారు. దేవాలయ నిర్మాణ స్వరూపం, పరిసర ప్రాంతాల ప్రత్యేకత, భక్తుల అవసరాలను పరిగణనలోకి తీసుకుని సమగ్ర ప్రణాళిక రూపొందించాలని ఆర్కిటెక్టులు, అధికారులను ఆదేశించారు. డిజైన్‌ను ఖరారు చేసేందుకు త్వరలో క్షేత్రస్థాయిలో సందర్శించి అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించాలని సమావేశంలో నిర్ణయించారు. నిర్మాణాలకు సంబంధించి భూమి స్థితిగతులు, నిర్మాణ సామర్థ్యం తదితర అంశాలను నిర్ధారించేందుకు రాక్ టెస్ట్‌ను త్వరితగతిన చేపట్టాలని నిర్ణయించారు. రాక్ టెస్ట్ నివేదిక ఆధారంగా తదుపరి నిర్మాణ పనులకు సంబంధించిన సాంకేతిక అంశాలను ఖరారు చేయనున్నారు. అభివృద్ధి పనులు నాణ్యతా ప్రమాణాలతో, సమన్వయంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చేపట్టాలని అధికారులకు సూచించారు. సమీక్షలో దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, ప్రముఖ ఆర్కిటెక్టులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





