50 మంది రైతులకు నోటీసులు

– 21న‌ ఆధారాలతో రావాలని త‌హ‌సీల్దార్ ఆదేశం
– ఎర్రవల్లిలో కేసీఆర్ ఫామ్‌హౌస్ భూముల సర్వే
– సర్వే నంబర్ 325 భూములపై తీవ్ర ఉత్కంఠ
మర్కుక్, ప్రజాతంత్ర,సెప్టెంబర్ 19 : మర్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్‌హౌస్ పరిధిలోని భూములపై రెవెన్యూ అధికారులు చేపట్టిన సర్వే నేపథ్యంలో తహసీల్దార్ కార్యాలయం రైతులకు అధికారికంగా నోటీసులు జారీ చేసింది. రెండు రోజుల నుంచి నాలుగు బృందాలుగా సర్వేయర్లు 388 ఎకరాల విస్తీర్ణంలో సర్వే చేస్తున్న విషయం తెలిసిందే. శనివారం మూడో రోజు శివర్ వెంకటాపూర్ శివారులో సర్వేయర్లు సర్వే నిర్వహించారు. అయితే ఈ సర్వేకు సంబంధించి తాజాగా మర్కుక్ తహసీల్దార్ కార్యాలయం నుంచి నోటీసు విడుదలైంది.ఈ సందర్భంగా ప్రభుత్వ భూములు మర్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామం సర్వే నం.325లో గల గైరాన్ ప్రభుత్వ భూమి,విస్తీర్ణం 388.05 గుంటలు సమగ్ర సర్వే నిర్వహించేందుకు సంబంధిత పట్టాదారులు, అనుభవదారులు 50 మంది రైతులకు నోటీసులు జారీ చేశారు. జిల్లా సర్వే, భూ రికార్డుల అధికారి ప్రొసీడింగ్స్ నం.A1/516/2026,సర్వే, సరిహద్దుల చట్టం 1923 ప్రకారం మొత్తం 388.05 గుంటల భూమికి సమగ్ర సర్వే నిర్వహిస్తామ‌ని నోటీసులో పేర్కొన్నారు. సర్వే నం.325లో ఉన్న రైతులు తమ భూమికి సంబంధించి పహాణీలో ఉన్న పట్టాదారులు, అనుభవదారులు 21న తమ భూమి వద్ద తగిన ఆధారాలతో తప్పనిసరిగా హాజరై తమ హద్దులను సర్వే అధికారులకు తెలపాలని తహసీల్దార్ ఆ నోటీసులో స్పష్టం చేశారు. ఈ నోటీసులతో ఎర్రవల్లిలో సర్వే మరింత ముమ్మరం కానుంది.
————————————————————————————————————————————————————–

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *