– టీజీఎస్ఏఏతో సాంకేతిక విద్యాశాఖ కీలక ఒప్పందం
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 19 : రాష్ట్రంలోని యువతకు విమానయాన రంగంలో నాణ్యమైన సాంకేతిక, ప్రాక్టికల్ శిక్షణ అందించేందుకు ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. హైదరాబాద్ పాత ఎయిర్‌పోర్టులోని తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ(టీజీఎస్ఏఏ)తో రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సచివాలయంలో ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు సమక్షంలో ఈ కీలక ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ద్వారా రామంతాపూర్‌లోని జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వ పాలిటెక్నిక్(జేఎన్‌జీపీ)లో నిర్వహించే మూడేళ్ల ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీరింగ్(ఏఎంఈ) ట్రైనింగ్ డిప్లొమా ప్రోగ్రాంకు మరింత ప్రాక్టికల్, పరిశ్రమ ఆధారిత శిక్షణ అందుబాటులోకి రానుంది. విద్యార్థులకు సైద్ధాంతిక విద్యతోపాటు లేబొరేటరీ ప్రాక్టికల్స్, విమానాల పరిచయం, ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్స్‌పై శిక్షణ, చివరి ఏడాదిలో పరిశ్రమ ఆధారిత ప్రాక్టికల్ వర్క్ ఎక్స్పీరియన్స్ కల్పించనున్నారు.
2,100 గంటల ప్రాక్టికల్ శిక్షణ
మొదటి రెండేళ్లల్లో జేఎన్‌జీపీ/టీజీఎస్ఏఏ ఆధ్వర్యంలో థియరీ, ల్యాబొరేటరీ ప్రాక్టికల్స్, ఎయిర్‌క్రాఫ్ట్ ఫ్యామిలియరైజేషన్, సిస్టమ్స్ ట్రైనింగ్ అందిస్తారు. చివరి ఏడాదిలో టీజీఎస్ఏఏలో 2,100 గంటల ప్రాక్టికల్ వర్క్ ఎక్స్పీరియన్స్/ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అందించడం ఈ ఒప్పందంలోని ప్రత్యేకత.
విమానయాన పరిశ్రమతో ప్రత్యక్ష అనుసంధానం
టీజీఎస్ఏఏ అనుభవజ్ఞులైన శిక్షకులను అందించడంతోపాటు ప్రాక్టికల్ లేబొరేటరీ సౌకర్యాలు, ప్రత్యేక విమానాల యాక్సెస్, విమాన నిర్వహణపై ప్రాక్టికల్ ఎక్స్పోజర్, మెయింటెనెన్స్ ఏరియాలో పని అనుభవాన్ని అందించనుంది. దీంతో విద్యార్థులకు ఎయిర్‌లైన్స్, ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్స్, ఎయిర్‌క్రాఫ్ట్ ఆపరేటర్లు, ఎమ్మార్వోలు, ఏరోనాటికల్ తయారీ, ఏరోస్పేస్ రంగాలపై ప్రత్యక్ష అవగాహన, పరిశ్రమ అనుభవం పొందే అవకాశం ఏర్పడుతుంది.
ఏవియేషన్ సేఫ్టీకి ప్రాధాన్యత
విమానయాన రంగంలో భద్రతా ప్రమాణాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, విద్యార్థులకు తప్పనిసరి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ బ్రీఫింగ్స్ నిర్వహించడంతోపాటు ఏఏఐ, బీసీఏఎస్ సంబంధిత నిబంధనలను పాటించేలా శిక్షణ అందించనున్నారు.
నైపుణ్యంతో కూడిన యువతకు బలమైన పునాది
ఈ భాగస్వామ్యం ద్వారా ప్రభుత్వ సాంకేతిక విద్యా వ్యవస్థను విమానయాన పరిశ్రమ అవసరాలతో అనుసంధానం చేయడం సాధ్యమవుతుంది. విద్యార్థులు తరగతి గది పరిజ్ఞానంతోపాటు వాస్తవ విమాన నిర్వహణ వాతావరణంలో ప్రాక్టికల్ అనుభవాన్ని పొందే అవకాశం ఉంటుంది. నిర్దేశిత శిక్షణ గంటలను పూర్తి చేసి 90 శాతం హాజరు, అవసరమైన పనితీరు ప్రమాణాలను పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్ జారీ చేయనున్నారు. ఈ అవగాహన ఒప్పందం ఐదేళ్లపాటు అమల్లో ఉంటుంది. పరస్పర అంగీకారంతో ఒప్పందాన్ని పునరుద్ధరించుకునే అవకాశం ఉంది. కాలేజియేట్ ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





